IPL 2025: రాఘవా మనోడు ఏం మారలా! ఎన్ని సార్లు కొట్టిన చావని పామువి అన్న నువ్!

ఐపీఎల్ 2025లో లక్నో బౌలర్ దిగ్వేష్ రతి తన నోట్‌బుక్ సెలబ్రేషన్‌తో మరోసారి సంచలనం సృష్టించాడు. ముంబై ఆటగాడు ర్యాన్ రికెల్టన్‌ను ఔట్ చేసిన తర్వాత కూడా తన ప్రత్యేక సంబరాన్ని కొనసాగించాడు. గతంలో హెచ్చరికలు, జరిమానాలు వచ్చినా దిగ్వేష్ తన స్టైల్‌ను మార్చలేదు. ఇప్పటివరకు 10 వికెట్లు తీసి తన ఆత్మవిశ్వాసాన్ని చాటిచెప్పాడు.

IPL 2025: రాఘవా మనోడు ఏం మారలా! ఎన్ని సార్లు కొట్టిన చావని పామువి అన్న నువ్!
Digvesh Rathi

Updated on: Apr 27, 2025 | 7:02 PM

ఐపీఎల్ 2025 సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్ స్పిన్నర్ దిగ్వేష్ రతి తన ట్రేడ్ మార్క్ నోట్‌బుక్ సెలెబ్రేషన్స్‌ను కొనసాగిస్తున్నాడు. అధికారిక నిబంధనలకు విరుద్ధంగా ప్రత్యర్థి ఆటగాళ్లను కవ్వించేలా అతని సంబరాలు ఉండటంతో ఐపీఎల్ నిర్వాహకులు అతనిపై భారీ జరిమానా విధించి, డిమెరిట్ పాయింట్ ఇచ్చారు. అయినా కూడా దిగ్వేష్ మాత్రం తగ్గేదేలే అన్నట్టుగా తన దూకుడు కొనసాగిస్తున్నాడు. ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై స్టార్ ఓపెనర్ ర్యాన్ రికెల్టన్‌ను (32 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లతో 58 పరుగులు) ఔట్ చేసి తనదైన స్టైల్‌లో పిచ్ మీద నోట్ రాసుకున్నట్లు సంబరాలు చేసుకున్నాడు. ఈ ఘటన ముంబై ఇన్నింగ్స్ 9వ ఓవర్‌లో చోటు చేసుకోగా, నాలుగో బంతికి రికెల్టన్ ఆయుష్ బదోనికి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అయ్యింది. నెటిజన్లు కూడా తమదైన శైలిలో స్పందిస్తూ “మనోడు మారలేదురా చారి!” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఈ సీజన్ ప్రారంభంలో పంజాబ్ కింగ్స్ బ్యాటర్ ప్రియాన్ష్ ఆర్యను ఔట్ చేసిన తర్వాత మొదటిసారి దిగ్వేష్ రతి తన నోట్‌బుక్ సెలబ్రేషన్స్ చేశాడు. ప్రియాన్ష్ ఔటైన వెంటనే అతని దగ్గరకు పరుగెత్తి, నోట్స్ రాసుకుంటున్నట్లు నటిస్తూ సంబరాలయ్యాడు. దీనిపై ఫీల్డ్ అంపైర్ గట్టిగా హెచ్చరిక ఇస్తే కూడా, మ్యాచ్ అనంతరం అతని మ్యాచ్ ఫీజులో కోత విధించగా, దిగ్వేష్ మాత్రం తన సంబరాల్లో తగ్గింపులు చేయలేదు. ముంబై ఇండియన్స్‌తో జరిగిన మరో మ్యాచ్‌లోనూ నమన్ దీర్‌ను ఔట్ చేసిన తర్వాత మళ్లీ నోట్‌బుక్ సెలబ్రేషన్స్ చేశాడు. దీని వలన మళ్లీ జరిమానా పడినప్పటికీ, ఇప్పుడు అతను పిచ్‌పై రాసుకుంటున్నట్లు కాస్త మితంగా సెలబ్రేట్ చేస్తున్నాడు.

ఈ సీజన్‌లో దిగ్వేష్ రతి తన శైలిని మార్చకుండా అద్భుతమైన ప్రదర్శన అందించాడు. ఇప్పటి వరకు అక్షర్ పటేల్, విప్రజ్ నిగమ్, అనికేత్ వర్మ, ప్రియాన్ష్ ఆర్య, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, నమన్ ధీర్, సునీల్ నరైన్, జోస్ బట్లర్, ర్యాన్ రికెల్టన్‌లను ఔట్ చేస్తూ మొత్తం 10 వికెట్లు పడగొట్టాడు. అందరూ అతని సంబరాలపై విమర్శలు చేసినా, దిగ్వేష్ మాత్రం తన ఉత్సాహాన్ని తగ్గించకుండా, తానేంటో మరోసారి చాటిచెప్పాడు.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..