టీమిండియా ఆటగాళ్లు ఢిల్లీలో సౌతాఫ్రికా(IND vs SA)తో పోరుకు సిద్ధమయ్యారు. ఇరుజట్ల మధ్య ఐదు టీ20(T20)ల సిరీస్‌లో తొలి మ్యాచ్ నేడు జరగనుంది. అయితే ఢిల్లీ(Delhi)లో జరగనున్న ఈ తొలి మ్యాచ్‌కు ముందే నిబంధనల్లో మార్పులపై వార్తలు వినిపించాయి. ఢిల్లీలో దంచికొడుతోన్న ఎండ వేడిమితో బీసీసీఐ రూల్స్ మార్చాలని నిర్ణయించింది. జూన్‌లో ఢిల్లీలో ఉష్ణోగ్రత అధికంగా ఉంటుందనే సంగతి తెలిసిందే. ఈ వేడి మ్యాచ్‌పై ప్రభావం చూపడంతో బీసీసీఐ నిబంధనలలో స్వల్ప మార్పులు చేసింది.
ప్రస్తుతం ఢిల్లీలో ఉష్ణోగ్రత 45 దాటింది. ఇంతటి మండే వేడిలో ఆటగాళ్లు మైదానంలో ప్రదర్శన చేయడం కష్టంగా మారుతుంది. ఇటువంటి పరిస్థితిలో ఢిల్లీలో వేడి కారణంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకూడదనే ఉద్దేశ్యంతో బీసీసీఐ నిబంధనలలో మార్పులు చేసింది. ముల్తాన్‌లో పాకిస్థాన్, వెస్టిండీస్ మధ్య జరుగుతున్న వన్డే సిరీస్‌లోనూ ఈ మార్పు కనిపించింది. మ్యాచ్ టైమింగ్‌ను ముందుకు జరిపి, పాక్ వర్సెస్ వెస్టిండీస్ మ్యాచ్‌ను ఆడించగా, భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా మ్యాచ్‌లో డ్రింక్ బ్రేక్‌లకు సంబంధించిన మార్పులు చేశారు.
10 ఓవర్ల తర్వాత డ్రింక్స్ బ్రేక్..
ఢిల్లీలో వేడి నుంచి ఆటగాళ్లకు కాస్త రిలీఫ్ ఇచ్చేందుకు, తొలి టీ20లో 10 ఓవర్ల తర్వాత డ్రింక్ బ్రేక్ తీసుకోవాలని బీసీసీఐ నిర్ణయించింది. వేసవి కాలం దృష్ట్యా, భారత క్రికెట్ బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. సాధారణంగా అంతర్జాతీయ T20లో ఇన్నింగ్స్‌లో విరామం తీసుకోకూడదనేది నియమం. కానీ, ఢిల్లీలో హీట్ ఎక్కువగా ఉండడంతో బీసీసీఐ ఆ నిబంధనను మార్చాల్సి వచ్చింది.