Pakistan Cricketer: పాకిస్థాన్ క్రికెట్ అభిమానులకు ఓ విషాద వార్త. పాకిస్థాన్ మాజీ ఫస్ట్ క్లాస్ క్రికెటర్ రయీస్ మహ్మద్ కన్నుమూశారు. ఆయన వయస్సు 89 సంవత్సరాలు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. రయీస్ సాధారణ ఫస్ట్-క్లాస్ క్రికెటర్ కాదు కానీ చాలా ప్రత్యేక హోదా, క్రికెట్‌లో పూర్తిగా మునిగిపోయిన కుటుంబం నుంచి వచ్చిన వాడు. రయీస్ పాకిస్థాన్‌లోని మసహర్ మొహమ్మద్ కుటుంబంలో ఒక సభ్యుడు. అతడి ఐదుగురు సోదరులు క్రికెటర్లు. వీరిలో హనీఫ్ మొహమ్మద్ అత్యంత గొప్ప బ్యాట్స్‌మెన్.
ఫిబ్రవరి14 సోమవారం ఉదయం కరాచీలో రయీస్ మరణించాడు. అతని తమ్ముడు, మాజీ టెస్ట్ క్రికెటర్ సాదిక్ మహ్మద్ రయీస్ మరణాన్ని ధృవీకరించారు. రయీస్ పాకిస్థాన్ క్రికెట్ జట్టులోకి రాలేకపోయాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో మాత్రమే ఆయన తన సత్తా చూపించాడు. రయీస్ 25 డిసెంబర్ 1932న గుజరాత్‌లోని జునాగఢ్‌లో జన్మించాడు. అక్కడ అతను క్రికెట్ ప్రారంభించాడు. కానీ కుటుంబం మొత్తం పాకిస్తాన్‌లో స్థిరపడింది. అయితే అతని ఫస్ట్ క్లాస్ కెరీర్ 1953లో కరాచీలో ప్రారంభమైంది. అతను తన సోదరుల వలె పాకిస్తాన్ జట్టుకి ఆడలేకపోయాడు. 30 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లు ఆడిన రయీస్ టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్, లెగ్ స్పిన్నర్ కూడా. అతను తన కెరీర్‌లో 1344 పరుగులు చేయగా అతని ఖాతాలో 33 వికెట్లు కూడా జమయ్యాయి. ఈ మాజీ ఫస్ట్ క్లాస్ క్రికెటర్ రయీస్ మహ్మద్ మృతికి పాకిస్థాన్ క్రికెట్ బోర్డు కూడా సంతాపం తెలిపింది.
నలుగురు సోదరులు టెస్ట్ క్రికెట్ ఆడారు
రాయీస్ మహ్మద్ కుటుంబంలోని ఐదుగురు సోదరులలో రెండోవాడు. వజీర్ మహ్మద్ పెద్దవాడు. హనీఫ్ మహ్మద్ మూడోవాడు. ముస్తాక్ మహ్మద్ నాలుగోవాడు. సాదిక్ మహ్మద్ చిన్నవాడు. అతని మిగిలిన నలుగురు సోదరులకు పాకిస్థాన్ తరపున టెస్టు క్రికెట్ ఆడే అవకాశం లభించింది. వీరిలో అత్యంత ప్రసిద్ధి చెందిన హనీఫ్ మహ్మద్ పాకిస్థాన్ తరపున 55 టెస్టుల్లో దాదాపు 4,000 పరుగులు చేశాడు. ముస్తాక్ మహ్మద్ పాక్ జట్టుకు కెప్టెన్ కూడా అయ్యారు.