IND vs ENG: టీమిండియా క్రికెటర్లను గ్రౌండ్‌ నుంచి బయటికి వెళ్లమన్న అంపైర్లు..! పంత్‌ సీరియస్‌

లీడ్స్‌లో జరుగుతున్న భారత్-ఇంగ్లాండ్ మధ్య తొలి టెస్ట్ మ్యాచ్‌ రెండో రోజు ఆసక్తికరంగా సాగింది. భారత్ 471 పరుగులతో ఆలౌట్ అయింది. జైస్వాల్, గిల్, పంత్ సెంచరీలు చేశారు. బుమ్రా 3 వికెట్లు తీసి ఇంగ్లాండ్‌కు షాక్ ఇచ్చాడు. అంపైర్లు ఆటను వివాదాస్పదంగా నిలిపివేయడం కూడా జరిగింది.

IND vs ENG: టీమిండియా క్రికెటర్లను గ్రౌండ్‌ నుంచి బయటికి వెళ్లమన్న అంపైర్లు..! పంత్‌ సీరియస్‌
Shubman Gill

Updated on: Jun 22, 2025 | 7:54 AM

లీడ్స్‌ వేదికగా భారత్‌, ఇంగ్లాండ్‌ మధ్య జరుగుతున్న తొలి టెస్ట్‌ ఆసక్తికరంగా మారింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్‌ తమ తొలి ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. ఓలీ పోప్‌ సెంచరీతో రాణించాడు. ప్రస్తుతం అతను నాలౌట్‌గా ఉన్నాడు. అతనితో పాటు హ్యారీ బ్రూక్‌ క్రీజ్‌లో ఉన్నాడు. ఈ మ్యాచ్‌లో ఓ వివాదాస్పద సంఘటన చోటు చేసుకుంది. అదేంటంటే.. టీమిండియా తొలి ఇన్నింగ్స్‌ ముగిసిన తర్వాత.. ఇంగ్లాండ్‌ బ్యాటర్లు బ్యాటింగ్‌కు దిగే ముందు.. అంపైర్లు ఆటను నిలిపివేశారు. అప్పటికే భారత క్రికెటర్లు గ్రౌండ్‌లోకి వచ్చేశారు. బుమ్రా కూడా తొలి ఓవర్‌ వేసేందుకు రన్నప్‌ వద్ద రెడీగా ఉన్నాడు.

ఇంతలో అంపైర్లు వర్షం వస్తుందంటూ ఆటను నిలిపి వేసి, భారత క్రికెటర్లను బయటికి వెళ్లాలని కోరారు. అప్పటికీ వర్షం రావడం లేదు. దీంతో భారత క్రికెటర్లు అయోమయానికి గురి అయ్యారు. అసంతృప్తిగానే గ్రౌండ్‌ వీడారు. వైస్‌ కెప్టెన్‌ రిషభ్‌ పంత్‌ అంపైర్లలో ఈ విషయంపై సీరియస్‌గానే మాట్లాడాడు. ఆ తర్వాత కొద్ది సేపటికి ఆట మొదలైంది. ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 471 పరుగులు చేసి ఆలౌట్‌ అయింది. ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ (101), కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌ (147), వైస్‌ కెప్టెన్‌ రిషభ్‌ పంత్‌ (134) సెంచరీలతో టీమిండియాకు భారీ స్కోర్‌ అందించారు.

తొలి రోజు కేవలం మూడు వికెట్లే కోల్పోయిన భారత్‌.. రెండో రోజు గిల్‌, పంత్‌ తర్వాత ఎవరూ పెద్దగా ప్రభావం చూపలేదు. మొత్తంగా 471 పరుగులకు ఆలౌట్‌ అయింది. ఇక తొలి ఇన్నింగ్స్‌కు దిగిన ఇంగ్లాండ్‌కు భారత బ్రహ్మాస్త్రం జస్ప్రీత్‌ బుమ్రా ఆరంభంలోనే షాక్‌ ఇచ్చాడు. ఇంగ్లాండ్‌ ఓపెనర్‌ జాక్‌ క్రాలేను తొలి ఓవర్‌లోనే అవుట్‌ చేసి గట్టి షాక్‌ ఇచ్చాడు. ఆ తర్వాత మరో ఓవపెనర్‌ బెన్‌ డకెట్‌ను, ఇంగ్లాండ్‌ బ్యాటింగ్‌కు వెన్నుముక లాంటి జో రూట్‌ను కూడా బుమ్రానే అవుట్‌ చేశాడు. మొత్తంగా రెండో రోజు ఆట ముగిసే సరికి ఇంగ్లాండ్‌ మూడు వికెట్లు కోల్పోయి 209 పరుగులు చేసింది. బుమ్రా ఒక్కడే మూడు వికెట్లు పడగొట్టాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..