
ICC ban Netherlands Fast Bowler Vivian Kingma: అంతర్జాతీయ క్రికెట్‌లో మరోసారి డోపింగ్ వివాదం కలకలం సృష్టించింది. నెదర్లాండ్స్ ఫాస్ట్ బౌలర్ వివియన్ కింగ్మాపై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మూడు నెలల నిషేధం విధించింది. డోపింగ్ టెస్ట్‌లో నిషేధిత పదార్థం వాడినట్లు తేలడంతో ఐసీసీ ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. ఈ సంవత్సరం మే 12న యూఏఈతో జరిగిన ఐసీసీ మెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ లీగ్ 2 వన్డే మ్యాచ్ అనంతరం నిర్వహించిన డోపింగ్ టెస్ట్‌లో కింగ్మా శాంపిల్‌లో బెంజోయ్లెకాగ్నిన్ (Benzoylecgonine) అనే నిషేధిత పదార్థం ఉన్నట్లు గుర్తించారు. ఇది కొకైన్‌కు సంబంధించిన ఒక మెటాబోలైట్, ఐసీసీ యాంటీ-డోపింగ్ కోడ్ ప్రకారం దీనిని డోపింగ్ పదార్థంగా పరిగణిస్తారు.
కింగ్మా తన తప్పును అంగీకరించినప్పటికీ, ఈ పదార్థాన్ని మ్యాచ్ సమయంలో కాకుండా వ్యక్తిగత సందర్భంలో ఉపయోగించినట్లు వివరించాడు. ఐసీసీ ఈ వివరణను పరిగణనలోకి తీసుకుని, అతనిపై ఆగస్టు 15, 2025 నుంచి మూడు నెలల నిషేధాన్ని ప్రకటించింది. అయితే, ఐసీసీ ఆమోదించిన చికిత్సా కార్యక్రమంలో పాల్గొని, విజయవంతంగా పూర్తి చేస్తే అతని నిషేధ కాలాన్ని ఒక నెలకు తగ్గించే అవకాశం కూడా ఉంది.
ఐసీసీ నిబంధనల ప్రకారం, మే 12 తర్వాత కింగ్మా ఆడిన మ్యాచ్‌లలో అతని వ్యక్తిగత రికార్డులన్నీ రద్దు అవుతాయి. యూఏఈతో జరిగిన వన్డే, నేపాల్, స్కాట్లాండ్‌తో జరిగిన రెండు వన్డేలు, ఒక టీ20 మ్యాచ్‌లో అతను సాధించిన పరుగులు, వికెట్లు, క్యాచ్‌లు రికార్డుల నుంచి తొలగించనున్నారు.
ఇటీవలి కాలంలో అంతర్జాతీయ క్రికెట్‌లో ఇలాంటి డోపింగ్ కేసులు వెలుగులోకి రావడం ఆందోళన కలిగిస్తోంది. గతంలో దక్షిణాఫ్రికాకు చెందిన కగిసో రబాడా, న్యూజిలాండ్ ఆటగాడు డగ్ బ్రేస్‌వెల్ కూడా ఇలాంటి డోపింగ్ ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఈ ఘటనలు క్రికెట్ క్రీడ ప్రతిష్టను దెబ్బతీస్తున్నాయి. క్రీడాకారులు తమ కెరీర్‌కు ముప్పు వాటిల్లకుండా నిబంధనలను పాటించడం అత్యంత అవసరం అని ఈ ఘటనలు మరోసారి స్పష్టం చేస్తున్నాయి.
నెదర్లాండ్స్ తరపున 56 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన కుడిచేతి వాటం పేసర్ వివియన్ కింగ్మాపై ఈ నిషేధం ఆగస్టు 15 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ ఫాస్ట్ బౌలర్ చికిత్స కార్యక్రమాన్ని పూర్తి చేసినట్లు నిరూపిస్తే, అతని నిషేధాన్ని ఒక నెలకే పరిమితం చేయవచ్చని ఐసీసీ స్పష్టం చేసింది. ఇది మాత్రమే కాదు, మే 12న, ఆ తర్వాత ఆడిన అన్ని మ్యాచ్‌లలో కింగ్మా ప్రదర్శన అతని రికార్డుల్లో చేరవు. వాటికి గుర్తింపు ఉండదు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..