Cricketers Love Marriages: దేశాంతర వివాహాలతో సరిహద్దులను చెరిపివేసిన క్రికెటర్లు

| Edited By: Balaraju Goud

Mar 04, 2022 | 3:21 PM

ఇలా విదేశీ అమ్మాయిలను పెళ్లి చేసుకున్న క్రికెటర్లు చాలా మందే ఉన్నారు. ముఖ్యంగా ఆస్ట్రేలియా అమ్మాయిలను పెళ్లి చేసుకున్నవారి లిస్ట్‌ కొంచెం పెద్దగానే ఉంటుంది.

Cricketers Love Marriages: దేశాంతర వివాహాలతో సరిహద్దులను చెరిపివేసిన క్రికెటర్లు
Sportsmen Marriage
Follow us on

Cricketers Love Marriages: గ్లెన్‌ మాక్స్‌వెల్‌.. లిమిటెడ్‌ ఓవర్ల క్రికెట్‌లో మోస్ట్‌ టాలెంటెడ్‌ బ్యాట్స్‌మన్‌. ఆస్ట్రేలియాకు చెందిన ఈ క్రికెటర్‌కు వన్డేలలో 125.43 స్ట్రయిక్‌రేట్‌, టీ-20లలో 154.26 స్ట్రయిక్‌రేట్‌ ఉంది.. ఇతను ఎంత విధ్వంసకర ఆటగాడో ఈ గణాంకాలే చెబుతున్నాయి. అలాగని ఇలా వచ్చి అలా వెళ్లిపోయే రకం కాదు.. రెండు వెర్షన్‌లలో 34 పరుగుల సగటు ఉంది ఇతడికి! మాక్స్‌వెల్‌ బ్యాటింగ్‌ చూసిన వారికెవరికైనా బౌండరీలు కొట్టడం ఇంత సులువా అని అనిపిస్తుంది. ఫుట్‌వర్క్‌ అమోఘం. షాట్ల ఎంపిక అద్భుతం. ప్రత్యర్థులు బెంబెలెత్తిపోయేలా పరుగులు తీసే నైజం. వీటితో పాటు ఆఫ్‌స్పిన్‌ బౌలింగ్‌తో అప్పుడప్పుడు కీలక వికెట్లను తీయగల సామర్థ్యం. ఇక ఫీల్డింగ్ సంగతి చెప్పనే అక్కర్లేదు. ఒక్కమాటలో చెప్పాలంటే మాక్స్‌వెల్‌ను వర్తమాన క్రికెట్‌లో ఓ బెస్ట్‌ ఆల్‌రౌండర్‌ అనొచ్చు. ఇంత సుదీర్ఘమైన ఇంట్రడక్షన్‌ ఎందుకు ఇవ్వాల్సి వచ్చిదంటే వచ్చే నెల 27న మాక్స్‌వెల్‌ ఓ ఇంటివాడవుతున్నాడు.

లాస్టియర్‌ మార్చ్‌లో భారత సంతతికి చెందిన వినీ రామన్‌తో నిశ్చితార్థం అయ్యింది. కానీ పాడు కరోనా వీరి వివాహానికి పలుసార్లు అడ్డుపడింది. మొన్నామధ్య మాక్స్‌వెల్‌, రామన్‌ల శుభలేఖ నెట్టింట్‌ వైరల్‌ అయిన సంగతి తెలుసు కదా! తమిళ సాంప్రదాయంలో ముద్రించిన ఆ అందమైన ముహూర్త ప్రతికను చూసి పది మంది ముచ్చపడిన సంగతి కూడా తెలుసు కదా! ఈ పెళ్లి కోసమే మాక్స్‌వెల్‌ పాకిస్తాన్‌ పర్యటన నుంచి తప్పుకున్నాడు. తమిళనాడుకి చెందిన వినీ రామన్‌ ఆస్ట్రేలియాలో మెడిసిన్‌ పూర్తి చేశారు. ప్రస్తుతం అక్కడే ప్రాక్టీస్ చేస్తున్నారు. 2013లో ఓ ఈవెంట్‌లో వినీ రామన్‌ని చూసిన మాక్స్‌వెల్‌ ప్రేమలో పడ్డాడు. అప్పటి నుంచి వాళ్లిద్దరూ డేటింగ్‌లో ఉన్నారు. ఒకానొక సమయంలో మాక్స్‌వెల్‌ ఫామ్‌ కోల్పోయి జట్టులో స్థానం దొరక్క తీవ్రమైన ఒత్తిడికి లోనయ్యాడు. అప్పుడతడికి అండగా నిలిచిన వ్యక్తి వినీ రామనే! ఆమె ఇచ్చిన కౌన్సిలింగ్‌తోనే మాక్స్‌వెల్‌ మళ్లీ తన పూర్వపు ఫామ్‌ను సంపాదించుకున్నాడు. ఐపీఎల్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు టీమ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న మాక్స్‌వెల్‌కు ఇండియన్‌ ట్రెడిషన్స్‌ అంటే చాలా ఇష్టం. ఇప్పుడు పెళ్లి తమిళ సంప్రదాయంలో జరుగుతుందా? లేక ఆస్ట్రేలియా స్టయిల్‌లో వైట్‌ గౌన్‌ ఈవెంట్‌ ఉంటుందా? లేక రెండు పద్దతుల్లో పెళ్లి జరుగుతుందా అన్నది మాత్రం కాస్త ఆసక్తికరంగా ఉంది.

