జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీ నిప్పులు చెరిగే బౌలింగ్‌తో ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్లను చావుదెబ్బ తీశారు. తొలి టెస్ట్ మ్యాచ్ మొదటి రోజు ఇంగ్లండ్‌ని 183 పరుగులకే కట్టడి చేసి పై చేయి సాధించారు. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా ఓపెనర్లు జాగ్రత్తగా బ్యాటింగ్ చేశారు. వికెట్ నష్టపోకుండా 21 పరుగులు చేశారు. ఓపెనర్లు రోహిత్ శర్మ (40 బంతుల్లో 9 పరుగులతో నాటౌట్), కేఎల్ రాహుల్ (39 బంతుల్లో 9 పరుగులతో నాటౌట్) 13 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసి వికెట్ పడకుండా ఆడారు. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ మూడు వికెట్ల నష్టానికి 138 పరుగుల వద్ద మంచి స్థితిలో కనిపించింది. అయితే ఆ తర్వాత చివరి ఏడు వికెట్లను కేవలం 45 పరుగుల వ్యవధిలో కోల్పోవడం విశేషం. కెప్టెన్ జో రూట్ 108 బంతుల్లో 11 ఫోర్ల సహాయంతో 64 పరుగులు సాధించాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో విఫలమైన బుమ్రా.. తన వేగాన్ని అందిపుచ్చుకుని ఈమ్యాచులో 46 పరుగులిచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు. జట్టులోని మరో ముగ్గురు ఫాస్ట్ బౌలర్లు షమీ3, శార్దూల్ ఠాకూర్ 2, మహ్మద్ సిరాజ్ 1 వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్‌ను కోలుకోనివ్వకుండా చేశారు. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన భారత ఓపెనర్లు రోహిత్, రాహుల్ చాలా జాగ్రత్తగా ఆడారు. ఎలాంటి రిస్క్ తీసుకోలేదు.
చివరి సెషన్‌లో ఇంగ్లండ్ బ్యాటింగ్ చెల్లాచెదురు..
మొదటి రెండు సెషన్లలో ఇంగ్లండ్ రెండు వికెట్లు కోల్పోయింది. మూడవ సెషన్‌లో వారి ఇన్నింగ్స్ కుప్పకూలిపోయింది. సామ్ కుర్రాన్ 27 పరుగులతో రాణించగా, ఇతర బ్యాట్స్‌మెన్‌లు భారత బౌలర్ల ధాటికి నిలువలేకపోయారు. లంచ్ సమయానికి ఇంగ్లండ్ రెండు వికెట్ల నష్టానికి 61 పరుగులు చేసింది. ఓపెనర్లు రోరీ బర్న్స్ (0), జాక్ క్రాలే (68 బంతుల్లో 27పరుగులు) పెవిలియన్ చేరారు. రెండవ సెషన్‌లో డోమ్ సిబ్లే (70 బంతుల్లో 18 పరుగులు), జానీ బెయిర్‌స్టో (71 బంతుల్లో 29) వికెట్లు కోల్పోయింది. రూట్, బెయిర్‌స్టో నాలుగో వికెట్‌కు అత్యధికంగా 72 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. చివరి ఏడు వికెట్లను కేవలం 45 పరుగుల వ్యవధిలో కోల్పోయి తక్కువ పరుగులకే ఆలౌట్ అయింది.
నిప్పులు చెరిగిన భారత్ బౌలర్లు
స్వింగ్‌ని భారత బౌలర్లు పూర్తిగా సద్వినియోగం చేసుకున్నారు. బుమ్రా టీమిండియాకు మంచి ఆరంభాన్ని అందించాడు. తొలి ఓవర్లోని ఐదవ బంతికి రోరీ బర్న్స్ పెవిలయన్ చేర్చాడు. మూడు అవుట్‌స్వింగర్‌ల తర్వాత, బుమ్రా బంతిని లెగ్-స్టంప్‌కి వదిలాడు. ఈ బంతి బర్న్స్ ప్యాడ్‌ని తాకింది. బుమ్రా అప్పీల్ చేయడంతో అంపైర్ ఔట్‌గా ప్రకటించాడు. బర్న్స్ డీఆర్‌ఎస్ తీసుకున్నాడు.. కానీ ప్రయోజనం లేకపోయింది. అనంతరం సిరాజ్ రెండో వికెట్ పడగొట్టాడు. సిరాజ్ వదిలిన బంతి బ్యాట్‌ను తాకుతూ వికెట్ కీపర్ రిషభ్ పంత్ చేతిలో పడింది. అయితే అంపైర్ భారత ఆటగాళ్ల అప్పీల్‌ను తిరస్కరించాడు. పంత్ సలహా మేరకు కోహ్లీ సమీక్ష కోరాడు. బంతి బ్యాట్ తాకినట్లు స్పష్టమైంది. దాంతో ఇంగ్లండ్ రెండవ వికెట్ కోల్పోయింది.
రూట్ 50వ అర్థశతకం..
జో రూట్ వీలుచిక్కినప్పుడల్లా పరుగులు సాధింస్తూ స్కోర్ బోర్డును పెంచే ప్రయత్నం చేశాడు. సహనం చూపించి, చెత్త బంతుల కోసం వేచి చూస్తూ.. పరుగులు సాధించాడు. ఈ దశలో తన 50 వ టెస్ట్ అర్ధ సెంచరీని పూర్తి చేశాడు. ఇక మూడవ సెషన్‌లో కథ అకస్మాత్తుగా మారిపోయింది. టీ విరామానికి ముందు బెయిర్‌స్టో వికెట్‌తో మొదలైన ఇంగ్లండ్ పతనం..183 పరుగుల వద్దకు చేరుకుంది. ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్స్‌లో కెప్టెన్ జో రూట్(64) ఒక్కడే భారత బౌలర్లను కొద్దిగా ఎదుర్కొన్నాడు. బెయిర్ స్టో(29), క్రాలే (27), సామ్ కరన్(27) విఫలమయ్యారు. టీమిండియా బౌలర్ల ధాటికి తక్కువ పరుగులకే ఆలౌట్ అయింది. టీమిండియా పేసర్లు బుమ్రా, షమీ ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్లను కట్టడి చేశారు. భారత బౌలర్లలో బుమ్రా 4, షమీ 3 వికెట్లు తీయగా, శార్దుల్ ఠాకూర్ 2, సిరాజ్ 1 వికెట్ పడగొట్టాడు.
Tokyo Olympics: సెమీ ఫైనల్‌లో ఓడిన భారత మహిళల హాకీ జట్టు.. 1-2 తేడాతో ఓటమి
Tokyo Olympics: ఒలింపిక్స్‌లో భారత్‌కి మరో పతకం ఖాయం.. ఫైనల్ చేరిన రెజ్లర్ రవి దహియా