టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సెంచరీలపై వివిధ దేశాలకు చెందిన క్రికెటర్లు పొడత్తలతో ముంచేస్తున్నారు. ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ ప్రశంసల జల్లు కురిస్తూ పోస్ట్ పడితే.. తాజాగా పాకిస్తాన్ మాజీ బ్యాట్స్‌మన్ సల్మాన్ బట్ కూడా అదే వరుసలో నిలిచాడు. వచ్చే ఇంగ్లాండ్ టూర్లో విరాట్ కోహ్లీ సెంచరీతో చెలరేగిపోవడం ఖాయం అంటూ జోస్యం చెప్పాడు. తన యూట్యూబ్ ఛానెల్లో మాట్లాడుతూ భారత సారథిపై ప్రశంసలు కురిపించాడు.
‘కోహ్లీ ఇప్పటికే అనేక రికార్డులు బద్దలుకొట్టాడు. ఈ వయసులో ఒక ఆటగాడు 70 సెంచరీలు సాధిస్తాడని ఎవరైనా ఊహించారా? ఇప్పుడు అతడున్నంత ఫిట్నెస్తో ఎవరైనా ఉంటారని అనుకున్నారా? లేదా అతడున్న ఫామ్ గురించి ఆలోచించారా? ప్రస్తుతం కోహ్లీ ఛేదనల్లో 90 స్ట్రైక్‌రేట్‌తో ఉన్నాడు. అన్ని ఫార్మాట్లలో 50కి పైగా సగటుతో కొనసాగుతున్నాడు. ఇప్పటికే ఎన్నో రికార్డులను కోహ్లీ తన ఖాతాలో వేసుకున్నాడు .
ఏడాదికి పైగా సెంచరీ సాధించకపోయినా అతడు చేసిన పరుగులు చూడండి మీకే అర్థమవుతుంది. కోహ్లీ సెంచరీ కొట్టకపోతే అసలు పరుగులే చేయలేదని మనం అనుకుంటాం. మరో శతకం కొట్టడానికి అవసరమైన అవకాశాలు మెండుగా ఉన్నాయి. అది కేవలం సమయంతో ముడిపడి ఉంది’ అని సల్మాన్ తన అభిప్రాయాలు వెల్లడించాడు.
కోహ్లీ మూడంకెల స్కోర్ అందుకోక దాదాపు రెండేళ్లు కావొస్తోంది. అతడి కెరీర్లో ఇంత గ్యాప్ రావడం ఇదే తొలిసారి. 2019 నవంబర్‌లో చివరిసారి బంగ్లాదేశ్‌పై టెస్టు మ్యాచ్ సందర్భంగా సెంచరీ కొట్టాడు. దాంతో అంతర్జాతీయ క్రికెట్లో 70వ సారి ఆ ఘనత నమోదు చేశాడు. అప్పటి నుంచీ కోహ్లీ మరో శతకం బాదలేదు.