
బెంగుళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియం (M. Chinnaswamy Stadium) లో భారత్ ఇచ్చిన 411 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే సమయంలో నెదర్లాండ్స్ జట్టు (India Vs Netherlands) వరుసగా వికెట్లు కోల్పోయింది. దీంతో భారీ పరాజయాన్నిచవిచూడాల్సి వచ్చింది. కేవలం 100 పరుగులకే ఆ జట్టు టాప్ 4 వికెట్లు పడిపోయాయి. ఈ 4 వికెట్లలో ఒకటి కింగ్ కోహ్లి (Virat Kohli) తీయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. నిజానికి 6 ఏళ్ల తర్వాత వన్డే ప్రపంచకప్ (ICC ODI World Cup 2023) లో బౌలింగ్ చేసే అవకాశం దక్కించుకున్న కోహ్లీ.. నెదర్లాండ్స్‌పై వికెట్ తీసి మెరిశాడు. విశేషమేమిటంటే వన్డే ప్రపంచకప్‌లో కోహ్లీకి ఇదే తొలి వికెట్.
నిజానికి 2023 వన్డే ప్రపంచకప్‌లో కోహ్లీ బౌలింగ్ చేయడం ఇది రెండోసారి. దీనికి ముందు పూణెలో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ కేవలం 3 బంతులు మాత్రమే వేశాడు. దానికి కారణం.. గాయం కారణంగా ఓవర్ మధ్యలో హార్దిక్ పాండ్యా మైదానాన్ని వీడగా, పాండ్యా వేసిన ఓవర్‌లో మిగిలిన 3 బంతులను కోహ్లీ వేశాడు. అయితే ఆ సమయంలో కోహ్లీకి వికెట్ దక్కలేదు.
కానీ, నెదర్లాండ్స్‌తో బెంగళూరు వేదికగా జరిగిన మ్యాచ్‌లో బౌలింగ్ చేసే అవకాశం దక్కించుకున్న కోహ్లి.. తాను వేసిన 2వ ఓవర్‌లో వికెట్ తీశాడు. 2వ ఓవర్ వేయడానికి వచ్చిన కోహ్లీ నెదర్లాండ్స్ కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్‌ను పెవిలియన్ చేర్చాడు. తన ఇన్నింగ్స్‌లో 30 బంతులు ఎదుర్కొన్న స్కాట్ ఎడ్వర్డ్స్ 17 పరుగులు మాత్రమే చేసి కేఎల్ రాహుల్‌కి క్యాచ్ ఇచ్చాడు. సరిగ్గా 9 ఏళ్ల తర్వాత విరాట్ కోహ్లీకి ఇదే తొలి వికెట్. అంతకుముందు 2014లో వన్డేల్లో విరాట్ వికెట్ తీశాడు.
కోహ్లి బౌలింగ్‌ను తిలకించేందుకు ఎదురుచూసిన అభిమానులు అతడి వికెట్ పడటంతో ఆనందం పట్టలేకపోయారు. ముఖ్యంగా మ్యాచ్ చూసేందుకు వచ్చిన కోహ్లి భార్య అనుష్క శర్మ.. కోహ్లీకి వికెట్ దక్కడంతో కుర్చీలోంచి లేచి చప్పట్లు కొట్టారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇక విరాట్ కోహ్లి బౌలింగ్ విషయానికి వస్తే.. అంతర్జాతీయ క్రికెట్‌లో ఇప్పటి వరకు 644 బంతులు వేసిన కోహ్లీ 677 పరుగులు ఇచ్చాడు. వన్డేల్లో కోహ్లికి ఇది ఐదో వికెట్. అతను గతంలో అలిస్టర్ కుక్, క్రెయిగ్ కీస్వెటర్, బ్రెండన్ మెకల్లమ్, క్వింటన్ డి కాక్‌ల వికెట్లు తీశాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..