
లండన్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన నిర్ణయాత్మక మూడో వన్డేలో భారత బౌలింగ్ విభాగం ఘోరంగా విఫలమై సిరీస్‌ను సమర్పించుకుంది. స్టార్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా లేకపోవడంతో టీమ్ ఇండియా బౌలింగ్ లైనప్ పూర్తిగా పసికూనను తలపించిందని, ఈ తరహా ఎంపికలతో వచ్చే వన్డే వరల్డ్ కప్ గెలవడం కష్టమేనని దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
ఇంగ్లాండ్‌తో జరిగిన మూడో వన్డేలో భారత బౌలింగ్ విభాగం ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. గాయం కారణంగా కీలక బౌలర్ జస్ప్రీత్ బుమ్రా జట్టుకు దూరం కావడంతో టీమ్ ఇండియా బౌలింగ్ తీవ్ర బలహీనంగా మారింది. ఇంగ్లాండ్ బ్యాటర్లు విరుచుకుపడటంతో నిర్ణీత ఓవర్లలో ప్రత్యర్థి జట్టు ఏకంగా 387 పరుగుల భారీ స్కోరు సాధించింది.
బుమ్రా స్థానంలో వచ్చిన ఫాస్ట్ బౌలర్లు మ్యాచ్‌పై ఎలాంటి పట్టు సాధించలేకపోయారు. ముఖ్యంగా అర్ష్‌దీప్ సింగ్ 10 ఓవర్లలో 72 పరుగులు ఇవ్వగా, ప్రిన్స్ యాదవ్ అనుభవలేమి స్పష్టంగా కనిపించింది. మరొకవైపు గుర్నూర్ బ్రార్ తన స్పెల్‌లో ఏకంగా 97 పరుగులు సమర్పించుకొని దారుణంగా నిరాశపరిచాడు. ఆరో బౌలర్ ఆప్షన్ లేకపోవడం, కేవలం ఐదుగురు స్పెషలిస్ట్ బౌలర్లతో బరిలోకి దిగడం జట్టు మేనేజ్‌మెంట్ చేసిన అతిపెద్ద పొరపాటని విశ్లేషకులు భావిస్తున్నారు.
టీమ్ ఇండియా బౌలింగ్ తీరుపై భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జట్టు ఎంపిక తీరును ప్రశ్నిస్తూ మేనేజ్‌మెంట్‌పై విమర్శలు గుప్పించారు. “బుమ్రా ఒక్కడు లేకపోతే మన బౌలింగ్ లైనప్ పరిస్థితి ఇంత దారుణంగా తయారవుతుందా? నలుగురు పేసర్లతో బరిలోకి దిగడం మేనేజ్‌మెంట్ చేసిన పెద్ద తప్పు. ప్రధాన స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ను తుది జట్టు నుంచి పక్కన పెట్టడం ఏమాత్రం వివేకం అనిపించుకోదు. గుర్నూర్ బ్రార్ స్థానంలో కుల్దీప్‌ను ఆడించి ఉంటే ఇంగ్లాండ్ కనీసం 20 నుంచి 30 పరుగులు తక్కువ చేసేది. అది మ్యాచ్ ఫలితాన్ని మార్చేసి ఉండేది” అని గవాస్కర్ స్పష్టం చేశారు.
388 పరుగుల కొండంత లక్ష్యంతో బరిలోకి దిగిన టీమ్ ఇండియా చివరి వరకు గట్టిగా పోరాడింది. కెప్టెం రోహిత్ శర్మ 138 పరుగులతో అద్భుతమైన సెంచరీ సాధించగా, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ అర్ధశతకాలతో మెరిశారు. అయితే, మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు కీలక సమయంలో చేతులెత్తేయడంతో భారత్ 27 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.
ఈ పరాజయంతో పర్యటనలో టీ20, వన్డే సిరీస్‌లలో భారత్ ఏ ఒక్క సిరీస్ కూడా గెలవలేక ఉత్త చేతులతో నిరాశగా వెనుతిరిగింది. వచ్చే ఏడాది సౌత్ ఆఫ్రికా, జింబాబ్వే వేదికలుగా జరిగే వన్డే ప్రపంచ కప్‌కు ముందు భారత బౌలింగ్ బలహీనతలు ఇలా బయటపడటం ఆందోళన కలిగిస్తోంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలకు ఘనమైన వీడ్కోలు ఇవ్వాలని భావిస్తున్న టీమ్ ఇండియా, ఇప్పటికైనా మేనేజ్‌మెంట్ లోపాలను సవరించుకోకపోతే వరల్డ్ కప్ కల కలగానే మిగిలిపోయే ప్రమాదం ఉంది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..