బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టుకు నేటితో నాలుగో రోజు పూర్తయింది. తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియాపై 91 పరుగుల అధిక్యంతో భారత్ ఆలౌట్ అయింది. మరోవైపు ఆసీస్ తన రెండో ఇన్నింగ్స్‌ను కూడా ఈ రోజే ప్రారంభించి మొదటి దశలోనే ఉంది. ఈ క్రమంలో నాలుగో టెస్టు ఫలితం రావాలంటే.. ఐదో రోజు ఆటలో భారత బౌలర్లు వెంటవెంటనే ఆసీస్ ప్లేయర్లను పెవిలియన్ బాట పట్టించాలి. అదే జరిగితే అందరూ కోరుకుంటున్నట్లుగానే ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్‌కు టీమిండియా చేరుతుంది. అయితే అసలు ఈ మ్యాచ్‌లో భారత్ గెలుస్తుందా..? లేదా..? ప్రపంచ క్రికెట్‌లో ఇప్పుడు ఇదే చర్చ. పరిస్థితులు చూస్తుంటే అసాధ్యమే అనిపిస్తుంది. మరి ఈ పరిస్థితుల్లో నాలుగో మ్యాచ్ డ్రాగా ముగిస్తే డబ్ల్యూటీసీ ఫైనల్‌కు భారత్ చేరుతుందా..? ఇదే ఇప్పుడు అందరి మతిని తొలుస్తున్న ప్రశ్న. డ్రాగా ముగిస్తే పరిస్థితి ఏమిటో మనం ఇప్పుడు చూద్దాం..
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ నాలుగు టెస్టుల సిరీస్‌లో భారత్ 2-1 ఆధిక్యంలో కొనసాగుతోంది. అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న చివరి టెస్టులో భారత్ ఓడినా కూడా సిరీస్ మన నుంచి చేజారదు. రేపటి మ్యాచ్ డ్రా అయినా కూడా సిరీస్ మనదే అవుతుంది. అయితే వరుసగా రెండోసారి కూడా ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు చేరుకోవాలంటే మాత్రం రేపటి మ్యాచ్‌లో భారత్‌కు విజయం అవసరం. గెలిస్తే.. ఇప్పటికే డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరిన ఆసీస్‌తోనే తలపడేందుకు సిద్ధమైపోవచ్చు. కానీ ఒకవేళ ఓడినా, మ్యాచ్ డ్రా అయినా.. ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. ఇప్పుడున్న గందరగోళానికి తెరపడాలంటే సోమవారం వరకు ఆగాల్సిందే. ఎందుకంటే భారత్-ఆసీస్ నాలుగో టెస్టుతోపాటు న్యూజిలాండ్ – శ్రీలంక తొలి టెస్టు కూడా ఒకే రోజు మొదలై.. చివరి రోజు వరకు చేరుకున్నాయి.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..