
India vs Pakistan, T20I World Cup 2026: టీ20 ప్రపంచకప్ 2026 ప్రారంభం కాకముందే పాకిస్తాన్ ఐసీసీకి షాకిచ్చింది. ఇన్నాళ్లు ప్రపంచకప్ లో పాల్గొనబోమంటూ బెదిరించిన పాకిస్తాన్ టీం.. తాజాగా టోర్నీలో పాల్గొంటామని, కానీ భారత జట్టుతో మ్యాచ్ ఆడమంటూ తేల్చింది. ఇందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంలేదంటూ చెప్పుకొచ్చింది. ఈమేరకు సోషల్ మీడియాలో ఓ స్టేట్ మెంట్ ప్రకటించింది. భారత్ జట్టుతో మ్యాచ్ ను బహిష్కరిస్తున్నట్లు అందులో పేర్కొంది. ఆ వెంటనే అన్ని వైపుల నుంచి పీసీబీపై విమర్శలు మొదలయ్యాయి. ఈ క్రమంలో ఐసీసీ ఇప్పుడు పాకిస్తాన్‌ను హెచ్చరిస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది.
ఈ మేరకు ఐసీసీ ఓ ప్రకటన విడుదల చేసింది. ఐసీసీ అన్నింటికంటే ముందు, నిష్పాక్షికమైన క్రికెట్ సంస్థ అని, టోర్నమెంట్లు సమగ్రత, పోటీ, స్థిరత్వం, న్యాయబద్ధత వంటి సూత్రాలపై ఆధారపడి పనిచేస్తోంది. జాతీయ విధాన విషయాలలో ప్రభుత్వాల పాత్రను ఐసీసీ గౌరవిస్తున్నప్పటికీ, ఈ నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా ఉన్న పాకిస్తాన్ అభిమానుల ప్రయోజనాలకు మంచిది కాదు. తన దేశంలో క్రికెట్‌కు గణనీయమైన, దీర్ఘకాలిక ప్రభావాలను పరిగణనలోకి తీసుకుని పాకిస్తాన్ ఈ నిర్ణయాన్ని పునఃపరిశీలిస్తుందని ఐసీసీ ఆశిస్తోంది. ఐసీసీ ప్రధాన ప్రాధాన్యత 2026 టీ20 ప్రపంచ కప్‌ను సజావుగా, విజయవంతంగా నిర్వహించడం, దీనిలో పాకిస్తాన్ పాల్గొనాలి. అన్ని వాటాదారులకు ప్రయోజనం చేకూర్చే పరిష్కారాన్ని పాకిస్తాన్ కనుగొంటుందని మేం ఆశిస్తున్నాం అంటూ ప్రకటించింది.
బంగ్లాదేశ్‌లో హిందువులపై జరిగిన హింస కారణంగా బంగ్లాదేశ్‌కు చెందిన ముస్తాఫిజుర్ రెహమాన్‌ను 2026 ఐపీఎల్ సీజన్ నుంచి బీసీసీఐ తప్పించింది. బంగ్లాదేశ్ ప్రభుత్వం తమ జట్టును భారతదేశానికి పంపబోమని పట్టుబట్టింది. తత్ఫలితంగా, ఐసీసీ బంగ్లాదేశ్‌ను ప్రపంచ కప్ నుంచి బహిష్కరించింది. పాకిస్తాన్ దీనిని సహించలేకపోయింది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు మొహ్సిన్ నఖ్వీ బంగ్లాదేశ్‌కు మద్దతుగా నిలిచి, 2026 టీ20 ప్రపంచ కప్‌లో ఆ జట్టు ఆడాలా వద్దా అనే దానిపై ప్రభుత్వమే తుది నిర్ణయం తీసుకుంటుందని మీడియా ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. ఇప్పుడు, పాక్ జట్టు భారత్‌తో మ్యాచ్ ఆడటానికి వారి ప్రభుత్వం నిరాకరించింది. అయితే, పాకిస్తాన్ చివరి నిమిషం వరకు తమ నిర్ణయాన్ని మార్చుకుంటుందని భావిస్తున్నారు. ఎందుకంటే, పాక్ క్రికెట్ బోర్డు అలా చేయకపోవడం వల్ల కలిగే పరిణామాలను వారి క్రికెట్ బోర్డు భరించలేకపోతుంది. భారత్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య గ్రాండ్ మ్యాచ్ ఫిబ్రవరి 15న శ్రీలంకలో జరగనుంది.