క్రికెట్‌లో లెఫ్ట్ ఆర్మ్ రిస్ట్ స్పిన్నర్లు తక్కువ మంది ఉన్నారు. ఆ జాబితాలో అమేజింగ్ బౌలర్‌గా పేరుపొందాడు ఆస్ట్రేలియా స్పిన్నర్ బ్రాడ్ హాగ్. తన స్పిన్‌తో ప్రత్యర్ధి బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టించాడు. గూగ్లీ, ఫ్లిప్పర్, స్లో బాల్.. ఇలా బ్రాడ్ హాగ్ స్పిన్ మాయాజాలంతో తన జట్టుకు పలు అద్భుతమైన విజయాలను అందించాడు. ఈరోజు అనగా ఫిబ్రవరి 6న, బ్రాడ్ హాగ్ పుట్టినరోజు. మరి అతడు సాధించిన రికార్డులపై ఓ లుక్కేద్దాం..
ఫస్ట్ క్లాస్ కెరీర్‌ను ఎడమ చేతివాటం బ్యాట్స్‌మెన్‌గా మొదలుపెట్టిన బ్రాడ్ హాగ్.. వెస్ట్రన్ ఆస్ట్రేలియా తరపున దేశవాళీ క్రికెట్ ఆడాడు. ఆ సమయంలో ఓ రోజు నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్న బ్రాడ్ హాగ్ బౌలింగ్ జట్టు కోచ్ టోనీ మాన్‌ను ఆకట్టుకుంది. తద్వారా అతడు స్పిన్ బౌలర్‌గా మారాడు. ఆపై ప్రపంచ వేదికలో అత్యుత్తమ లెఫ్ట్ ఆర్మ్ రిస్ట్ బౌలర్‌గా పేరు పొందాడు.
ఆస్ట్రేలియా తరపున బ్రాడ్ హాగ్ 26 ఆగష్టు 1996న శ్రీలంకతో తన మొదటి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. అనంతరం రెండు నెలలకు టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. ఈసారి వేదిక ఢిల్లీలోని ఫిరోజ్‌షా కోట్లా మైదానం. భారత్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో ఈ లెఫ్ట్ ఆర్మ్ రిస్ట్ బౌలర్ అంతగా ప్రభావం చూపలేకపోయాడు. తొలి ఇన్నింగ్స్‌లో 17 ఓవర్లకు మూడు మెయిడిన్లతో 69 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీశాడు. రెండో ఇన్నింగ్స్‌లో అస్సలు బౌలింగ్‌కు దిగలేదు. ఇక ఇందులో భారత్ ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది.
స్టువర్ట్ మెక్‌గిల్ మాదిరిగానే బ్రాడ్ హాగ్ కూడా షేన్ వార్న్ నీడలో అంతగా గుర్తింపు సాధించలేకపోయాడు. అయితే వార్న్ కారణంగానే అతడికి ప్రపంచకప్‌లో ఆడే అవకాశం వచ్చింది. వార్న్‌పై బ్యాన్ విధించడంతో దక్షిణాఫ్రికాలో జరిగిన 2003 ప్రపంచకప్‌లో హాగ్‌కి అవకాశం దక్కింది. ఫైనల్ మ్యాచ్ కూడా ఆడి వికెట్లు తీయడంలో సఫలమయ్యాడు. అనంతరం వార్న్ తర్వాత, హాగ్ కూడా ఆస్ట్రేలియా పరిమిత ఓవర్ల జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. వెస్టిండీస్‌లో ఆస్ట్రేలియా సాధించిన 2007 ప్రపంచకప్ విజయంలో కూడా బ్రాడ్ హాగ్ భాగమయ్యాడు.
హాగ్ టెస్టుల్లో కంటే వన్డేల్లోనే ఎక్కువ పేరు తెచ్చుకున్నాడు. 123 వన్డేలు ఆడిన హాగ్ 156 వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాత 2007-08లో రిటైర్మెంట్ ప్రకటించాడు. కాగా, హాగ్ గతంలో పోస్ట్‌మ్యాన్‌గా పనిచేశాడు. క్రికెట్‌కు రాకముందు తాను ఓ పోస్ట్‌మ్యాన్‌గా పని చేశానని హాగ్ స్వయంగా ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. ఆస్ట్రేలియన్ పోస్టల్ సర్వీస్ నాకు చాలా సహాయపడిందని.. మ్యాచ్‌ల సమయంలో సెలవు ఇచ్చారని చెప్పుకొచ్చాడు. ప్రాక్టీస్‌కు అనుగుణంగా షిఫ్ట్‌లు మార్చేవారు.