INd vs NZ 2nd ODI: వర్షం కారణంగా సగంలోనే రెండో వన్డే రద్దు.. భారత్‌కు చేజారిన అవకాశం..

|

Nov 27, 2022 | 1:39 PM

భారత్-న్యూజిలాండ్ మధ్య జరగాల్సిన రెండో వన్డే వర్షం కారణంగా రద్దయింది. హామిల్టన్‌లోని సెడాన్ పార్క్‌లో ఈ రోజు( నవంబర్ 27 ఆదివారం) జరుగుతున్న ఈ..

INd vs NZ 2nd ODI: వర్షం కారణంగా సగంలోనే రెండో వన్డే రద్దు.. భారత్‌కు చేజారిన అవకాశం..
Ind Vs Nz 2nd Odi
Follow us on

భారత్-న్యూజిలాండ్ మధ్య జరగాల్సిన రెండో వన్డే వర్షం కారణంగా రద్దయింది. హామిల్టన్‌లోని సెడాన్ పార్క్‌లో ఈ రోజు( నవంబర్ 27 ఆదివారం) జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిన భారత్ తొలుత బ్యాటింగ్‌ను ప్రారంభించింది. భారత జట్టు తరఫున ఓపెనర్లుగా వచ్చిన కెప్టెన్ శిఖర్ ధావన్, శుభమన్ గిల్ జోడీ 4.5 ఓవర్లలో 22 పరుగులు చేసింది. ఆ సమయంలో వర్షం ప్రారంభం కావడంతో  ఆటగాళ్లు డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లారు. కొంతసేపటి తర్వాత తిరిగి మ్యాచ్ ప్రారంభించారు. అయితే మ్యాచ్‌ను 29 ఓవర్లకు కుదించారు. డ్రెసింగ్ రూం నుంచి మైదానంలోకి వచ్చిన తర్వాత.. భారత ఆటగాళ్లు దూకుడుగా ఆడారు. ఫలితంగా భారత్ 12.5 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 89 పరుగులు చేసింది.

అయితే మళ్లీ వర్షం ప్రారంభం కావడంతో మ్యాచ్‌ను రెండోసారి నిలిపేశారు. వర్షం తగ్గుముఖం పట్టకుండా కుండపోతగా కురుస్తున్నందున హామిల్టన్ మైదానంలో నీళ్లు నిలిచాయి. దీంతో చాలా సేపు నిరీక్షించిన తర్వాత మ్యాచ్‌ను రద్దు  చేస్తున్నట్లు ప్రకటించారు. భారత తరఫున శిఖర్ ధావన్ 3(10), శుభమాన్ గిల్ 45(42), సూర్యకూమార్ యాదవ్ 34(25) పరుగులు చేశారు. ఇక న్యూజిలాండ్ బౌలర్లలో మాట్ హెన్రీ శిఖర్ ధావన్ రూపంలో ఒక వికెట్‌ను పడగొట్టాడు.

29 ఓవర్లకు మ్యాచ్..

ఆక్లాండ్‌లో జరిగిన తొలి మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో భారత్‌పై విజయం సాధించి సిరీస్‌లో న్యూజిలాండ్ 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఫలితంగా ఎలా అయినా రెండో వన్డేలో గెలిచి సిరీస్‌ను సమం చేసేందుకు భారత్‌కు అవకాశం దక్కింది. కానీ రెండో మ్యాచ్ జరిగే సమయంలో పడిన వర్షం అన్ని అంచనాలను తలకిందులు చేసింది. మధ్యలో కొద్దిసేపు వర్షం ఆగడంతో మ్యాచ్‌ను 29 ఓవర్లకు కుదించారు. ఈ సమయంలో మళ్లీ ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్‌కు ధావన్ వికెట్ కోల్పోవయంతో షాక్ తగిలింది. అయితే ఆ తర్వాత గిల్ , సూర్యకుమార్ కలిసి విధ్వంసకరంగా ఆడారు.

సూర్య-గిల్‌ వీర బాదుడు..

ఓపెనింగ్ ఓవర్లలో సూర్య నిదానంగా బ్యాటింగ్ చేసినా.. తర్వాత ఎప్పటిలాగే తనదైన శైలిలో బ్యాటింగ్‌ చేశాడు. తన ఇన్నింగ్స్‌లో 25 బంతులను ఎదుర్కొన్న సూర్య మూడు సిక్సర్లు, రెండు ఫోర్లతో అజేయంగా 34 పరుగులు సాధించాడు. మరోవైపు ఓపెనర్‌గా వచ్చిన గిల్ కూడా 42 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌తో 45 పరుగులు చేశాడు.

చేజారిన అవకాశం..

మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా జరిగిన తొలి మ్యాచ్‌లో ఓడిపోయిన ధావన్ సేన రెండో ఈ మ్యాచ్‌లో గెలవాలని చాలా కోరుకుంది. తద్వారా సిరీస్‌ సొంతం చేసుకునే అవకాశాన్ని సజీవంగా ఉంచుకోగలమని భావించింది. అయితే వర్షం కారణంగా ఆ మ్యాచ్ రద్దు కావడంతో కివీస్‌పై సిరీస్‌ గెలిచే అవకాశాన్ని శిఖర్ ధావన్ జట్టు కోల్పోయింది. కానీ సిరీస్ ఓటమిని తప్పించుకోవడానికి ఇంకా అవకాశం ఉంది. దాని కోసం చివరి గేమ్ తప్పనిసరిగా గెలవాలి. ఒకవేళ వర్షం కారణంగా చివరి మ్యాచ్‌ కూడా రద్దు అయితే వన్డే సిరీస్‌ కివీస్‌ సొంతమవుతుంది.

కాగా, మూడు వన్డేల ఈ సిరీస్‌లో మొదటి మ్యాచ్‌లో న్యూజిలాండ్ గెలిచింది. ప్రస్తుతం రెండో మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. ఇక భారత్ న్యూజిలాండ్ దేశాల మధ్య హగ్లీ ఓవల్‌లోని క్రీస్ట్ చర్చ్ క్రికెట్ మైదానం వేదికగా మూడో వన్డే మ్యాచ్ బుధవారం(నవంబర్ 30) జరుగుతుంది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..