
టీమిండియా యువ పేసర్ హర్షిత్ రాణా ఎంపికపై వస్తున్న విమర్శలను భారత జట్టు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ తీవ్రంగా ఖండించారు. ముఖ్యంగా మాజీ క్రికెటర్లు చేసిన వ్యాఖ్యలపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్ట్రేలియా పర్యటనకు వన్డే, టీ20 జట్లలో హర్షిత్ రాణాకు చోటు దక్కడంపై విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో, వెస్టిండీస్‌తో జరిగిన టెస్టు సిరీస్ అనంతరం జరిగిన మీడియా సమావేశంలో గంభీర్ ఈ వ్యాఖ్యలు చేశారు.
మాజీ చీఫ్ సెలెక్టర్ కృష్ణమాచారి శ్రీకాంత్ సహా పలువురు మాజీ క్రికెటర్లు, పండితులు హర్షిత్ రాణా ఎంపికపై సందేహాలు వ్యక్తం చేశారు. రాణా, గంభీర్‌కు ఇష్టమైన ఆటగాడు కాబట్టే అతనికి జట్టులో స్థానం దక్కుతుందని శ్రీకాంత్ పరోక్షంగా వ్యాఖ్యానించారు. ఈ విమర్శలకు గంభీర్ చాలా ఘాటుగా సమాధానం ఇచ్చారు.
“ఇది నిజంగా సిగ్గుచేటు. కేవలం మీ యూట్యూబ్ ఛానెల్‌కు వ్యూస్ పెంచుకోవడానికి 23 ఏళ్ల కుర్రాడిని టార్గెట్ చేయడం అన్యాయం. హర్షిత్ రాణా తండ్రి మాజీ చీఫ్ సెలెక్టరో, మాజీ క్రికెటరో, లేదా ఎన్నారై (NRI) కాదనే విషయం గుర్తుంచుకోవాలి. అతను తన సొంత ప్రతిభతో క్రికెట్ ఆడుతున్నాడు, భవిష్యత్తులోనూ అలాగే ఆడతాడు.”
“మీరు నన్ను లక్ష్యంగా చేసుకోవాలనుకుంటే చేయండి. నేను తట్టుకోగలను. కానీ 23 ఏళ్ల కుర్రాడిపై అనవసర విమర్శలు చేయడం అస్సలు సరికాదు.”
“భారత క్రికెట్ పట్ల మనందరికీ నైతిక బాధ్యత ఉంది. మీ యూట్యూబ్ ఛానెల్ వ్యూస్ కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదు. ఇలాంటి వ్యక్తిగత విమర్శలు యువ ఆటగాళ్ల మనస్తత్వంపై ఎలాంటి ప్రభావం చూపుతాయో ఆలోచించండి.”
హర్షిత్ రాణా గతంలో గౌతమ్ గంభీర్ మెంటార్‌గా ఉన్న కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) జట్టులో కీలక ప్రదర్శన చేశాడు. అందుకే రాణా ఎంపిక వెనుక గంభీర్ పక్షపాతం ఉందంటూ విమర్శకులు ఆరోపిస్తున్నారు. దీనిపై గంభీర్ స్పందిస్తూ, ఆటగాళ్లను వారి ప్రదర్శన ఆధారంగా మాత్రమే విమర్శించాలని, వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకోవద్దని కోరారు.
“ఆటగాళ్ల ప్రదర్శన గురించి మాట్లాడండి. వారిని వ్యక్తిగతంగా లక్ష్యం చేయకండి. సెలెక్టర్లు ఉన్నారు. రాణా ప్రదర్శన బాగా లేకపోతే, వారే అతడిని జట్టు నుంచి తప్పిస్తారు. భవిష్యత్తులో మీ పిల్లలు కూడా క్రికెట్ ఆడవచ్చు. అప్పుడు ఇలాంటి పరిస్థితి వస్తే ఎలా ఉంటుంది?” అంటూ చెప్పుకొచ్చాడు.
యువ ఆటగాళ్లకు మద్దతు ఇవ్వడం, వారిని ప్రోత్సహించడం భారతీయ క్రికెట్‌కు అవసరమని గంభీర్ గట్టిగా చెప్పారు. హర్షిత్ రాణా సెలెక్షన్‌పై వస్తున్న ఈ వివాదం భారత క్రికెట్ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..