
if Pakistan boycotts only the India match?: బంగ్లాదేశ్‌ను టోర్నీ నుంచి తొలగిస్తూ ఐసీసీ తీసుకున్న నిర్ణయంపై పాకిస్థాన్ అసహనంగా ఉంది. ఇప్పటి వరకు బంగ్లాదేశ్ వెనుకాల అస్త్రం తిప్పిన పాక్.. ఈ నిర్ణయంతో దిక్కుతోచని స్థితిలో కూరుకుపోయింది. ఈ క్రమంలో తాజాగా టీ20 ప్రపంచకప్ నుంచి తప్పుకుంటామని కోతలు మొదలుపెట్టింది. అలాగే, భారత్ జట్టుతో మ్యాచ్ ను బహిష్కరిస్తామంటూ పుకార్లు మొదలుపెట్టింది. ఈక్రమంలో పాక్ జట్టు ఏం చేయాలనే దానిపై పాక్ ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనుందని పీసీబీ చీఫ్ మొహ్సిన్ నఖ్వీ ప్రకటించాడు. ఈ నిర్ణయం సోమవారం రావొచ్చని ఆయన తెలిపాడు.
ప్రపంచకప్ నుంచి తప్పుకోవడం ఒక అవకాశంగా ఉన్నప్పటికీ, ‘జియో న్యూస్’ సహా పాకిస్థానీ మీడియా నివేదికల ప్రకారం.. పాక్ మరో పరిమిత నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అదేమిటంటే.. టోర్నీలో పాల్గొంటూనే, చిరకాల ప్రత్యర్థి భారత్‌తో జరిగే హై-ప్రొఫైల్ గ్రూప్ మ్యాచ్‌ను మాత్రం బహిష్కరించాలని కోరుకుంటుంది.
భారత్ వర్సెస్ పాకిస్థాన్ మధ్య పోరు ఫిబ్రవరి 15న కొలంబోలో జరగాల్సి ఉంది. గ్రూప్-ఏలో భాగంగా జరిగే ఈ మ్యాచ్‌లో భారత్, పాక్‌లతో పాటు నమీబియా, నెదర్లాండ్స్, అమెరికా (USA) జట్లు ఉన్నాయి.
ఒకవేళ పాకిస్థాన్ భారత్‌తో మ్యాచ్ ఆడేందుకు నిరాకరిస్తే, ఆ మ్యాచ్‌ను ‘వాకోవర్’ (Walkover) గా పరిగణిస్తారు. దీనివల్ల భారత్‌కు నేరుగా రెండు పాయింట్లు లభిస్తాయి.
మరోవైపు, పాకిస్థాన్‌కు సున్నా పాయింట్లు వస్తాయి. గ్రూప్-ఏ లో తీవ్రమైన పోటీ ఉండే అవకాశం ఉన్నందున, పాయింట్లను కోల్పోవడం పాక్ జట్టుకు కోలుకోలేని దెబ్బ అవుతుంది.
కేవలం రెండు జట్లు మాత్రమే సూపర్ 8 దశకు చేరుకునే ఈ ఫార్మాట్‌లో, పాయింట్లను వదులుకోవడం పాకిస్థాన్‌ను తీవ్ర ఒత్తిడిలోకి నెట్టివేస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో, పాక్ తదుపరి దశకు అర్హత సాధించాలంటే మిగిలిన మూడు గ్రూప్ మ్యాచ్‌లను ఖచ్చితంగా గెలవాల్సి ఉంటుంది. ఒక్క చిన్న తప్పు జరిగినా టోర్నీ నుంచి పాక్ జట్టు నిష్క్రమించాల్సి వస్తుంది.
క్రికెట్ పరంగా చూస్తే, భారత్ మ్యాచ్‌ను వదులుకోవడం పాకిస్థాన్ సెమీస్ ఆశలను దెబ్బతీస్తుంది. అయితే, వ్యాపార పరంగా చూస్తే, ఈ నిర్ణయం ప్రసారకర్తలు, స్పాన్సర్లపై తీవ్ర ప్రభావం చూపుతుంది.
ఒకవేళ పాకిస్థాన్ టీ20 ప్రపంచకప్ నుంచి పూర్తిగా వైదొలిగితే, టీ20 ర్యాంకింగ్స్ ఆధారంగా ఐసీసీ మరొక దేశాన్ని రీప్లేస్‌మెంట్‌గా ఎంపిక చేస్తుంది. బంగ్లాదేశ్ స్థానంలో ఇప్పటికే స్కాట్లాండ్ రాగా, తదుపరి అత్యున్నత ర్యాంకు ఉన్న ఉగాండా పాకిస్థాన్ స్థానంలో వచ్చే అవకాశం ఉంది. లేదా బంగ్లాదేశ్ జట్టు రావొచ్చని తెలుస్తోంది. ఎందుకంటే, పాక్ మ్యాచ్ లన్నీ శ్రీలంకలోనే జరుగనున్నాయి. ఈమేరకు బంగ్లాదేశ్ ఐసీసీని ఒప్పించే ఛాన్స్ ఉంది.
‘క్రిక్‌బజ్’ నివేదిక ప్రకారం.. ఐసీసీతో కుదుర్చుకున్న భాగస్వామ్య ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే పాకిస్థాన్‌పై కఠినమైన ఆంక్షలు విధించే అవకాశం ఉందని సమాచారం. ఇందులో గ్లోబల్, కాంటినెంటల్ టోర్నమెంట్ల నుంచి సస్పెన్షన్, అలాగే పాకిస్థాన్ సూపర్ లీగ్ (PSL) ఆటగాళ్లకు ఇచ్చే ఎన్ఓసీ (NOC)లను రద్దు చేయడం వంటి చర్యలు ఉండవచ్చు. అంతేకాకుండా, నచ్చిన వేదికపై మ్యాచ్ ఆడే అవకాశం ఉన్నప్పుడు, టోర్నీని లేదా భారత్ మ్యాచ్‌ను బహిష్కరించడానికి పాకిస్థాన్‌కు ఎటువంటి సరైన కారణాలు లేవని ఐసీసీ భావిస్తోంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..