AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Deepti Sharma: దీప్తి శర్మ విధ్వంసం.. 86 బంతుల్లోనే సెంచరీ.. భారత మహిళల క్రికెట్‌లో చరిత్ర

Deepti Sharma: జింబాబ్వేతో రెండో వన్డేలో దీప్తి శర్మ 86 బంతుల్లో అజేయంగా 106 పరుగులు చేసి అరుదైన రికార్డు సృష్టించింది. హర్మన్‌ప్రీత్ కౌర్ 126 పరుగులతో చెలరేగడంతో భారత్ 328/6 స్కోరు సాధించింది. అనంతరం వైష్ణవి శర్మ నాలుగు వికెట్లతో అదరగొట్టగా, జింబాబ్వే 207 పరుగులకే ఆలౌటైంది. భారత్ 121 పరుగులతో గెలిచి వన్డే సిరీస్‌ను 2–0తో కైవసం చేసుకుంది.

Deepti Sharma: దీప్తి శర్మ విధ్వంసం.. 86 బంతుల్లోనే సెంచరీ.. భారత మహిళల క్రికెట్‌లో చరిత్ర
Deepti Sharma
Rakesh
|

Updated on: Oct 26, 2026 | 7:31 AM

Share

Deepti Sharma: జింబాబ్వేతో జరిగిన రెండో మహిళల వన్డేలో భారత జట్టు అద్భుత ప్రదర్శన చేసింది. మొదట బ్యాటింగ్‌లో హర్మన్‌ప్రీత్ కౌర్, దీప్తి శర్మ సెంచరీలతో అదరగొట్టగా.. ఆ తర్వాత బౌలర్లు ప్రత్యర్థి జట్టును కట్టడి చేశారు. దీంతో భారత్ 121 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి, మూడు వన్డేల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2–0తో కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో దీప్తి శర్మ సాధించిన సెంచరీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

86 బంతుల్లో 106 పరుగులు

ఈ మ్యాచ్‌లో దీప్తి శర్మ ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి 86 బంతుల్లో అజేయంగా 106 పరుగులు చేసింది. ఆమె ఇన్నింగ్స్‌లో 15 ఫోర్లు ఉన్నాయి. ఈ సెంచరీతో మహిళల వన్డేల్లో ఆరో స్థానం లేదా అంతకంటే దిగువన బ్యాటింగ్‌కు వచ్చి సెంచరీ సాధించిన తొలి భారత మహిళా క్రికెటర్‌గా దీప్తి రికార్డు సృష్టించింది. అంతకుముందు ఈ స్థానంలో రిచా ఘోష్ చేసిన 94 పరుగులే అత్యధిక వ్యక్తిగత స్కోరుగా ఉండేది. దీప్తికి వన్డేల్లో ఇది రెండో సెంచరీ.

హర్మన్‌ప్రీత్ కౌర్ సెంచరీ

భారత్ ఇన్నింగ్స్ ఆరంభంలోనే స్మృతి మంధాన డకౌట్‌గా వెనుదిరగగా, షఫాలీ వర్మ 8 పరుగులకే ఔటైంది. ఈ దశలో ప్రతికా రావల్ 61 పరుగులతో జట్టును ఆదుకుంది. హర్మన్‌ప్రీత్ కౌర్ మాత్రం నిలకడగా ఆడుతూ 121 బంతుల్లో 126 పరుగులు చేసింది. ఆమె ఇన్నింగ్స్‌లో 15 ఫోర్లు ఉన్నాయి. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన దీప్తితో కలిసి హర్మన్‌ప్రీత్ ఐదో వికెట్‌కు 153 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. దీంతో భారత్ 50 ఓవర్లలో 6 వికెట్లకు 328 పరుగుల భారీ స్కోరు సాధించింది.

వైష్ణవి శర్మ స్పిన్ మాయ

328 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వేకు ఓపెనర్లు కొంత ప్రతిఘటన చూపించినా, భారత బౌలర్ల ముందు ఎక్కువసేపు నిలవలేకపోయింది. మోడెస్టర్ ముపాచిక్వా 49 పరుగులు, చిపో ముగేరి 46 పరుగులు చేశారు. భారత బౌలర్లలో వైష్ణవి శర్మ 39 పరుగులిచ్చి నాలుగు వికెట్లు పడగొట్టింది. దీప్తి శర్మ కూడా బంతితో రాణించి మూడు వికెట్లు తీసింది. చివరకు జింబాబ్వే 48.5 ఓవర్లలో 207 పరుగులకు ఆలౌట్ అయింది. బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ రాణించిన దీప్తి ప్రదర్శన భారత్ విజయానికి మరింత బలాన్నిచ్చింది.

సిరీస్ భారత్ సొంతం

ఈ విజయంతో భారత మహిళల జట్టు మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను 2–0తో సొంతం చేసుకుంది. తొలి వన్డేలోనూ భారత్ తొమ్మిది వికెట్ల తేడాతో గెలిచింది. రెండో మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ కౌర్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. ఇప్పుడు ఇరు జట్ల మధ్య చివరి వన్డే అక్టోబర్ 28న జరగనుంది. సిరీస్ ఇప్పటికే భారత్ ఖాతాలో చేరడంతో, చివరి మ్యాచ్‌లోనూ గెలిచి క్లీన్ స్వీప్ సాధించడంపై జట్టు దృష్టి పెట్టనుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us