జింబాబ్వే మాజీ ఫాస్ట్ బౌలర్ హెన్రీ ఒలోంగా ఒక ప్రత్యేకమైన విషయంతో తాజాగా వెలుగులోకి వచ్చాడు. ఒకప్పుడు సచిన్ టెండూల్కర్ విధ్వంసానికి బలి అయిన ఈ ఆటగాడు, ఇప్పుడు తన జీవితంలో కొత్త మలుపు తీసుకున్నాడు. అడిలైడ్‌లో జరుగుతున్న భారత్-ఆస్ట్రేలియా రెండో టెస్టు సందర్భంగా, అతను క్రికెట్ స్టేడియంలో పెయింటింగ్ చేస్తూ కనిపించాడు.
1998లో ఇండియా, శ్రీలంక, జింబాంబే ల మధ్య జరిగిన ముక్కోణపు సిరీస్‌లో ఫైనల్ మ్యాచ్‌లో సచిన్ టెండూల్కర్ చేసిన 124 పరుగుల దంచికొట్టే ఇన్నింగ్స్‌కు ఒలోంగా బాధితుడు కావడం భారత క్రికెట్ అభిమానులకు గుర్తుండే అంశం. ఆ మ్యాచ్‌లో అతని బౌలింగ్ ఫిగర్స్ 6 ఓవర్లకు 50 పరుగులు ఇవ్వడంతో పాటూ ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. కానీ ఇప్పుడు, క్రికెట్ మైదానాల నుంచి క్రియేటివ్ ఫీల్డ్ వైపు అడుగుపెట్టిన ఒలోంగా, 25 ఏళ్ల తర్వాత మరొక గుర్తింపు పొందుతున్నాడు.
ఆస్ట్రేలియాలో స్థిరపడిన ఒలోంగా, పెయింటర్‌గా, కోచ్‌గా, అంపైర్‌గా గాయకుడిగా తన జీవితాన్ని గడుపుతున్నాడు. 2019లో “ది వాయిస్ ఆస్ట్రేలియా” గానం పోటీలో న్యాయనిర్ణేతలను మెప్పించి అందరి దృష్టిని ఆకర్షించాడు. 2015లో ఆస్ట్రేలియాకు వెళ్లిన ఒలోంగా, తన ఆస్ట్రేలియన్ భార్యతో కలిసి ఇద్దరు పిల్లల తండ్రిగా తన కుటుంబ జీవితాన్ని ఆస్వాదిస్తున్నాడు. “నేను ఆస్ట్రేలియాను ప్రేమిస్తున్నాను, ఇక్కడ నాకు కుటుంబం ఉంది,” అని స్పోర్ట్‌స్టార్‌తో మాట్లాడుతూ తన కొత్త జీవితం గురించి చెప్పాడు.
కళా ప్రపంచంలోకి తన ప్రవేశం గురించి మాట్లాడుతూ, “నాకు ఎప్పుడూ ఆ సాఫ్ట్ సైడ్ ఉండేది. ఒకే పని చేయడం నాకు బోర్ గా అనిపిస్తుంది. కొత్త వాటిని ప్రయత్నించడం నాకు ఇష్టం,” అన్నాడు. అడిలైడ్ ఓవల్‌లో తన పెయింటింగ్ చేస్తూ కనిపించడం ఈ మాటలకు మద్దతుగా నిలిచింది.
క్రికెట్‌కు పూర్తిగా దూరంగా ఉన్నప్పటికీ, ఒలోంగా ఇప్పటికీ ఆటపై తన ప్రేమను కొనసాగిస్తూనే ఉన్నాడు. జస్ప్రీత్ బుమ్రా గురించి మాట్లాడుతూ, అతని బౌలింగ్ శైలి వసీమ్ అక్రమ్‌ను గుర్తు చేస్తుందని, బుమ్రా ఈ కాలంలో అత్యుత్తమ పేసర్ అని ప్రశంసించాడు. “బుమ్రాకు ఉన్న హైపర్-ఎక్స్‌టెన్షన్ అతనికి ప్రత్యేకమైన క్రాక్‌ను ఇస్తుంది,” అని ఒలోంగా చెప్పాడు.
జింబాబ్వేలో రాజకీయ వివాదాల కారణంగా జట్టును విడిచిపెట్టిన ఒలోంగా చివరిసారిగా 2003 వన్డే ప్రపంచ కప్‌లో ఆడాడు. కానీ ఇప్పటికీ క్రికెట్ ప్రపంచంలో తనదైన ముద్రను ఉంచుకున్నాడు. సచిన్ టెండూల్కర్‌తో తన వాత్సల్యానుభూతి గురించి మాట్లాడుతూ, సచిన్ తన బౌలింగ్‌ను పూర్తిగా ధ్వంసం చేశాడు, కానీ అదే తనకు గుర్తింపు తీసుకొచ్చింది అని ఒలోంగా చెప్పాడు.
At the India vs Aus test in the Village to memorialise the Adelaide pink test in a painting. It's gonna be rockin here pic.twitter.com/5ObyU2d7wt
— Henry Olonga (@henryolonga) December 6, 2024