Rajesh Verma: యార్కర్ల కింగ్ ఇకలేరు.. గుండెపోటుతో ముంబై ఫాస్ట్ బౌలర్ కన్నుమూత..
పాస్ట్ బౌలర్ రాజేష్ వర్మ ఏడు ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ల్లో 23 వికెట్లు పడగొట్టాడు. 2008లో, అతను బ్రబౌర్న్ స్టేడియంలో పంజాబ్‌తో చివరి ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ఆడాడు.
క్రికెట్ ప్రపంచం నుంచి ఓ విషాద వార్త బయటకు వచ్చింది. ముంబై మాజీ ఫస్ట్ క్లాస్ క్రికెటర్ రాజేష్ వర్మ ఆదివారం ముంబైలో గుండెపోటుతో మరణించాడు. రైట్ ఆర్మ్ మీడియం పేసర్ రాజేష్ వర్మ వయసు 40 ఏళ్లు. రాజేష్ వర్మ సహచరుడు భవిన్ ఠక్కర్ అతని మరణాన్ని ధృవీకరించారు. రాజేష్ వర్మ దిలీప్ వెంగ్‌సర్కార్ ఎల్ఫ్ అకాడమీలో క్రికెట్ నైపుణ్యాలను నేర్చుకున్నాడు. భవిన్ ఠక్కర్ ఒక ఆంగ్ల పత్రికతో మాట్లాడుతూ, ‘నేను పూర్తిగా షాక్ అయ్యాను. మేం U-19 రోజుల నుంచి మా క్రికెట్ ప్రయాణాన్ని కలిసి సాగించాం. మేమిద్దరం కలిసి వడాలా నుంచి మైదాన్‌కి వెళ్లేవాళ్లం. 20 రోజుల క్రితం అతను నాతో పాటు BPCL కోసం పర్యటనలో ఉన్నాడు. నిన్న సాయంత్రం అతనితో 30 నిమిషాలు మాట్లాడి, ఈ రోజు తెల్లవారుజామున 4 గంటలకు అతను ఇక లేడని నాకు కాల్ వచ్చింది’ అని తెలిపాడు.
ఠక్కర్, ‘అతను అద్భుతమైన వ్యక్తి. నాకు చాలా సన్నిహిత మిత్రుడు. అతను చాలా ప్రతిభావంతుడైన ఫాస్ట్ బౌలర్. నేటి కాలంలో ఐపీఎల్‌లో రాణిస్తూ ఉండేవాడు. ఇంతకు మించి సాధించి ఉండాల్సింది. అతను తన ఇష్టానుసారం యార్కర్లు విసిరేవాడు. అతని యార్కర్ పరిపూర్ణంగా ఉంటుంది’ అని పేర్కొన్నాడు.
48 వికెట్లు పడగొట్టిన రాజేష్..
రాజేష్ వర్మ ఏడు ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడాడు. అతను 2006-07లో ముంబై రంజీ ట్రోఫీ గెలిచిన జట్టులో సభ్యుడు కూడా. వర్మ 2002/03 సీజన్ ద్వారా ఫస్ట్-క్లాస్ అరంగేట్రం చేశాడు. 2008లో బ్రబౌర్న్ స్టేడియంలో పంజాబ్‌తో తన చివరి ఫస్ట్-క్లాస్ మ్యాచ్ ఆడాడు.
రాజేష్ వర్మ ఏడు ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 23 వికెట్లు తీయగలిగాడు. ఈ సమయంలో, ఒక ఇన్నింగ్స్‌లో అతని అత్యుత్తమ బౌలింగ్ ఫిగర్ 97 పరుగులకు 5 వికెట్లు తీయడం. రాజేష్ వర్మ పదకొండు లిస్ట్-ఎ మ్యాచ్‌లు కూడా ఆడాడు. అందులో అతను మొత్తం 20 వికెట్లు పడగొట్టాడు. ఇది కాకుండా రాజేష్ 4 టీ20 మ్యాచుల్లో 5 వికెట్లు తీశాడు.