IND vs BAN: చివరి వన్డేలో బంగ్లాను బెంబేలెత్తించిన టీమిండియా.. 227 పరుగుల తేడాతో గ్రాండ్‌ విక్టరీ

ఈ సిరీస్‌ను టీమిండియా 1-2తో కోల్పోయినప్పటికీ ఆఖరి మ్యాచ్‌లో ఇషాన్‌ కిషాన్‌ డబుల్‌ సెంచరీ సాధించడం, విరాట్ మూడేళ్ల తర్వాత వన్డే సెంచరీ సాధించడం అభిమానులకు కాస్త ఊరటనిచ్చాయి.

IND vs BAN: చివరి వన్డేలో బంగ్లాను బెంబేలెత్తించిన టీమిండియా.. 227 పరుగుల తేడాతో గ్రాండ్‌ విక్టరీ
Team India

Updated on: Dec 10, 2022 | 7:32 PM

బంగ్లాదేశ్‌తో తొలి రెండు వన్డేల్లో ఓడిపోయి ఇంటా బయటా విమర్శలు ఎదుర్కొన్న టీమిండియా ఆఖరి మ్యాచ్‌లో భారీ విజయం సాధించింది. చిట్టగాంగ్‌ వేదికగా జరిగిన మూడో వన్డేలో 227 పరుగులతో గ్రాండ్‌ విక్టరీ సాధించి బంగ్లాదేశ్ క్లీన్ స్వీప్ ఆశలపై నీళ్లు చల్లింది. కాగా ఈ సిరీస్‌ను టీమిండియా 1-2తో కోల్పోయినప్పటికీ ఆఖరి మ్యాచ్‌లో ఇషాన్‌ కిషాన్‌ డబుల్‌ సెంచరీ సాధించడం, విరాట్ మూడేళ్ల తర్వాత వన్డే సెంచరీ సాధించడం అభిమానులకు కాస్త ఊరటనిచ్చాయి. ఈమ్యాచ్‌లో టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 409 పరుగులు చేసింది. దీనికి సమాధానంగా 410 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బంగ్లాదేశ్ జట్టు 200 పరుగులు కూడా చేయలేకపోయింది. భారత బౌలర్ల ధాటికి 34 ఓవర్లలో 184 పరుగులకే కుప్పకూలింది. టీమిండియా బౌలర్లలో శార్దూల్ 3, అక్షర్ పటేల్, ఉమ్రాన్‌ చెరో 2 వికెట్లు, సిరాజ్, కుల్‌దీప్‌ యాదవ్, వాషింగ్టన్ సుందర్ తలో వికెట్‌ తీశారు.

ఇషాన్‌, విరాట్‌ల జోరుతో..

అంతకుముందు వన్డే చరిత్రలో ఇషాన్ కిషన్ కేవలం 126 బంతుల్లోనే ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ పూర్తి చేశాడు. అతను తన పూర్తి ఇన్నింగ్స్‌లో 131 బంతుల్లో 210 పరుగులు చేశాడు. ఇందులో 24 ఫోర్లు, 10 సిక్సర్లు ఉన్నాయి. ఇషాన్‌తో పాటు, విరాట్ కోహ్లీ బంగ్లాదేశ్‌పై వన్డే కెరీర్‌లో నాలుగో సెంచరీ, ఓవరాల్‌గా వన్డేల్లో 44వ సెంచరీని నమోదు చేశాడు. కోహ్లీ మొత్తం 91 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సర్లతో 113 పరుగులు చేశాడు. విరాట్, ఇషాన్‌లు కలిసి రెండో వికెట్‌కు 190 బంతుల్లో 290 పరుగుల భాగస్వామ్యం జోడించి భారత జట్టు భారీ స్కోరుకు బాటలు వేశారు. డబుల్‌ సెంచరీతో భారత విజయంలో కీలక పాత్ర పోషించిన ఇషాన్‌ కిషన్‌ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌ అవార్డును సొంతం చేసుకొన్నాడు. ఇక మొదటి రెండు వన్డేల్లో అద్భుతంగా రాణించిన మెహిదీ హసన్ మిరాజ్‌ ప్లేయర్‌ ఆఫ్ ది సిరీస్‌ పురస్కారాన్ని దక్కించుకున్నాడు. ఇక ఇరుజట్ల మధ్య రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి టెస్టు డిసెంబర్‌ 14 నుంచి మొదలుకానుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..