
India vs West Indies: టీ20 వరల్డ్ కప్ 2026లో టీమిండియా కీలక దశలో నిలిచింది. సూపర్ 8 దశలో చివరి మ్యాచ్‌లో వెస్టిండీస్‌తో తలపడే ముందు 10 ఏళ్ల క్రితం జరిగిన చేదు జ్ఞాపకం మళ్లీ అభిమానుల మదిలో తళుక్కుమంది. 2016లో మహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వంలో భారత జట్టుకు తగిలిన ఆ గాయం ఇప్పటికీ మర్చిపోలేనిది. ఇప్పుడు సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో ఆ పాత బాధకు ప్రతీకారం తీర్చుకునే సమయం వచ్చింది.
ఫిబ్రవరి 26న జరిగిన సూపర్ 8 గ్రూప్-1 మ్యాచ్‌ల ఫలితాలు భారత్‌కు ఊరట కలిగించాయి. దక్షిణాఫ్రికా వెస్టిండీస్‌ను ఓడించగా, భారత్ జింబాబ్వేపై 72 పరుగుల భారీ విజయం సాధించింది. దీంతో సెమీఫైనల్ మార్గం స్పష్టమైంది.
వెస్టిండీస్‌పై విజయం సాధిస్తే భారత్ సెమీఫైనల్‌లోకి.. ఓడితే టోర్నీ నుంచి నిష్క్రమణ..
మార్చి 1న కోల్‌కతాలోని చారిత్రాత్మక ఈడెన్ గార్డెన్స్ మైదానంలో ఈ మ్యాచ్ జరగనుంది. ఇది నిజంగా ‘డూ ఆర్ డై’ పోరాటం.
2016 టీ20 వరల్డ్ కప్ కూడా భారతదేశంలోనే జరిగింది. ఐసీసీ ప్రపంచకప్ (ICC Men’s T20 World Cup) సెమీఫైనల్లో భారత్ అద్భుత ప్రదర్శనతో ముందుకెళ్లినా, వెస్టిండీస్ చేతిలో 7 వికెట్ల తేడాతో ఓడిపోయింది.
ముంబైలోని వాంఖడే (Wankhede Stadium) వేదికగా జరిగిన ఆ మ్యాచ్‌లో భారత్ ముందుగా బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో 2 వికెట్లకు 192 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ 89* పరుగులతో అదరగొట్టాడు.
కానీ, వెస్టిండీస్ 19.4 ఓవర్లలోనే 193 పరుగుల లక్ష్యాన్ని చేధించింది. లెండల్ సిమ్మన్స్ 51 బంతుల్లో 82 పరుగులు చేసి మ్యాచ్‌ను తారుమారు చేశాడు. ఆండ్రే రస్సెల్ వేగవంతమైన ఇన్నింగ్స్‌తో విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఆ తర్వాత వెస్టిండీస్ ఇంగ్లండ్‌ను ఓడించి రెండోసారి టైటిల్ గెలిచింది. ఆ ఓటమి కోట్లాది భారత అభిమానుల గుండెల్లో ముద్ర వేసింది.
ప్రస్తుతం టీమిండియాకు నాయకత్వం వహిస్తున్న సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) ముందున్నది సవాళ్లు ఏంటో ఓసారి చూద్దాం..
సెమీఫైనల్‌కు జట్టును చేర్చడం
2016లో ధోని (MS Dhoni) సారథ్యంలో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకోవడం
జింబాబ్వేపై భారత్ 256 పరుగులు చేసి, ప్రత్యర్థిని 184 పరుగులకు పరిమితం చేసింది. అదే ధాటిని వెస్టిండీస్‌పై కూడా కొనసాగించాలనే లక్ష్యంతో సూర్య బ్రిగేడ్ సిద్ధమవుతోంది.
కోల్‌కతా ప్రేక్షకుల మద్దతు, జట్టు ఫామ్, స్పష్టమైన సమీకరణ.. ఇవి అన్నీ భారత్‌కు అనుకూలంగా కనిపిస్తున్నాయి. కానీ వెస్టిండీస్ వంటి ప్రమాదకర జట్టును తక్కువ అంచనా వేయలేం. ఈసారి భారత్ విజయం సాధిస్తే అది కేవలం సెమీఫైనల్ ప్రవేశమే కాదు, 10 ఏళ్ల పాత గాయానికి మధురమైన మందు కూడా అవుతుంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..