AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇవాళే భారత్ vs హాంకాంగ్ మ్యాచ్.. ఎప్పుడు, ఎక్కడ, ఎలా చూడాలి..? పూర్తి వివరాలు ఇవే..

మహిళల టీ20 ఆసియా కప్‌లో టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. తొలి మ్యాచ్‌లో థాయ్‌లాండ్‌ను చిత్తు చేసి అదిరిపోయే బోణీ కొట్టిన భారత మహిళల జట్టు.. నేడు పసికూన హాంకాంగ్‌తో తలపడనుంది. అయితే మిడిలార్డర్ వైఫల్యాలు జట్టును కలవరపెడుతున్నాయి. పాకిస్థాన్‌తో జరిగే హై-వోల్టేజ్ మ్యాచ్‌కు ముందు భారత్ ఆ లోపాలను సరిదిద్దుకుంటుందా? ఈ మ్యాచ్‌ను ఎప్పుడు, ఎక్కడ, ఎలా చూడవచ్చో తెలుసుకుందాం.

ఇవాళే భారత్ vs హాంకాంగ్ మ్యాచ్.. ఎప్పుడు, ఎక్కడ, ఎలా చూడాలి..? పూర్తి వివరాలు ఇవే..
India Vs Hong Kong Women Asia Cup 2026
Krishna S
|

Updated on: Sep 03, 2026 | 12:53 PM

Share

మహిళల టీ20 ఆసియా కప్ 2026లో వరుసగా రెండో విజయంపై టీమిండియా కన్నేసింది. గురువారం దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరగనున్న గ్రూప్-ఎ రెండో మ్యాచ్‌లో పసికూన హాంకాంగ్‌తో భారత్ తలపడనుంది. తొలి పోరులో థాయ్‌లాండ్‌పై 94 పరుగుల భారీ తేడాతో గెలిచినప్పటికీ, జట్టును వెంటాడుతున్న బ్యాటింగ్ లోపాలు మేనేజ్‌మెంట్‌ను కలవరపెడుతున్నాయి. థాయ్‌లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఒక దశలో భారత్ 10 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 101 పరుగులతో పటిష్ట స్థితిలో నిలిచి 200 పైచిలుకు స్కోరు సాధించేలా కనిపించింది. అయితే అనూహ్యంగా కేవలం 29 పరుగుల వ్యవధిలోనే మిగిలిన 7 వికెట్లు కోల్పోయి 159 పరుగులకే పరిమితమైంది. చివర్లో వచ్చిన ఈ భారీ బ్యాటింగ్ కుంగుబాటు బలమైన జట్లతో తలపడేటప్పుడు తీవ్ర నష్టం చేకూర్చే ప్రమాదం ఉంది.

చివరి గ్రూప్ మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో పోరు ఉండటంతో పాటు ఆసియా కప్ ముగిసిన వెంటనే జపాన్‌లో జరగనున్న ఏషియన్ గేమ్స్ సవాలు కూడా ఎదురుగా ఉంది. ఈ క్రమంలో బలహీనమైన హాంకాంగ్‌తో మ్యాచ్ భారత్‌కు బ్యాటింగ్ లోపాలను సరిదిద్దుకునేందుకు సరైన అవకాశంగా నిలవనుంది. తొలి మ్యాచ్‌లో ఓపెనర్ షఫాలీ వర్మ 64 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడి శుభారంభం ఇచ్చింది. బౌలింగ్‌లో స్టార్ ఆల్‌రౌండర్ దీప్తి శర్మ పరుగులేమీ ఇవ్వకుండా 3 వికెట్లు పడగొట్టి, మహిళల టీ20 అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలోనే అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డు సృష్టించింది. స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన, గాయపడిన జెమీమా రోడ్రిగ్స్ స్థానంలో వచ్చిన ప్రతికా రావల్ శుభారంభాలను భారీ స్కోర్లుగా మలచాల్సి ఉంది. ముఖ్యంగా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ బ్యాటింగ్ ఫామ్‌పై విమర్శలు వస్తున్న వేళ, ఆమె నుంచి భారీ ఇన్నింగ్స్ జట్టుకు అత్యంత కీలకంగా మారింది.

మ్యాచ్ ఎప్పుడు? ఎక్కడ? ఎలా చూడాలి?

వేదిక: దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం, దుబాయ్

టాస్ సమయం: రాత్రి 7:30 గంటలకు

మ్యాచ్ ప్రారంభం : రాత్రి 8:00 గంటలకు

టీవీ లైవ్ టెలికాస్ట్: మన దేశంలో సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్ ఛానళ్లలో ప్రత్యక్ష ప్రసారం అవుతుంది.

డిజిటల్ లైవ్ స్ట్రీమింగ్: మొబైల్ లేదా స్మార్ట్ టీవీల్లో మ్యాచ్‌ను ఆన్‌లైన్‌లో చూడాలనుకునే వారు సోనీలివ్ యాప్, వెబ్‌సైట్ ద్వారా లైవ్ స్ట్రీమింగ్ వీక్షించవచ్చు.

హాంకాంగ్ ప్రతిఘటించేనా?

తొలి మ్యాచ్‌లో థాయ్‌లాండ్‌పై హాంకాంగ్ తీవ్రంగా పోరాడి కేవలం 6 పరుగుల తేడాతో ఓడింది. ఆ జట్టు ప్రధాన పేసర్ మెరీనా లాంప్లో (4/11) నిప్పులు చెరిగే బంతులతో భారత టాప్ ఆర్డర్‌ను కట్టడి చేసేందుకు సిద్ధంగా ఉండగా, అనుభవజ్ఞురాలైన ఆల్‌రౌండర్ క్యారీ చాన్ (28 పరుగులు) మిడిలార్డర్‌లో కీలకంగా మారనుంది.

Follow Us