
India vs England 3rd T20 India Playing 11: ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ప్రతిష్టాత్మక టీ20 సిరీస్‌లో నిలవాలంటే ఖచ్చితంగా గెలవాల్సిన మూడో మ్యాచ్‌కు భారత్ సమరశంఖం పూరించింది. గత మ్యాచ్ చేదు పరాజయం తర్వాత టీమ్ మేనేజ్మెంట్ జట్టులో రెండు కీలక మార్పులు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. సిరీస్ ఆశలు సజీవంగా ఉంచుకోవడమే లక్ష్యంగా సరికొత్త వ్యూహాలతో బరిలోకి దిగేందుకు సిద్ధమైంది.
మొదటి మ్యాచ్ వర్షార్పణమవ్వడం, రెండో పోరులో చేతికందిన విజయం చేజారిపోవడంతో భారత్ ప్రస్తుతం ఒత్తిడిలో పడింది. ఈ నేపథ్యంలో ఈరోజు జరిగే మూడో టీ20 మ్యాచ్ టీమిండియాకు అత్యంత కీలకంగా మారింది. ఎలాగైనా విజయం సాధించి సిరీస్ రేసులో నిలవాలనే కసితో ఉన్న మేనేజ్మెంట్, గత మ్యాచ్‌లో జరిగిన తప్పులను సరిదిద్దుకునే పనిలో పడింది. ఇందులో భాగంగానే పేలవ ప్రదర్శన చేసిన ఆటగాళ్లపై వేటు వేసేందుకు వెనుకాడటం లేదు.
గత మ్యాచ్‌లో భారత బౌలర్లు అద్భుతంగా రాణించినప్పటికీ, లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ తన చెత్త బౌలింగ్‌తో భారీగా పరుగులు సమర్పించుకుని మ్యాచ్‌ను ఇంగ్లాండ్ చేతుల్లో పెట్టాడు. ఇంగ్లాండ్ బ్యాటర్లు అతడి బౌలింగ్‌ను చీల్చిచెండూడటంతో భారత్ ఓటమి పాలైంది. దీంతో మూడో మ్యాచ్‌లో బిష్ణోయ్‌ను పక్కన పెట్టడం దాదాపు ఖాయమైంది. అతని స్థానంలో పిచ్ పరిస్థితులను బట్టి సూర్యాన్షి సర్జే లేదా ప్రిన్స్ యాదవ్‌లలో ఒకరికి తుది జట్టులో అవకాశం దక్కే సూచనలు కనిపిస్తున్నాయి.
బౌలింగ్‌లోనే కాకుండా టాప్ ఆర్డర్ బ్యాటింగ్‌లోనూ ఒక కీలక మార్పు జరిగే అవకాశం ఉంది. ఓపెనర్ అభిషేక్ శర్మ లేదా వన్ డౌన్ బ్యాటర్ ఇషాన్ కిషన్ లలో ఒకరికి ఈ మ్యాచ్‌లో విశ్రాంతి ఇవ్వవచ్చని తెలుస్తోంది. ఒకవేళ ఇదే జరిగితే, స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ సంజు శాంసన్ తిరిగి జట్టులోకి రావడం ఖాయం. అప్పుడు యువ సంచలనం వైభవ్ సూర్యవంశీతో కలిసి సంజు శాంసన్ సరికొత్త ఓపెనింగ్ జోడీగా ఇన్నింగ్స్ ప్రారంభించే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
మూడో మ్యాచ్‌కు వేదికైన ట్రెంట్ బ్రిడ్జ్ మైదానం బ్యాటర్లకు స్వర్గధామం వంటిది. ఇక్కడ పరుగుల వరద పారడం ఖాయంగా కనిపిస్తోంది. మైదానంలో తేమ తక్కువగా ఉండటం వల్ల ఆరంభంలో బంతి స్వింగ్ లేదా బౌన్స్ అయ్యే అవకాశాలు తక్కువ. ఐదు నుంచి ఏడు ఓవర్లు ముగిసిన తర్వాతే స్పిన్నర్లు కాస్త ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ పిచ్‌పై యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ ఒక్కసారి క్రీజులో సెట్ అయితే పరుగుల ప్రవాహం సృష్టించగలడు. గత మ్యాచ్‌లో కేవలం 14 పరుగులకే పరిమితమైన వైభవ్, ఈ మ్యాచ్‌లో భారీ ఇన్నింగ్స్ ఆడాలని అభిమానులు కోరుకుంటున్నారు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, తిలక్ వర్మలు కూడా తమ మెరుపు బ్యాటింగ్‌ను కొనసాగించాల్సి ఉంది. టాస్ గెలిచిన జట్టు ఇక్కడ నిస్సందేహంగా ముందుగా బ్యాటింగ్ ఎంచుకునే అవకాశం ఉంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..