
IND vs PAK : 2025లో ప్రారంభం కానున్న ఆసియా కప్‌లో భారత్, పాకిస్తాన్ మధ్య జరగనున్న మ్యాచ్‌పై తీవ్ర చర్చ జరుగుతోంది. దేశవ్యాప్తంగా చాలా మంది ఈ మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే, ఈ విషయంలో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) తొలిసారి స్పందించింది. పాకిస్తాన్‌తో ఎందుకు ఆడాల్సి వస్తుంది? మ్యాచ్ బాయ్‌కాట్ చేస్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయి? అనే విషయాలపై బీసీసీఐ కార్యదర్శి దేవ్ జీత్ సైకియా కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాలు ఈ వార్తలో తెలుసుకుందాం.
పాకిస్తాన్‌తో ఎందుకు ఆడాలంటే..
ఆసియా కప్ 2025లో సెప్టెంబర్ 14న భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేయాలని దేశవ్యాప్తంగా డిమాండ్లు వినిపిస్తున్నాయి. అయితే, బీసీసీఐ ఈ మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేయకూడదని నిర్ణయించుకుంది. ఈ నిర్ణయంపై తొలిసారిగా బీసీసీఐ కార్యదర్శి దేవ్ జీత్ సైకియా స్పందించారు. ఎన్డీటీవీతో మాట్లాడిన ఆయన, కేంద్ర ప్రభుత్వ క్రీడా విభాగం జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. క్రీడలకు సంబంధించిన నిర్ణయాలు చాలా జాగ్రత్తగా, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని తీసుకుంటారని ఆయన తెలిపారు. బహుళ-జట్ల టోర్నమెంట్‌లలో పాల్గొనడంపై కేంద్ర ప్రభుత్వ విధానాలకు కట్టుబడి ఉన్నామని ఆయన స్పష్టం చేశారు.
బాయ్‌కాట్ చేస్తే నిషేధం పడే అవకాశం..
పాకిస్తాన్‌ను క్రికెట్ ప్రపంచం నుంచి పూర్తిగా బహిష్కరించడం ఎందుకు సాధ్యం కాదో దేవ్ జీత్ సైకియా వివరించారు. బహుళ-జట్ల టోర్నమెంట్‌లలో పాకిస్తాన్‌తో ఆడటానికి నిరాకరిస్తే, ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) లేదా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని ఆయన తెలిపారు. దీనివల్ల బీసీసీఐపై నిషేధం పడే అవకాశం ఉందని, ఇది యువ క్రీడాకారుల భవిష్యత్తుకు ఏ మాత్రం మంచిది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. దేశంలో క్రీడల సమాఖ్యల ప్రయోజనాలను, ఆటగాళ్ల కెరీర్‌ను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం ఈ విధానాన్ని రూపొందించిందని ఆయన చెప్పారు.
ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడకపోవడానికి కారణం..
భారత్, పాకిస్తాన్‌లు చాలా కాలంగా ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడటం లేదు. దీనిపై కూడా దేవ్ జీత్ సైకియా స్పష్టతనిచ్చారు. భవిష్యత్తులో కూడా భారత్, పాకిస్తాన్‌తో ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడబోదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసిందని ఆయన తెలిపారు. అయితే, ఆసియా కప్ లేదా ఐసీసీ టోర్నమెంట్‌ల వంటి బహుళ-జట్ల టోర్నమెంట్‌లలో మాత్రం రెండు జట్లు తలపడతాయని ఆయన చెప్పారు. దీనివల్ల క్రీడలు, ఆటగాళ్ల భవిష్యత్తు సురక్షితంగా ఉంటుందని ఆయన వివరించారు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..