
Ishan Kishan: దులీప్ ట్రోఫీ 2026 ఫైనల్ మ్యాచ్ ఈస్ట్ జోన్, సౌత్ జోన్ జట్ల మధ్య ఆదివారం నుంచి చెన్నైలోని చిదంబరం స్టేడియంలో ప్రారంభం కానుంది. ఈ హైవాల్టేజ్ మ్యాచ్‌కు ముందు నిర్వహించిన మీడియా సమావేశంలో ఈస్ట్ జోన్ కెప్టెన్ ఇషాన్ కిషన్ పాల్గొని సంచలన యంగ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ, సీనియర్ పేసర్ మహమ్మద్ షమీలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
దులీప్ ట్రోఫీ ఫైనల్ ఆడేందుకు సిద్ధమవుతున్న ఈస్ట్ జోన్ జట్టులో యంగ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ పేరు మార్మోగిపోతోంది. అఫ్గానిస్థాన్‌తో జరగబోయే టీ20 సిరీస్‌కు కూడా వైభవ్ సెలక్ట్ కావడంతో అతను ఈ ఫైనల్ ఆడుతాడా లేదా అనే సందేహాలు నెలకొన్నాయి. బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా స్పందిస్తూ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ దీనిపై తుది నిర్ణయం తీసుకుంటారని స్పష్టం చేశారు. ఈ క్రమంలో ఈస్ట్ జోన్ కెప్టెన్ ఇషాన్ కిషన్ మాట్లాడుతూ.. వైభవ్ చాలా స్మార్ట్ ప్లేయర్ అని కొనియాడారు. మైదానంలో ఏం చేయాలో అతనికి బాగా తెలుసని, సెమీఫైనల్‌లో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడని ప్రశంసించారు. అవసరమైన ప్రతిసారీ వైభవ్‌కు మద్దతుగా నిలుస్తామని భరోసా ఇచ్చారు.
ఈస్ట్ జోన్ ఫైనల్ చేరడంలో వైభవ్ సూర్యవంశీ చూపిన ప్రతిభ అసాధారణమైనది. సెమీఫైనల్ తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 81 బంతుల్లోనే 7 సిక్సర్లు, 7 ఫోర్ల సాయంతో 92 పరుగులు కొట్టి ప్రత్యర్థి బౌలర్లను వణికించాడు. ఇక రెండో ఇన్నింగ్స్‌లో బాధ్యతాయుతంగా ఆడుతూ 89 బంతుల్లో 41 పరుగులు చేసి జట్టును సురక్షిత తీరాలకు చేర్చాడు. అతనిలోని ఈ అద్భుతమైన ప్రదర్శనే అతనికి జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టింది.
తన వందో ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ఆడేందుకు సిద్ధమవుతున్న దిగ్గజ పేసర్ మహమ్మద్ షమీ గురించి ఇషాన్ కిషన్ ఎంతో వినయంగా మాట్లాడారు. షమీ భారత క్రికెట్‌లో ఒక దిగ్గజమని, గత మ్యాచ్‌లో జట్టు కోసం అతను పడిన శ్రమ కెప్టెన్‌గా తనపై నమ్మకాన్ని పెంచిందని తెలిపారు. బౌలింగ్‌తో పాటు షమీ బ్యాటింగ్‌లో రెండు అద్భుతమైన బౌండరీలు కొట్టాడని, ఇప్పుడు అతను ఆల్‌రౌండర్ అయిపోయాడంటూ సరదాగా వ్యాఖ్యానించారు. మూడేళ్ల క్రితం వరల్డ్ కప్‌లో చూసిన ఆ కసి, గెలిపించాలనే తపన షమీలో ఇప్పటికీ అలాగే ఉన్నాయని ఇషాన్ గుర్తుచేశారు.
చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా జరగనున్న ఈ ఫైనల్ మ్యాచ్‌పై క్రీడాభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇటు తిలక్ వర్మ సారథ్యంలోని సౌత్ జోన్, అటు ఇషాన్ కిషన్ నాయకత్వంలోని ఈస్ట్ జోన్ చెరో సారి ట్రోఫీపై కన్నేశాయి. రెండు జట్లలోనూ మహమ్మద్ సిరాజ్, దేవదత్ పడిక్కల్, కరుణ్ నాయర్, ముకేష్ కుమార్ వంటి అంతర్జాతీయ అనుభవం ఉన్న ఆటగాళ్లు ఉండటంతో ఈ పోరు అత్యంత ఉత్కంఠభరితంగా సాగడం ఖాయంగా కనిపిస్తోంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..