ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా భారత్, ఆస్ట్రేలియా మధ్య గురువారం ( నవంబర్ 23) విశాఖపట్నం మైదానంలో తొలి మ్యాచ్ జరగనుంది. 2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్ తర్వాత ఇరు జట్లు తలపడుతుండడంతో ఆస్ట్రేలియాపై బదులు తీర్చుకోవాలనే ఉద్దేశంతో టీమ్ ఇండియా రంగంలోకి దిగింది. భారత జట్టులో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా వంటి స్టార్ ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చారు. ఎక్కువగా యువకులకు అవకాశం కల్పించారు. జట్టు కెప్టెన్సీ సూర్యకుమార్ యాదవ్‌కు ఇవ్వబడింది, వన్డే ప్రపంచ కప్ లో అట్టర్ ఫ్లాప్ అయిన సూర్య జట్టును ఎలా నడిపిస్తాడో చూడాలి. తొలి టీ20 మ్యాచ్ జరుగుతున్న విశాఖ పిచ్ ఎవరికి ఉపయోగపడుతుంది? వాతావరణ నివేదిక ఏం చెబుతున్నాయో తెలుసుకుందాం రండి. కాగా తీరంలో ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నాయి. దీంతో విశాఖ మ్యాచ్‌కు కూడా వరుణుడు ముప్పుందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్‌కు పెద్దగా వరుణుడి గండం లేదని వాతావరణ నిపుణులు వెల్లడించారు. అదే సమయంలో అక్యూవెదర్ ప్రకారం, నవంబర్ 23న విశాఖపట్నంలో 60% వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాత్రి 7 గంటల నుండి 10:30 గంటల వరకు ఆట సమయంలో, మేఘావృతమై ఉంటుంది. ఆట ప్రారంభానికి ముందు వర్షం పడే అవకాశం ఉందని మ్యాచ్ సమయంలో వర్షం కురిసే అవకాశాలు తక్కువగా ఉన్నాయని పేర్కొంది.
బ్యాటర్లకు స్వర్గధామమే..
విశాఖ మైదానంలోని పిచ్ ఎప్పుడూ బ్యాటర్లకు స్వర్గధామంగా పరిగణిస్తారు. ఇక్కడ బ్యాటర్లు భారీ స్కోర్లు చేసే అవకాశముంది. కాబట్టి భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగిన మొదటి టీ20 మ్యాచ్‌లో హయ్యెస్ట్ స్కోర్లు నమోదు కావొచ్చు. పైగా ఇరు జట్లలోనూ స్టార్ ఆటగాళ్లు, దూకుడైన ఆటగాళ్లు ఉండడంతో మ్యాచ్ హోరాహోరీగా సాగే అవకాశముంది.
రెండు జట్లు
భారత్: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్ (వైస్ కెప్టెన్), ఇషాన్ కిషన్, యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, రింకూ సింగ్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, శివమ్ దూబే, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసీద్ కృష్ణ, అవేష్ ఖాన్, ముఖేష్ కుమార్.
ఆస్ట్రేలియా: మాథ్యూ వేడ్ (కెప్టెన్), ఆరోన్ హార్డీ, జాసన్ బెహ్రెన్‌డార్ఫ్, సీన్ అబాట్, టిమ్ డేవిడ్, నాథన్ ఎల్లిస్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, గ్లెన్ మాక్స్‌వెల్, తన్వీర్ సంఘా, మాట్ షార్ట్, స్టీవ్ స్మిత్, మార్కస్ స్టోయినిస్, కేన్ రిచర్డ్‌సన్, ఆడమ్ జాంపా.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..