Sanju Samson : పాలిటిక్స్ గెలిచాయి, సంజు శాంసన్ ఓడిపోయాడు..సెలక్టర్లపై ఆవేశంతో ఊగిపోతున్న ఫ్యాన్స్!

సౌతాఫ్రికాతో త్వరలో జరగబోయే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం బీసీసీఐ స్క్వాడ్‌ను అధికారికంగా ప్రకటించినప్పటికీ, స్టార్ వికెట్ కీపర్-బ్యాట్స్‌మెన్ సంజూ శాంసన్ పేరు జాబితాలో లేకపోవడంపై సోషల్ మీడియాలో తీవ్ర దుమారం చెలరేగింది. మెడ గాయంతో బాధపడుతున్న శుభ్‌మన్ గిల్‌కు విశ్రాంతినివ్వగా, ఈ సిరీస్‌కు కేఎల్ రాహుల్‌ను తాత్కాలిక కెప్టెన్‌గా ప్రకటించారు.

Sanju Samson : పాలిటిక్స్ గెలిచాయి, సంజు శాంసన్ ఓడిపోయాడు..సెలక్టర్లపై ఆవేశంతో ఊగిపోతున్న ఫ్యాన్స్!
Sanju Samson

Updated on: Nov 24, 2025 | 12:59 PM

Sanju Samson : సౌతాఫ్రికాతో త్వరలో జరగబోయే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం బీసీసీఐ స్క్వాడ్‌ను అధికారికంగా ప్రకటించినప్పటికీ, స్టార్ వికెట్ కీపర్-బ్యాట్స్‌మెన్ సంజూ శాంసన్ పేరు జాబితాలో లేకపోవడంపై సోషల్ మీడియాలో తీవ్ర దుమారం చెలరేగింది. మెడ గాయంతో బాధపడుతున్న శుభ్‌మన్ గిల్‌కు విశ్రాంతినివ్వగా, ఈ సిరీస్‌కు కేఎల్ రాహుల్‌ను తాత్కాలిక కెప్టెన్‌గా ప్రకటించారు. అయితే అత్యుత్తమ ఫామ్‌లో ఉన్న సంజూ శాంసన్‌ను ఎంపిక చేయకపోవడంపై అభిమానులు సెలక్టర్ల నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబట్టారు.

సెలక్టర్లు వికెట్ కీపింగ్ ఆప్షన్ల కోసం రిషభ్ పంత్, అరంగేట్రం చేయని ధ్రువ్ జురెల్‌ను ఎంచుకున్నారు. కానీ సంజూ శాంసన్‌ను విస్మరించడం అభిమానులకు ఆగ్రహం తెప్పించింది. ఎందుకంటే వన్డేలలో రిషభ్ పంత్ సగటు 33.50 మాత్రమే ఉండగా, సంజూ శాంసన్ సగటు అద్భుతంగా 56.66 ఉంది. అంతేకాకుండా సంజూ శాంసన్ తన చివరి వన్డే మ్యాచ్‌లో సౌతాఫ్రికా పైనే సెంచరీ కొట్టాడు. శ్రేయస్ అయ్యర్ కూడా గాయంతో జట్టులో లేనప్పటికీ, ఆ స్థానంలో శాంసన్‌కు అవకాశం ఇవ్వకుండా, సెలక్టర్లు పంత్‌పై నమ్మకం చూపడం మెరిట్ కంటే పక్షపాతంకే నిదర్శనమని అభిమానులు మండిపడ్డారు.

సెలెక్టర్ల ఛీఫ్ అజిత్ అగార్కర్, భారత మేనేజ్‌మెంట్‌పై అభిమానులు తీవ్రంగా విమర్శలు గుప్పించారు. “@SamsonSupremacy” అనే యూజర్, “33 సగటుతో ఉన్న పంత్‌ను సెలక్ట్ చేశారు… 58 సగటుతో శాంసన్ బయట కూర్చున్నాడు. తన చివరి వన్డేలో సెంచరీ కొట్టిన ఆటగాడిని మళ్లీ పక్కన పెట్టారు. నిలకడగా ఆడే వ్యక్తిని ఇలా శిక్షించడం సరికాదు. శాంసన్ తన స్థానాన్ని కోల్పోలేదు. సిస్టమ్ అతన్ని విఫలం చేసింది. ఇది సరైన సెలక్షన్ కాదు… గుండె పగిలింది” అని ట్వీట్ చేశాడు.

మరో అభిమాని “@Selfless_Samson” ట్వీట్ చేస్తూ, “సంజూ శాంసన్ తన చివరి వన్డేలో సెంచరీ కొట్టి, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలిచాడు. రాజకీయం గెలిచింది.. సంజూ శాంసన్ ఓడిపోయాడు” అని వ్యాఖ్యానించారు. కొందరు అభిమానులు అయితే, సెలక్టర్ల తీరు చూస్తుంటే సంజూ శాంసన్‌ను త్వరలోనే టీ20ల నుంచి కూడా తొలగిస్తారని ఆందోళన వ్యక్తం చేశారు.

ఇటీవల జరిగిన ఆసియా కప్ 2025లో కూడా సంజూ శాంసన్ ఓపెనింగ్ స్థానాన్ని వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌కు ఇచ్చారు. దీంతో సంజూ నెం.5 స్థానంలో బ్యాటింగుకు వచ్చాడు. కొన్ని మ్యాచ్‌లలో అయితే ఏకంగా అతనికి నెం.7 స్థానం వచ్చేవరకు బ్యాటింగ్ అవకాశం కూడా ఇవ్వలేదు. ఈ అసంబద్ధమైన ఎంపికల కారణంగా, సెలక్టర్లు శాంసన్‌ను టీ20లు, వన్డేలు రెండింటి నుంచి పక్కన పెట్టడానికి ప్లాన్ చేస్తున్నారా అని అభిమానులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సంజూ శాంసన్‌ను ఎందుకు విస్మరించారో బీసీసీఐ ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. స్క్వాడ్‌ను కేవలం సోషల్ మీడియా ద్వారా మాత్రమే రిలీజ్ చేశారు తప్ప ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించలేదు.

 

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..