Maxwel 1

ఇలా విదేశీ అమ్మాయిలను పెళ్లి చేసుకున్న క్రికెటర్లు చాలా మందే ఉన్నారు. ముఖ్యంగా ఆస్ట్రేలియా అమ్మాయిలను పెళ్లి చేసుకున్నవారి లిస్ట్‌ కొంచెం పెద్దగానే ఉంటుంది. వెస్టిండీస్‌కు చెందిన గ్రేట్ ఆల్‌రౌండర్‌ సర్‌ గారీ సోబర్స్‌, ఇంగ్లాండ్‌కు చెందిన ఫ్రాక్‌ టైసన్‌, పాకిస్తాన్‌కు చెందిన వసీం అక్రమ్‌, న్యూజిలాండ్‌కు చెందిన క్రిస్‌ కెయిన్స్‌, సౌతాఫ్రికాకు చెందిన మార్న్‌ మార్కెల్‌, వెస్టిండీస్‌కే చెందిన కార్ల్‌ హూపర్‌లు ఆస్ట్రేలియా అల్లుళ్లే! వీరిందరికంటే ముందు విదేశీ అమ్మాయిని పెళ్లి చేసుకున్నది మన బిషన్‌సింగ్‌ బేడినే! 1967లో టీమిండియా ఆస్ట్రేలియాను పర్యటించినప్పుడు మెల్‌బోర్న్‌కు చెందిన గ్వెనిత్‌ మిల్స్‌ చూశాడు బేడి. తొలిచూపులోనే ప్రేమించేశాడు. కొన్నాళ్ల తర్వాత బేడి, గ్లెనిత్‌లు ఓ ఇంటివారయ్యారు. వీరిద్దరికి గవసిండెర్‌, గిల్లిండర్ అని ఇద్దరు పిల్లలు. ఏమైందో ఏమో కానీ ఏడో దశకం ఆరంభంలో వీరిద్దరు విడిపోయారు. ప్రస్తుత క్రికెటర్ల విషయానికి వస్తే శిఖర్‌ ధవన్‌ 2012లో ఆయేషా ముఖర్జీని పెళ్లి చేసుకున్నాడు. ఆయేషా తండ్రి బెంగాలి, తల్లి బ్రిటిషర్‌. ఈ దంపుతు ఆయేషా చిన్నప్పుడే వీరు ఆస్ట్రేలియాకు వలసవెళ్లారు. అక్కడే ధవన్‌కు ఆయేషా పరిచయం అయ్యింది. ఆ పరిచయం పెళ్లి వరకు వెళ్లింది. 2014లో వీరికి జోరావర్‌ పుట్టాడు. వీరిద్దరి వైవాహికబంధం ఎక్కువ రోజులు నిలువలేదు. లాస్టియర్‌ సెప్టెంబర్‌లో ఈ జంట విడాకులు తీసుకుంది. కొడుకుతో పాటు ఆయేషా మెల్‌బోర్న్‌లోనే ఉంటున్నారు. శిఖర్‌ ఢిల్లీలో ఉంటున్నాడు. చాలా కాలం తర్వాత మొన్నీమధ్యనే తన కొడుకును కలిశాడు గబ్బర్‌.. ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు బాదేసి ప్రపంచ ప్రఖ్యాతి గడించిన ఆల్‌ రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌ గొప్ప యోధుడు. కేన్సర్‌ను జయించిన వీరుడు.. ఇతడు బ్రిటన్‌కు చెందిన హాజెల్‌ కీచ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.

