
T20 World Cup 2026 : టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్ 8లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఘోర పరాజయం పాలవ్వడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సౌతాఫ్రికా చేతిలో 76 పరుగుల తేడాతో భారత్ ఓడిపోవడాన్ని లెజెండరీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ తీవ్రంగా తప్పుబట్టారు. భారత ఆటగాళ్ల తీరుపై ఆయన నిప్పులు చెరిగారు. మైదానంలో ఆటగాళ్లు ప్రదర్శించిన ఓవర్ కాన్ఫిడెన్స్ , ఈగో వల్లే ఈ ఓటమి సంభవించిందని ఆయన ఘాటుగా విమర్శించారు.
సౌతాఫ్రికా ఇన్నింగ్స్ గమనిస్తే.. ఒక దశలో ఆ జట్టు కేవలం 20 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉంది. కానీ ఆ తర్వాత డేవిడ్ మిల్లర్, డెవాల్డ్ బ్రెవిస్ అత్యంత తెలివిగా ఆడారు. పిచ్ స్వభావాన్ని అర్థం చేసుకుని, నిలకడగా ఆడుతూ 97 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. దీనివల్ల సఫారీలు 187 పరుగుల భారీ స్కోరు సాధించగలిగారు. అయితే భారత బ్యాటర్లు మాత్రం ప్రత్యర్థి జట్టు నుంచి ఎలాంటి పాఠాలు నేర్చుకోలేదని గవాస్కర్ మండిపడ్డారు.
ఈ ఓటమిపై జియో స్టార్‌తో మాట్లాడిన గవాస్కర్.. “భారత బ్యాటర్లు క్రీజులోకి రాగానే ప్రతి బంతిని సిక్సర్లు, ఫోర్లు కొట్టాలని ప్రయత్నించారు. టీ20 క్రికెట్ అంటే కేవలం బాదడమే కాదు. పిచ్ కష్టంగా ఉన్నప్పుడు మీ అహాన్ని పక్కన పెట్టి, పరిస్థితులకు అనుగుణంగా ఆడాలి. సౌతాఫ్రికా బ్యాటర్లు ఆ పిచ్‌పై ఎలా పరుగులు సాధించారో గమనించి ఉంటే ఫలితం వేరేలా ఉండేది. కానీ మనవాళ్లు అడ్డదిడ్డంగా బ్యాట్ ఊపి వికెట్లు పారేసుకున్నారు. సౌతాఫ్రికా అన్ని విభాగాల్లోనూ భారత్ కంటే మెరుగైన ప్రదర్శన చేసింది” అని దుయ్యబట్టారు.
భారత్ 111 పరుగులకే ఆలౌట్ అవ్వడం కేవలం సాంకేతిక లోపం కాదు, అది ప్రణాళికా లోపం అని గవాస్కర్ అభిప్రాయపడ్డారు. భారీ లక్ష్యాన్ని ఛేదించేటప్పుడు ఒత్తిడికి లోనై వికెట్లు ఇచ్చుకోవడం జట్టు బలహీనతను బయటపెట్టిందన్నారు. ఇప్పటికైనా అహంకారాన్ని వీడి, తప్పుల నుంచి నేర్చుకుంటేనే తదుపరి మ్యాచ్‌ల్లో గెలిచి సెమీస్ చేరగలమని ఆయన గట్టిగా హెచ్చరించారు. అహ్మదాబాద్ వంటి స్టేడియంలో సొంత ప్రేక్షకుల ముందు ఇలాంటి పేలవ ప్రదర్శన చేయడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..