
India vs Pakistan Match Tickets: క్రికెట్ ప్రపంచంలో అత్యంత ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లలో ఒకటైన భారత్-పాకిస్తాన్ పోరు అంటే టికెట్లు విడుదలైన కొన్ని గంటల్లోనే హాట్ కేకుల్లా అమ్ముడైపోతుంటాయి. కానీ, ఈసారి ఆసియా కప్ 2025లో ఈ పరిస్థితికి పూర్తి విరుద్ధంగా జరుగుతోంది. సెప్టెంబర్ 14న దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరగనున్న భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌కు టికెట్లు ఇంకా అమ్ముడుపోలేదు. ఇది అభిమానులను, విశ్లేషకులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
సాధారణంగా ఈ మ్యాచ్‌లకు ఉన్న క్రేజ్ గురించి చెప్పనక్కర్లేదు. కానీ, ఈసారి అభిమానుల నుంచి ఆశించిన స్పందన ఎందుకు రాలేదనే దానిపై పలు కారణాలు విశ్లేషిస్తున్నారు.
అత్యంత ముఖ్యమైన కారణం ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) ఈసారి ప్రవేశపెట్టిన ‘ప్యాకేజ్ సిస్టమ్’. గతంలో మాదిరిగా ఒకే మ్యాచ్‌కు టికెట్లు కొనుగోలు చేసే అవకాశం లేకుండా, ఈసారి భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌ను ఇతర గ్రూప్ మ్యాచ్‌లతో కలిపి ప్యాకేజీగా విక్రయిస్తున్నారు. ఈ ప్యాకేజీలలోని టికెట్ ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కొన్ని ప్రీమియం ప్యాకేజీలు అయితే ఏకంగా రూ. 2.5 లక్షల వరకు ఉన్నాయి. కేవలం ఒకే మ్యాచ్ కోసం ఇంత భారీ మొత్తాన్ని వెచ్చించడానికి అభిమానులు వెనుకాడుతున్నారని తెలుస్తోంది.
నివేదికల ప్రకారం, VIP సూట్స్ ఈస్ట్‌లో ఇంకా టిక్కెట్లు మిగిలి ఉన్నాయి. టికెటింగ్ పోర్టల్స్ అయిన వయాగోగో, ప్లాటినంలిస్ట్‌లో రెండు సీట్ల ధర రూ. 2,57,815గా ఉంది. ఈ ప్యాకేజీలో మైదానానికి దగ్గర సీట్లు, అపరిమిత ఆహారం, పానీయాలు, పార్కింగ్ పాస్, VIP క్లబ్/లాంజ్‌కి యాక్సెస్, ప్రైవేట్ ఎంట్రీ ఉన్నాయి. రాయల్ బాక్స్‌లో కూడా టిక్కెట్లు మిగిలి ఉన్నాయి. దీని ధర ఇద్దరు వ్యక్తులకు రూ. 2,30,700 కాగా, స్కై బాక్స్ ఈస్ట్ ధర రూ. 1,67,851గా ఉంది.
పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్-పాకిస్తాన్ సంబంధాలలో మరింత ఉద్రిక్తత పెరిగింది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్‌తో మ్యాచ్ ఆడటంపై భారత్‌లో కొంతమంది అభిమానులు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. ఈ మ్యాచ్‌ను బహిష్కరించాలంటూ సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున డిమాండ్లు వినిపించాయి. ఈ రాజకీయ ఉద్రిక్తతలు కూడా టికెట్ల అమ్మకాలపై ప్రభావం చూపించి ఉండవచ్చని భావిస్తున్నారు. అయితే, బీసీసీఐ ఈ మ్యాచ్‌ను ఆడటానికి కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకుంది.
ఒక అభిమాని మాట్లాడుతూ, “కేవలం ఒక మ్యాచ్ కోసం ఇంత భారీ మొత్తాన్ని చెల్లించడం సరికాదు. పైగా, ఈ ప్యాకేజీలలో సూపర్ ఫోర్, ఫైనల్ మ్యాచ్‌లు లేకపోవడం కూడా నిరాశ కలిగించింది. ఒకవేళ నాకౌట్ మ్యాచ్‌లు కూడా ప్యాకేజీలో ఉంటే కొనుగోలు చేసేవాళ్ళం” అని పేర్కొన్నారు. ఈ నిరాశను అభిమానులు సోషల్ మీడియాలో కూడా వ్యక్తం చేస్తున్నారు.
ఏదేమైనా, భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ అసాధారణ పరిస్థితులు ఉన్నప్పటికీ, మ్యాచ్ తేదీ దగ్గరపడే కొద్దీ టికెట్ల అమ్మకాలు పుంజుకోవచ్చని ఆర్గనైజర్లు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. క్రికెట్ అభిమానులు ఈ హై-వోల్టేజీ మ్యాచ్‌ను చూడటానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..