
Boxing Day Test: క్రికెట్ మైదానంలో ఆటగాళ్ల విజయాల వెనుక ఎన్నో కష్టాలు, కన్నీళ్లు ఉంటాయి. మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (MCG)లో జరిగిన నాలుగో యాషెస్ టెస్టులో ఇంగ్లాండ్ చారిత్రక విజయానికి వెన్నెముకగా నిలిచిన జోష్ టంగ్ (Josh Tongue) కథ కూడా అలాంటిదే. ఒకప్పుడు గాయాల కారణంగా ఆటకు శాశ్వతంగా స్వస్తి చెప్పాలనుకున్న ఈ యువ పేసర్, నేడు యాషెస్ హీరోగా అవతరించడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
మెల్‌బోర్న్‌లో జరిగిన ‘బాక్సింగ్ డే’ టెస్టులో ఆస్ట్రేలియాను ఓడించి ఇంగ్లాండ్ 15 ఏళ్ల నిరీక్షణకు తెరదించింది. ఈ విజయంలో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచిన జోష్ టంగ్ (7 వికెట్లు) తన కెరీర్‌లోని చీకటి రోజులను గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యాడు.
28 ఏళ్ల జోష్ టంగ్ కెరీర్ ప్రారంభం నుంచే గాయాలతో సతమతమయ్యాడు. ముఖ్యంగా ‘థొరాసిక్ అవుట్‌లెట్ సిండ్రోమ్’ (మెడ, భుజం మధ్య నరాలు నలిగిపోవడం) అనే అరుదైన సమస్యతో అతను బాధపడ్డాడు. దీని వల్ల తన కుడి చేయి మొద్దుబారిపోయేదని, బంతిని పట్టుకోవడం కూడా కష్టమయ్యేదని అతను గతంలో వెల్లడించారు. 2023లో పెక్టోరల్ కండరాల గాయం, ఆపై హామ్‌స్ట్రింగ్ సమస్యలు అతడిని వేధించాయి.
వరుస గాయాలు, శస్త్రచికిత్సల కారణంగా దాదాపు 15 నెలల పాటు క్రికెట్‌కు దూరమైన సమయంలో, తన కెరీర్ ముగిసిపోయిందని జోష్ భావించాడు. “ఒక దశలో నేను రిటైర్మెంట్ గురించి ఆలోచించాను. నా శరీరం సహకరించడం లేదని అనిపించింది. కానీ కష్టపడి తిరిగి జట్టులోకి రావాలనుకున్నాను. ఇప్పుడు ఇంగ్లాండ్ తరపున ఆడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది” అని మ్యాచ్ అనంతరం ఆయన వ్యాఖ్యానించాడు.
బాక్సింగ్ డే టెస్టులో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ బౌలింగ్ ఎంచుకోగా, జోష్ టంగ్ నిప్పులు చెరిగే బంతులతో ఆసీస్ బ్యాటర్లను బెంబేలెత్తించారు. తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 45 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. తద్వారా 21వ శతాబ్దంలో MCGలో ఐదు వికెట్ల ప్రదర్శన చేసిన తొలి ఇంగ్లాండ్ బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. అతని దెబ్బకు ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్‌లో 152 పరుగులకే కుప్పకూలింది.
రెండో ఇన్నింగ్స్‌లో కూడా కీలకమైన 2 వికెట్లు తీసి జట్టు విజయంలో పాలుపంచుకున్నాడు. 95,000 మంది ప్రేక్షకుల మధ్య ‘బాక్సింగ్ డే’ నాడు ఈ విజయం అందుకోవడం తన కల అని, తన పేరు హానర్స్ బోర్డుపైకి ఎక్కడం గర్వంగా ఉందని ఆయన పేర్కొన్నాడు.
అపజయాలు ఎదురైనప్పుడు కుంగిపోకుండా పోరాడితే విజయం వరిస్తుందని జోష్ టంగ్ నిరూపించాడు. యాషెస్ సిరీస్ ఇప్పటికే ఆస్ట్రేలియా వశమైనప్పటికీ, ఈ విజయంతో ఇంగ్లాండ్ జట్టు ఆత్మవిశ్వాసాన్ని మూటగట్టుకుంది. జనవరి 4 నుంచి సిడ్నీ వేదికగా ఐదో టెస్టు ప్రారంభం కానుంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..