బిషన్‌సింగ్‌ బేడి, శిఖర్‌ ధవన్‌, గారీ సోబర్స్‌, వసీం అక్రమ్‌లు ఆస్ట్రేలియా అల్లుళ్లయితే వీళ్లకు పూర్తి భిన్నంగా ఆస్ట్రేలియా ఆటగాడు షాన్‌ టైట్‌ ఇండియా అల్లుడయ్యాడు. గంటకు 160.7 కిలో మీటర్ల వేగంతో బంతులను విసిరే ఈ ఫాస్ట్‌ బౌలర్‌ 2010 నుంచి 2013 వరకు రాజస్తాన్‌ రాయల్స్‌ జట్టులో సభ్యుడు. ఆ సమయంలోనే ముంబాయికి చెందిన ప్రముఖ మోడల్‌ మషూమ్‌ సింఘాతో పరిచయం ఏర్పడింది. పరిచయం స్నేహంగా మారింది. స్నేహం ప్రేమగా రూపాంతరం చెందింది. పీకల్లోతు ప్రేమలో కూరుకుపోయిన తర్వాత ఒకరిని విడిచి ఒకరు ఉండలేకపోయారు. 2014లో ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. వీరికో పాప. అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి టైట్‌ తప్పుకున్న తర్వాత పాకిస్తాన్‌, అఫ్గానిస్తాన్‌ జట్లకు కోచ్‌గా వ్యవహరించారు. ఇప్పుడు భార్య, పాపతో హాయిగా ఉన్నాడు.

Sania

అలాగని షాన్‌ టైట్‌ ఒక్కడే కాదు, ఇంకా చాలా మంది క్రికెటర్లు భారత మహిళలను మనువాడారు. ఇప్పుడందరికి తెలిసిన పేరు షోయబ్‌ మాలిక్‌. పాకిస్తాన్‌కు చెందిన ఈ ఆల్‌రౌండర్‌ మన దేశానికి చెందిన సుప్రసిద్ధ టెన్నిస్‌ క్రీడాకారిణి సానియా మీర్జాను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఒకానొక సమయంలో మహిళల డబుల్స్‌లో నంబర్‌వన్‌ ర్యాంక్‌ను పొందిన సానియా మీర్జా ఖాతాలో ఆరు గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌ ఉన్నాయి. 2010 ఏప్రిల్‌లో మాలిక్‌ను పరియణమాడింది సానియా. తన మొదటి భార్య ఆయేషా సిద్ధిఖికి విడాకులు ఇచ్చిన మాలిక్‌ ఆ తర్వాతే సానియాను పెళ్లి చేసుకున్నాడు. ఈ దంపతులకు ఓ కుమారుడు.

హసన్‌ అలీ అనే పాకిస్తాన్‌ ఫాస్ట్‌ బౌలర్‌ కూడా మన దేశం అల్లుడే! రోతక్‌కు చెందిన ఏరోనాటికల్ ఇంజనీర్‌ సామియా అర్జూతో హసన్‌ అలీ వివాహం 2019 ఆగస్టులో జరిగింది. పాకిస్తాన్‌ ఓపెనింగ్‌ బ్యాట్స్‌మన్‌ మోహిసిన్‌ ఖాన్‌ కూడా బాలీవుడ్‌ నటి రీనా రాయ్‌ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. 1983లో వీరి వివాహం జరిగింది. 1986లో ఇంటర్నేషనల్ క్రికెట్‌ నుంచి తప్పుకున్న మోహిసిన్‌ ఖాన్‌ బాలీవుడ్‌లో అడుగుపెట్టాడు. అయిదారు సినిమాల్లో నటించాడు. కొన్ని విజయవంతం కూడా అయ్యాయి. ఏమైందో ఏమో కానీ 1990లో వీరిద్దరు విడాకులు తీసుకున్నాడు. విడాకుల తర్వాత మోహిసిన్‌ పాకిస్తాన్‌కు వెళ్లిపోయాడు. రీనా రాయ్‌ తన పిల్లలతో ఇక్కడే ఉంది.

