India vs Bangladesh Test Series: బంగ్లాదేశ్‌తో చెన్నై వేదికగా జరిగే తొలి మ్యాచ్‌తో భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి సుదీర్ఘ విరామం తర్వాత టెస్టు క్రికెట్‌లో రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు. భారత మాజీ కెప్టెన్ కోహ్లీ జనవరి 2024 తర్వాత ఇప్పటి వరకు టెస్ట్ మ్యాచ్ ఆడలేదు. బంగ్లాదేశ్‌తో జరిగే తొలి టెస్ట్‌తో భారత జట్టులో పునరాగమనం చేయనున్నాడు. భారత్-బంగ్లాదేశ్ తొలి టెస్ట్ మ్యాచ్ సెప్టెంబర్ 19న చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో సౌరవ్ గంగూలీ పేరిట ఉన్న ఓ టెస్ట్ రికార్డును విరాట్ కన్నేశాడు. బంగ్లాదేశ్‌తో తొలి టెస్ట్‌కు టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్‌లో కోహ్లీ చోటు దక్కించుకుంటే అత్యధిక టెస్టులు ఆడిన భారత ఆటగాళ్ల జాబితాలో గంగులీని కోహ్లీ అధిగమిస్తాడు. అయితే ఈ జాబితాలో మరికొందరు దిగ్గజ ఆటగాళ్లు కోహ్లీ కంటే ముందు ఉంటారు.
విరాట్ కోహ్లీ, సౌరవ్ గంగూలీ ఇద్దరూ ఇప్పటి వరకు 113 టెస్ట్ మ్యాచ్‌లు ఆడారు. బంగ్లాదేశ్‌తో జరిగే చెన్నై టెస్ట్ మ్యాచ్ విరాట్‌కు 114వ టెస్టు మ్యాచ్ కానుంది. ఈ మ్యాచ్‌తో గంగూలీని కోహ్లీ అధిగమిస్తాడు. విరాట్ కోహ్లీ 2011లో వెస్టిండీస్‌పై టెస్ట్ క్రికెట్ అరంగేట్రం చేశాడు. ప్రారంభ టెస్ట్ మ్యాచ్‌లలో కాస్త తడబడినా.. ఆ తర్వాత విరాట్ ప్లేయింగ్ XIలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. కాగా గంగూలీ 1996లో ఇంగ్లండ్‌తో టెస్టు క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్‌లో చిరస్మరణీయమైన అరంగేట్రం చేసి సెంచరీతో కెరీర్‌ను ప్రారంభించాడు. అనంతర కాలంలో గంగూలీని భారత ఆల్ ఫార్మాట్ కెప్టెన్‌గా మార్చింది.
ఒకప్పుడు టీమిండియాకు అత్యంత సక్సస్‌ఫుల్ టెస్ట్ కెప్టెన్‌గా గంగూలీ గుర్తింపు సాధించాడు. గంగూలీ తన కెప్టెన్సీ కెరీర్‌ను 49 మ్యాచ్‌లలో 21 విజయాలతో ముగించాడు. అలాగే మరో సక్సస్‌ఫుల్ టెస్టు కెప్టెన్‌గా గుర్తింపు పొందిన విరాట్ కోహ్లీ..తన కెప్టెన్సీలో 68 మ్యాచ్‌ల్లో 40 విజయాలు సాధించాడు.
కాగా అత్యధిక టెస్టు మ్యాచ్‌లు ఆడిన భారతీయుల జాబితాలో సచిన్ టెండూల్కర్ అగ్రస్థానంలో ఉన్నాడు. ప్రపంచ టెస్ట్ క్రికెట్‌లో 200 టెస్టులు ఆడిన ఏకైక ఆటగాడు సచిన్. మాస్టర్ బ్లాస్టర్ తర్వాత 163 టెస్టులు ఆడిన రాహుల్ ద్రవిడ్ ఉన్నాడు. వీవీఎస్ లక్ష్మణ్ 134 టెస్టులు ఆడాడు. అతని తర్వాత వరుసగా అనిల్ కుంబ్లే (132), కపిల్ దేవ్ (131), సునీల్ గవాస్కర్ (125), దిలీప్ వెంగ్‌సర్కార్ (116) ఉన్నారు. వారి తర్వాత గంగూలీ, విరాట్ కోహ్లీ ఇద్దరూ 113 టెస్ట్ మ్యాచ్‌లు ఆడారు.
విరాట్‌కు ఇంకా సుదీర్ఘ కెరీర్ మిగిలి ఉంది. కోహ్లీ 150 కంటే ఎక్కువ టెస్ట్ మ్యాచ్‌లు ఆడే అవకాశముంది. అత్యధిక టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన భారత క్రికెటర్ల జాబితాలో కొన్నేళ్లలోనే విరాట్ కోహ్లీ మూడో స్థానంలో నిలిచే అవకాశముంది.