
చాలా కాలంగా భారత్ వర్సెస్ పాకిస్థాన్(India vs Pakistan) మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు జరగడం లేదు. గత కొన్నేళ్లుగా ఇరు జట్లు ఐసీసీ ఈవెంట్లలో మాత్రమే తలపడుతున్నాయి. ప్రస్తుతం భారత్, పాకిస్థాన్ ఆటగాళ్ల గురించి పెద్ద అప్ డేట్ వస్తోంది. రెండు దేశాల ఆటగాళ్లు ఒకే జట్టులో ఆడే ఛాన్స్ ఉందంట. మీడియా నివేదికల ప్రకారం, రెండు దేశాలకు చెందిన ఆటగాళ్లు వచ్చే ఏడాది అంటే 2023లో ఒక జట్టు కోసం ఆడడాన్ని చూడవచ్చని తెలుస్తోంది. వచ్చే ఏడాది ఆఫ్రో ఆసియా కప్‌ను పునఃప్రారంభించే ప్రయత్నం జరుగుతోంది. ఇదే జరిగితే ఇరు దేశాల ఆటగాళ్లు ఒకే టీమ్‌లో కనిపించడం అభిమానులకు చాలా ఆసక్తిని కలిగిస్తుంది. ఎందుకంటే ఇప్పటివరకు ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ చూడటానికి అభిమానులు స్టేడియంకు వచ్చేవారు. ఇదే జరిగితే, ఇరు దేశాల ఆటగాళ్లు ఒకే జట్టులో ఆడతారు.
చివరిగా 2012-2013లో భారత్-పాకిస్థాన్ మధ్య ద్వైపాక్షిక సిరీస్ జరగ్గా, భారత్-పాకిస్థాన్ మధ్య చివరి టెస్టు మ్యాచ్ 2007లో జరిగింది. పాకిస్థానీ ఆటగాళ్లు ఐపీఎల్‌లో ఆడరు. అలాగే భారత ఆటగాళ్లు పాకిస్థాన్ సూపర్ లీగ్ ఆడరు. ఆఫ్రో ఆసియా కప్ గురించి మాట్లాడితే, ఈ టోర్నమెంట్ 2005, 2007లో రెండుసార్లు నిర్వహించారు. అయితే ప్రసార, రాజకీయ సమస్యల కారణంగా ఇది రద్దు చేశారు.
అప్పట్లో కలిసి ఆడిన ద్రవిడ్, అఫ్రిది..
ఈ టోర్నీలో భారత్‌కు చెందిన రాహుల్ ద్రవిడ్, వీరేంద్ర సెహ్వాగ్, పాకిస్థాన్‌కు చెందిన షోయబ్ మాలిక్, షాహిద్ అఫ్రిది ఆసియా జట్టు తరపున కలిసి ఆడారు. కాగా, దక్షిణాఫ్రికా, కెన్యా, జింబాబ్వే ఆటగాళ్లు ఆఫ్రో జట్టు తరఫున ఆడారు. ఈ టోర్నమెంట్ సరికొత్త ఎడిషన్ వచ్చే ఏడాది జూన్-జులైలో టీ20 ఫార్మాట్‌లో ఆడే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. బీసీసీఐ సెక్రటరీ, ఆసియా క్రికెట్ కౌన్సిల్ ప్రెసిడెంట్ జయ్ షా దీనిపై కసరత్తు చేస్తున్నారు. వచ్చే నెలలో జరగనున్న ఐసీసీ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఈ టోర్నీపై మరింత చర్చ జరగనుంది. నిజానికి, ఈ గేమ్ ఆసియాలో ఎంతగా విస్తరించిందో, అదే విధంగా ఆఫ్రికా దేశాల్లో కూడా ఈ గేమ్‌ను విస్తరించాలని, అక్కడ ఈ గేమ్‌ను అట్టడుగు స్థాయిలో బలోపేతం చేయాలని జైషా కోరుకుంటున్నారు. ఈ టోర్నమెంట్ ఆసియా క్రికెట్ కౌన్సిల్‌తో పాటు ఆఫ్రికన్ క్రికెట్ అసోసియేషన్ రెండింటికీ ప్రయోజనం చేకూరుస్తుంది.