India vs Oman: ఒమన్‌పై మ్యాచ్‌ గెలిచాం కానీ.. ఈ లోపాలు ఏంటి? 8 మంది బౌలింగ్‌ చేసినా..?

ఆసియా కప్ 2025లో టీమిండియా గ్రూప్ దశను విజయంతో ముగించినప్పటికీ, ఒమన్‌తో జరిగిన చివరి మ్యాచ్‌లో బౌలింగ్ ప్రదర్శన ఆందోళన కలిగించింది. ఒమన్ 167 పరుగులు చేయడం ద్వారా టీమిండియా బౌలర్లను తట్టుకుంది. బుమ్రా, చక్రవర్తి విరామం తీసుకోవడం, బౌలింగ్ లైన్‌అప్ బలహీనంగా ఉండటం వంటి కారణాలను విశ్లేషించారు.

India vs Oman: ఒమన్‌పై మ్యాచ్‌ గెలిచాం కానీ.. ఈ లోపాలు ఏంటి? 8 మంది బౌలింగ్‌ చేసినా..?
Team India

Updated on: Sep 20, 2025 | 6:30 AM

ఆసియా కప్‌ 2025లో టీమిండియా గ్రూప్‌ దశను విజయంతో ముగించింది. ఒమన్‌తో జరిగిన చివరి నామమాత్రపు మ్యాచ్‌లో టీమిండియా 21 పరుగుల తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా గెలిచింది కానీ, ఇది టీమిండియా స్థాయి విజయం కాదని, ముఖ్యంగా బౌలింగ్‌లో టీమిండియా దారుణంగా విఫలం అయిందనే విమర్శలు క్రికెట్‌ అభిమానుల నుంచి వస్తున్నాయి. అందుకు కారణం.. టీమిండియా బౌలింగ్‌ ఎటాక్‌ను పసికూన ఒమన్‌ ఎంతో సమర్థవంతంగా ఎదుర్కొని 167 పరుగులు చేసింది. అది కూడా కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి.

ఈ మ్యాచ్‌లో టీమిండియా స్టార్‌ బౌలర్‌ జస్ప్రీత్‌ బుమ్రాతో పాటు వరుణ్‌ చక్రవర్తికి రెస్ట్‌ ఇచ్చారు. అయినా కూడా హార్ధిక్‌ పాండ్యా, అర్షదీప్‌ సింగ్‌, హర్షిత్‌ రాణా, కుల్దీప్‌ యాదవ్‌, అక్షర్‌ పటేల్‌, శివమ్‌ దూబేతో కూడిన మంచి బౌలింగ్‌ లైనప్ ఉందని అంతా అనుకున్నారు. కానీ 188 పరుగుల టార్గెట్‌ను ఒమన్‌ ముందు ఉంచి.. పవర్‌ ప్లేలో ఒక్క వికెట్‌ కూడా తీయ్యకపోగా.. మొత్తం 20 ఓవర్లలో కేవలం 4 వికెట్లు మాత్రమే పడగొట్టారు. ఒమన్‌ టాపార్డర్‌ బ్యాటర్లు చాలా అ‍ద్భుతంగా ఆడారు. అందులో ఎలాంటి డౌట్‌ లేదు. కానీ, టీ20లో వరల్డ్‌ ఛాంపియన్‌గా ఉన్న జట్టు ఓ ఇద్దరు బౌలర్లుకు రెస్ట్‌ ఇస్తే.. బౌలింగ్‌ ఇంత వీక్‌గా మారుతుందా అనే డౌట్‌ క్రియేట్‌ అయింది.

మొత్తంగా 8 మంది బౌలర్లను కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ ప్రయోగించాడు. కానీ, వారిలో కేవలం టాప్‌ 4 మాత్రమే ఒక్కో వికెట్‌ తీసుకున్నారు. ఆరుగురు బౌలర్లు 8కి పైగా ఎకానమీ నమోదు చేశారు. ఇది ఒక ఛాంపియన్‌ టీమ్‌ బౌలింగ్‌ ఎటాక్‌ లాగా అయితే అనిపించలేదని ప్రతి భారతీయ క్రికెట్‌ అభిమాని ఫీల్‌ అవుతున్నాడు. ఒమన్‌ లాంటి టీమ్‌ మనపై 4 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేస్తే.. పెద్ద టీమ్స్‌ ఎలా ఆడతాయంటూ ప్రశ్నలు వస్తున్నాయి. మరి దీనికి టీమిండియా బౌలర్లే తమ ప్రదర్శనతో సమాధానం చెప్పాలి.

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి