IPL 2026: మరోసారి ప్లేఆఫ్స్ చేరకుండానే ఇంటికి.. SRHపై బాంబ్ పేల్చిన మాజీ ప్లేయర్

Sunrisers Hyderabad Playoffs: ఐపీఎల్ 2026 సీజన్ ఆరంభంలోనే సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు మాజీ ఇంగ్లాండ్ కెప్టెన్ మైఖేల్ వాన్ షాకింగ్ న్యూస్ చెప్పారు. ఆరెంజ్ ఆర్మీ ఈసారి ప్లేఆఫ్స్‌కు చేరడం అసాధ్యమని ఆయన జోస్యం చెప్పారు. హైదరాబాద్ జట్టు బ్యాటింగ్ బలంగా ఉన్నప్పటికీ, వారి బలహీనమైన బౌలింగ్ విభాగం టోర్నీలో ముందుకు సాగనివ్వదని వాన్ ఘాటుగా విమర్శించారు.

IPL 2026: మరోసారి ప్లేఆఫ్స్ చేరకుండానే ఇంటికి.. SRHపై బాంబ్ పేల్చిన మాజీ ప్లేయర్
Sunrisers Hyderabad Playoffs

Updated on: Mar 29, 2026 | 3:36 PM

Sunrisers Hyderabad Playoffs: ఇంగ్లాండ్ మాజీ దిగ్గజం మైఖేల్ వాన్ సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్ నాణ్యతను తక్కువ చేసి మాట్లాడారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన తొలి మ్యాచ్‌లో హైదరాబాద్ ఓటమిని విశ్లేషిస్తూ, ఎస్ఆర్‌హెచ్ బౌలర్లు ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారని మండిపడ్డారు. హైదరాబాద్ జట్టు 200 పరుగులకు పైగా స్కోరు చేసినప్పటికీ, ప్రత్యర్థి జట్టు దానిని చాలా సులభంగా ఛేదించిందని ఆయన గుర్తు చేశారు. కనీసం 230 పరుగులు చేసినా, బెంగళూరు బ్యాటర్లు ఆ లక్ష్యాన్ని 18 ఓవర్లలోనే ముగించేవారని వాన్ ఎద్దేవా చేశారు.

ఇషాన్ కిషన్ నాయకత్వంలో తడబాటు..

ప్రస్తుత సీజన్‌లో పాట్ కమిన్స్ అందుబాటులో లేకపోవడంతో ఇషాన్ కిషన్ హైదరాబాద్ జట్టును నడిపిస్తున్నారు. అయితే, నాయకుడిగా ఇషాన్ కిషన్ తన తొలి అడుగులోనే ఓటమిని చవిచూశాడు. హెన్రిచ్ క్లాసెన్ వంటి విధ్వంసకర బ్యాటర్లు ఉన్నప్పటికీ, బౌలింగ్ వైఫల్యం జట్టును వెంటాడుతోంది. ముఖ్యంగా జట్టులో నాణ్యమైన స్పిన్నర్ లేకపోవడం హైదరాబాద్‌కు పెద్ద మైనస్ అని వాన్ అభిప్రాయపడ్డాడు. పాట్ కమిన్స్ తిరిగి జట్టులోకి వచ్చినప్పటికీ బౌలింగ్ విభాగంలో పెద్దగా మార్పు ఉండకపోవచ్చని ఆయన అంచనా వేశాడు.

బ్యాటింగ్ మీదనే అతిగా ఆధారపడటం..

హైదరాబాద్ బ్యాటింగ్ లైనప్ అద్భుతంగా ఉందని, వారు కొన్ని మ్యాచ్‌లలో 250 పరుగులు కూడా చేయగలరని వాన్ అంగీకరించాడు. కానీ, ప్రతి మ్యాచ్‌లోనూ బౌలర్లు విఫలమైతే బ్యాటర్లు ఎంత స్కోరు చేసినా ప్రయోజనం ఉండదని హెచ్చరించాడు. సాధారణ స్కోరు ఉన్నప్పుడు బౌలర్లు జట్టును ఆదుకోవాలని, కానీ హైదరాబాద్ బౌలింగ్ విభాగంలో ఆ సత్తా కనిపించడం లేదని స్పష్టం చేశాడు. పిచ్‌పై సగటు స్కోరు 180 ఉంటే, హైదరాబాద్ గెలవాలంటే కనీసం 205 పరుగులు చేయాల్సిన పరిస్థితి ఉందని ఆయన విశ్లేషించాడు.

ప్లేఆఫ్స్ ఆశలపై నీళ్లు..

గత సీజన్‌లో ఆరో స్థానంతో సరిపెట్టుకున్న హైదరాబాద్, ఈసారి కూడా ప్లేఆఫ్స్ చేరే అవకాశం లేదని వాన్ కుండబద్ధలు కొట్టాడు. చర్చా కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, సన్‌రైజర్స్ ఈసారి కనీసం టాప్-4 లో కూడా ఉండదని తేల్చి చెప్పాడు. కేవలం బ్యాటింగ్ నమ్ముకుని టోర్నీ గెలవడం సాధ్యం కాదని, బౌలింగ్‌లో పదును లేకపోతే ఆ జట్టు ఇంటికే పరిమితం కావాల్సి వస్తుందని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశాడు. మరి వాన్ అంచనాలను తలకిందులు చేస్తూ హైదరాబాద్ పుంజుకుంటుందో లేదో వేచి చూడాలి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us