IND Vs ENG: ఎవడ్రా వైభవ్.! 72 ఫోర్లు, 8 సిక్సర్లతో విస్పోటనం.. ఇంగ్లీషోళ్లకు మరణశాసనం..

భారత అండర్-19 జట్టు ఇంగ్లాండ్ పర్యటనలో ఉంది. ఇంగ్లాండ్ అండర్-19 జట్టుతో రెండు మ్యాచ్‌ల యూత్ టెస్ట్ సిరీస్ ఆడుతోంది. ఈ సిరీస్‌లోని మొదటి మ్యాచ్‌లో భారత బ్యాట్స్‌మెన్లు అద్భుతమైన ఆటతీరు కనబరిచారు. 500 కంటే ఎక్కువ పరుగులు సాధించగలిగారు. ఆ వివరాలు..

IND Vs ENG: ఎవడ్రా వైభవ్.! 72 ఫోర్లు, 8 సిక్సర్లతో విస్పోటనం.. ఇంగ్లీషోళ్లకు మరణశాసనం..
Ind Vs Eng

Updated on: Jul 14, 2025 | 12:21 PM

ఇండియా అండర్-19, ఇంగ్లాండ్ అండర్-19 జట్ల మధ్య రెండు మ్యాచ్‌ల యూత్ టెస్ట్ సిరీస్‌ జరుగుతోంది. ఇందులో మొదటి మ్యాచ్ బెకెన్‌హామ్‌లోని కెంట్ కౌంటీ క్రికెట్ గ్రౌండ్‌లో జరుగుతోంది. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో భారత జట్టు అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించింది. దీంతో భారత్ అండర్-19 జట్టు 540 పరుగులకు ఆలౌట్ అయింది. భారత యువ ఆటగాళ్లు బజ్‌‌‌బాల్‌ను తనదైన శైలిలో అడ్డుకున్నారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ జట్టు.. జట్టు తొలి రోజు నుంచే దూకుడైన ఆటతీరుతో ఆకట్టుకుంది.

ఓపెనర్, కెప్టెన్ ఆయుష్ మాత్రే 102 పరుగుల కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. ఆ తర్వాత మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు వరుసగా పరుగులు వరద పారించారు. ఆట మొదటి రోజు ముగిసే సమయానికి భారత్ 450 పరుగులు చేయగా.. రెండో రోజు కూడా భారత బ్యాటర్లు తమ ఫామ్‌ను కొనసాగించి స్కోరును 540 పరుగులకు తీసుకెళ్లారు. ఈ సమయంలో టీమిండియా 72 ఫోర్లు, 8 సిక్సర్లు బాదేసింది. కెప్టెన్ ఆయుష్ మాత్రేతో పాటు విహాన్ మల్హోత్రా, అభిజ్ఞాన్ కుందు, రాహుల్ కుమార్, ఆర్.ఎస్. అంబరీష్ అర్ధ సెంచరీలు సాధించారు.

అభిజ్ఞాన్ కుందు 90 పరుగులు, రాహుల్ కుమార్ 85 పరుగులు, ఆర్.ఎస్. అంబరీష్ 70 పరుగులు, విహాన్ మల్హోత్రా 67 పరుగులు చేశారు. అయితే వైభవ్ సూర్యవంశీ మాత్రం 14 పరుగులకే పెవిలియన్ చేరాడు. అలాగే భారత జట్టు కేవలం 100 ఓవర్లలోనే 500 పరుగుల మార్కును చేరుకుంది. అదే సమయంలో 540 పరుగులు చేయడానికి 112.5 ఓవర్లు పట్టింది. ఈ సిరీస్‌కు ముందు రెండు జట్ల మధ్య 5 యూత్ వన్డే మ్యాచ్‌లు జరిగాయి. భారత అండర్-19 జట్టు ఈ సిరీస్‌ను 3-2 తేడాతో గెలుచుకుంది. ఈ సిరీస్‌లో వైభవ్ సూర్యవంశీ అద్భుతమైన బ్యాటింగ్ ఆడాడు. ఈ సిరీస్‌లోని ప్రతి మ్యాచ్‌లోనూ అతడు ఒక సెంచరీతో పాటు 30 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేశాడు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..