IND vs SA 1st Test : ఈడెన్ గార్డెన్స్‌లో టీమిండియాకు డబుల్ షాక్.. తీవ్ర గాయంతో గిల్ రిటైర్డ్ హర్ట్

కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరుగుతున్న భారత్ వర్సెస్ సౌతాఫ్రికా తొలి టెస్ట్ మ్యాచ్ రెండో రోజు ఆటలో టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. దూకుడుగా ఆడుతున్న ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ వికెట్ కోల్పోయిన కొద్దిసేపటికే, కెప్టెన్ శుభమన్ గిల్ బ్యాటింగ్ చేస్తుండగా మెడ నొప్పి కారణంగా రిటైర్డ్ హర్ట్ అయ్యి పెవిలియన్‌కు వెళ్లారు.

IND vs SA 1st Test : ఈడెన్ గార్డెన్స్‌లో టీమిండియాకు డబుల్ షాక్.. తీవ్ర గాయంతో గిల్ రిటైర్డ్ హర్ట్
Shubman Gill Retired Hurt

Updated on: Nov 15, 2025 | 11:13 AM

IND vs SA 1st Test : కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరుగుతున్న భారత్ వర్సెస్ సౌతాఫ్రికా తొలి టెస్ట్ మ్యాచ్ రెండో రోజు ఆటలో టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. దూకుడుగా ఆడుతున్న ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ వికెట్ కోల్పోయిన కొద్దిసేపటికే, కెప్టెన్ శుభమన్ గిల్ బ్యాటింగ్ చేస్తుండగా మెడ నొప్పి కారణంగా రిటైర్డ్ హర్ట్ అయ్యి పెవిలియన్‌కు వెళ్లారు. దీంతో భారత్ బ్యాటింగ్‌పై ఒత్తిడి పెరిగింది.

తొలి రోజు ఆటలో జస్ప్రీత్ బుమ్రా నిప్పులు చెరిగే బౌలింగ్‌తో టీమిండియా ఆధిపత్యం చెలాయించింది. బుమ్రా 5 వికెట్లు తీయడంతో, సౌతాఫ్రికా జట్టు కేవలం 159 పరుగులకే ఆలౌట్ అయింది. ఈడెన్ గార్డెన్స్ పిచ్‌లో ఉన్న బౌన్స్ కారణంగానే సౌతాఫ్రికా బ్యాట్స్‌మెన్ కష్టపడ్డారని విశ్లేషకులు చెబుతున్నారు. ఆట ముగిసే సమయానికి భారత్ 1 వికెట్ కోల్పోయి 37 పరుగులు చేసింది.

రెండో రోజు ఆటను కేఎల్ రాహుల్, వాషింగ్టన్ సుందర్ మార్కో జెన్సన్ బౌలింగ్‌లో ప్రారంభించారు. రెండో రోజు తొలి ఓవర్‌లోనే కేఎల్ రాహుల్ బౌండరీ కొట్టగా, ఆ బౌండరీతో ఆయన టెస్ట్ క్రికెట్‌లో 4000 పరుగుల మైలురాయిని పూర్తి చేసుకున్నారు. రాహుల్, సుందర్‌లు ఇద్దరూ స్పిన్నర్ కేశవ్ మహారాజ్ బౌలింగ్‌లో షాట్లు ఆడుతూ స్కోరు బోర్డును ముందుకు నడిపారు.

అయితే, 29 పరుగులు చేసి మంచి టచ్‌లో ఉన్న వాషింగ్టన్ సుందర్‌ను హార్మర్ అవుట్ చేయడంతో భారత్‌కు రెండవ దెబ్బ తగిలింది. సుందర్ ఔటైన వెంటనే, బ్యాటింగ్‌కు వచ్చిన కెప్టెన్ శుభమన్ గిల్ మూడవ బంతిని స్వీప్ షాట్‌తో బౌండరీకి పంపారు. కానీ అదే షాట్ సమయంలో గిల్ మెడలో తీవ్రమైన నొప్పి రావడంతో, నొప్పి భరించలేక రిటైర్డ్ హర్ట్ అయ్యి వెంటనే మైదానాన్ని వీడారు. టీమిండియాకు ఇది ఆందోళన కలిగించే వార్త.

సుందర్ ఔట్, గిల్ గాయం కారణంగా పెవిలియన్ చేరడంతో కేఎల్ రాహుల్‌కు తోడుగా రిషబ్ పంత్ బ్యాటింగ్‌కు వచ్చారు. భారత్ జట్టు ఇంకా సౌతాఫ్రికా స్కోరు కంటే 122 పరుగులు వెనుకబడి ఉంది. పిచ్ కఠినంగా మారుతున్న నేపథ్యంలో రాహుల్, పంత్, ధ్రువ్ జురెల్ వంటి బ్యాట్స్‌మెన్ జాగ్రత్తగా ఆడి, సౌత్ ఆఫ్రికా స్కోరును దాటి, కనీసం 300 పరుగుల లక్ష్యాన్ని చేరుకోవాలని టీమిండియా ప్రయత్నిస్తోంది.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..