
క్రికెటర్లకు గాయాలు సహజమే. ఈ ఆటలోనే కాదు ఏ గేమ్‌లోనైనా ఆటగాళ్లకు గాయాలు తగడం సర్వ సాధారణం. భారత్ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్‌లోనూ చాలామంది ఆటగాళ్లు గాయపడ్డారు. తాజాగా భారత స్టార్ ఆటగాడు హార్దిక్ పాండ్యా గాయం కారణంగా న్యూజిలాండ్‌తో కీలక మ్యాచ్‌కు దూరమయ్యాడు. సాధారణంగా మైదానంలో ఏ ఆటగాడైనా గాయపడితే ఫిజియో టీమ్ గ్రౌండ్‌లోకి వచ్చి ట్రీట్‌మెంట్ అందిస్తారు. ఆ తర్వాత గాయం తీవ్రతను బట్టి అతను మైదానంలో ఉండాలా? వద్దా?అన్నది నిర్ణయిస్తారు. క్రికెటర్లతో పాటు అథ్లెట్లు తరచుగా కొన్ని గాయాలను ఎదుర్కొంటారు. అవేంటో తెలుసుకుందాం రండి.
క్రికెటర్ల ముక్కు లేదా చెవుల నుంచి రక్తం కారడం అప్పుడప్పుడు మనం మైదానాల్లో చూస్తుంటాం. నాసికా రంధ్రాలు లేదా చెవుల్లోని ఎముకలకు దెబ్బ తగిలినప్పుడు ఇలా జరుగుతుంది. ఇక క్రీడాకారులు ఎక్కువగా చీలమండ బెణుకుతో బాధపడుతుంటారు. అంటే మ్యాచ్ సమయంలో ఆటగాళ్ల పాదాలు బెణుకడం లేదా మెలికలు తిరగడం అన్నమాట. హార్ధిక్ పాండ్యా ఇలాగే గాయపడ్డాడు. మ్యాచ్‌లో చురుగ్గా పరుగెత్తడం లేదా దూకడం వల్ల ఫ్రాక్చర్ సమస్యలు తలెత్తుతాయి. చాలా మంది ఆటగాళ్లు ఈ సమస్యను ఎదుర్కొన్నారు. చాలా మంది క్రీడాకారులు మోకాలి కీళ్ల గాయాలతో ఇబ్బంది పడుతుంటారు. అలాగే కండరాల నొప్పులు కూడా ఆటగాళ్లను బాధపెడుతుంటాయి.
మ్యాచ్‌లో గాయపడిన క్రీడాకారులకు రైస్ థెరపీని అందజేస్తారు. RICE అంటే రెస్ట్, ఐస్, కంప్రెషన్, ఎలివేషన్
గాయం తగిలిన తర్వాత ఆటగాళ్లకు విశ్రాంతి ఇస్తారు. అంటే గాయం తగిలిన భాగాన్ని ఎక్కువగా కదిలించకుండా ఉంచడం అన్నమాట. ఇలా సుమారు 48-72 గంటల పాటు రెస్ట్ ఇస్తారు.
అథ్లెట్లు గాయం తర్వాత 48-72 గంటలపాటు ప్రతి రెండు గంటలకు గాయం తగిలిన ప్రాంతాన్ని ఐస్‌తో మర్దన చేస్తారు. ఇది గాయం వల్ల కలిగే బాధ నుంచి సాంత్వన కలిగిస్తుంది
గాయం తీవ్రత ఎక్కువగా ఉంటే దెబ్బ తగిలిన ప్రాంతానికి కట్టు కడతారు. ఇది నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే వాపుని కూడా తగ్గిస్తుంది. అయితే ఈ కట్టు మరీ ఎక్కువ గట్టిగా ఉండకుండా జాగ్రత్త పడతారు. ఇది రక్త ప్రవాహానికి అంతరాయం కలిగిస్తుంది. ఒక వేళ కట్టు తర్వాత చర్మం నీల రంగులోకి మారడం, తిమ్మిర్లు రావడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే కట్టును తీసేస్తారు.
ఎలివేషన్ అంటే గాయపడిన భాగాన్ని గుండె కంటే పై భాగంలో ఉంచడం.. ఉదాహరణకు, మీకు చీలమండ బెణుకు ఉంటే మీరు సోఫాలో కూర్చుని మీ కాలును దిండ్లపై ఆసరాగా ఉంచుకోవచ్చు. ఇలా చేయడం వల్ల నొప్పి, వాపు తగ్గిపోతాయి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..