
Hardik Pandya Cost Per Run: ఐపీఎల్ 2026 సీజన్‌లో ముంబై ఇండియన్స్ ఘోర వైఫల్యం తర్వాత ఆ జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యాపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సీజన్‌లో ముంబై జట్టు ఆడిన 14 మ్యాచ్‌లలో కేవలం నాలుగింటిలోనే విజయం సాధించి, పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానానికి పడిపోయింది. కోట్లు కుమ్మరించి అట్టిపెట్టుకున్న కెప్టెన్, ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా అటు బ్యాటింగ్‌లోనూ, ఇటు బౌలింగ్‌లోనూ ఘోరంగా విఫలం కావడంతో అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్ జట్టుకు ఈ ఏడాది అస్సలు కలిసిరాలేదు. రోహిత్ శర్మ తర్వాత జట్టు పగ్గాలు చేపట్టిన హార్దిక్ పాండ్యా నాయకత్వంలో జట్టు కనీస స్థాయి ప్రదర్శన కూడా చేయలేకపోయింది. ఒక సీనియర్ ఆల్‌రౌండర్‌గా, జట్టును ముందుండి నడిపించాల్సిన కెప్టెన్‌గా హార్దిక్ కొన్ని మ్యాచ్‌లలో మెరుపులు మెరిపించినప్పటికీ, జట్టుకు విజయాన్ని అందించే స్థిరత్వాన్ని మాత్రం ప్రదర్శించలేకపోయాడు. దీంతో ముంబై లీగ్ దశలోనే టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది.
ఈ సీజన్ కోసం ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ హార్దిక్ పాండ్యాను రూ. 16.35 కోట్ల భారీ ధరతో జట్టులోనే ఉంచుకుంది. జస్ప్రీత్ బుమ్రా తర్వాత జట్టులో అత్యధిక ధర కలిగిన ఆటగాడు అతనే. దీనికి తోడు ప్రతి మ్యాచ్‌కు రూ. 7.5 లక్షల చొప్పున, అతను ఆడిన 10 మ్యాచ్‌లకు గానూ అదనంగా రూ. 75 లక్షల మ్యాచ్ ఫీజు లభించింది. అంటే ఈ సీజన్‌లో అతని మొత్తం సంపాదన రూ. 23.85 కోట్లు. అయితే, నెమ్మదైన ఓవర్ రేటు, ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు బీసీసీఐ రెండుసార్లు జరిమానా విధించడంతో, అతని చేతికి నికరంగా రూ. 23.61 కోట్లు వచ్చాయి.
హార్దిక్ సంపాదనతో పోలిస్తే ఈ సీజన్‌లో అతని గణాంకాలు చూస్తే ఎవరైనా ముక్కున వేలేసుకోవాల్సిందే. 10 ఇన్నింగ్స్‌లలో అతను కేవలం 206 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై చేసిన 40 పరుగులే అత్యధికం. అంటే, హార్దిక్ చేసిన ఒక్కో పరుగుకు ముంబై ఫ్రాంచైజీ సుమారు రూ. 11.46 లక్షలు ఖర్చు చేసిందన్నమాట!
బౌలింగ్ విషయానికి వస్తే పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. 9 ఇన్నింగ్స్‌లలో బౌలింగ్ చేసిన హార్దిక్ కేవలం 4 వికెట్లు మాత్రమే తీశాడు. అదీనూ ఓవర్‌కు సగటున 11.43 పరుగులు సమర్పించుకున్నాడు. ఈ లెక్కన అతను తీసిన ఒక్కో వికెట్‌కు ముంబై జట్టు ఏకంగా రూ. 5.90 కోట్లు చెల్లించినట్లయింది. మొత్తం సీజన్‌లో అతను వేసిన 136 బంతులకు గానూ, ప్రతి బంతికి సుమారు రూ. 17.36 లక్షల చొప్పున ఖర్చయింది.
ముంబై ఇండియన్స్ చరిత్రలోనే అత్యంత పేలవమైన కెప్టెన్లలో ఒకడిగా హార్దిక్ పాండ్యా మిగిలిపోయేలా ఉన్నాడు. ఇప్పటివరకు అతను ముంబై జట్టుకు నాయకత్వం వహించిన 39 మ్యాచ్‌లలో కేవలం 15 మ్యాచ్‌లలోనే విజయం సాధించాడు. అతని గెలుపు శాతం కేవలం 38.46 మాత్రమే. ఈ నేపథ్యంలో రాబోయే ఐపీఎల్ 2027 సీజన్ కంటే ముందే ముంబై మేనేజ్‌మెంట్ కెప్టెన్‌ను మార్చే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. రేసులో జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అయితే, కెప్టెన్సీ నుంచి తప్పించినప్పటికీ, ఒక నాణ్యమైన ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్ కావడం వల్ల అతడిని జట్టు నుంచి పూర్తిగా వదిలేసుకునే అవకాశం లేదని విశ్లేషకులు భావిస్తున్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..