ప్రపంచంలోని అత్యుత్తమ స్పిన్నర్లలో ఒకడైన ముత్తయ్య మురళీధరన్‌, ఇంగ్లాండ్‌కు చెందని మైక్‌ బ్రెయిర్లీలు కూడా ఇండియా అమ్మాయిలనే పెళ్లి చేసుకున్నారు. శ్రీలంకకు చెందిన మురళీధరన్‌ అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసుకున్నవాడిగా ప్రపంచ రికార్డు సృష్టించిన విషయం అందరికీ తెలిసిందే! అసలు అన్నేసి వికెట్లు తీయడం మరో బౌలర్‌కు సాధ్యమవుతుందని అనుకోలేం.. అదలా ఉంచితే , మురళీధరన్‌ చెన్నైలో ఉన్న మలర్‌ హాస్పిటల్స్‌ అధినేత డాక్టర్‌ రామమూర్తి కూతురు మదిమలర్‌ను వివాహం చేసుకున్నాడు. 2005లో మది మలర్‌, మురళీధరన్‌ పెళ్లి జరిగింది. ఇక మైక్‌ బ్రెయర్లీది మరో కథ. ఏడో దశకంలో ఇంగ్లాండ్‌కు మరపురాని విజయాలను అందించాడు బ్రెయర్లీ. ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్‌ సారాభాయ్‌ కూతురు మన సారాభాయ్‌ను గాఢంగా ప్రేమించాడు. కేంబ్రిడ్జ్‌ యూనివర్సిటీలో మొదటిసారి మన సారాభాయ్‌ను చూసినప్పుడే చేసుకుంటే ఈమెనే పెళ్లి చేసుకోవాలని డిసైడయ్యాడు. తన మనసులో మాట చెప్పాడు. ఆమె కూడా సరేననేసింది. ఇద్దరూ చక్కగా పెళ్లి చేసుకున్నారు. ఇప్పటికీ బ్రెయర్లీ తరచూ అహ్మదాబాద్‌ వచ్చి వెళుతుంటాడు. అన్నట్టు కాస్తో కూస్తో గుజరాతి కూడా నేర్చుకున్నాడు. భార్య తరఫు బంధువులతో బ్రెయర్లీ గుజరాతిలోనే మాట్లాడతాడు.న్యూజిలాండ్‌కు చెందిన గ్లెన్‌ టర్నర్‌ 1973లో సుఖీందర్‌ కౌర్‌ అనే ఓ సిక్కు అమ్మాయిని పెళ్లి చేసుకుననాడు.

ప్రస్తుతం పాకిస్తాన్‌ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్‌ ప్రపంచ అత్యుత్తమ అల్‌రౌండర్లలో ఒకరు. ఎనిమిదో దశకంలో ఇమ్రాన్‌కు తిరుగులేకుండా ఉండింది. పాకిస్తాన్‌కు చిరస్మరణీయమైన విజయాలను అందించిన గొప్ప సారథి కూడా! అప్పట్లో ఇమ్రాన్‌కు అంటే అమ్మాయిలు పడి చచ్చిపోయేవారు. క్రికెట్‌లో ఉన్నంత కాలం పెళ్లి చేసుకోకుండా ఉన్న ఇమ్రాన్‌ఖాన్‌ క్రికెట్ నుంచి తప్పుకున్న తర్వాత 1995లో ఇంగ్లాండ్‌కు చెందిన జెమీమా గోల్డ్‌స్మిత్‌ను వివాహం చేసుకున్నాడు. ప్రిన్సెస్‌ డయానకు జెమీమా అత్యంత సన్నిహితురాలు. వివాహనంతరం ఇమ్రాన్‌-జెమిమా దంపతులు పాక్‌కు వచ్చేశారు. దశాబ్దకాలంపాటు కలిసి మెలిసి ఉన్నారు. 2004లో ఇమ్రాన్‌తో తెగతెంపులు చేసుకుని జెమిమా ఇంగ్లాండ్‌కు వెళ్లిపోయింది. ఇమ్రాన్‌ఖానే కాదు, జహీర్‌ అబ్బాస్‌ కూడా బ్రిటిష్‌ అమ్మాయినే పెళ్లి చేసుకున్నాడు. కౌంటీ క్రికెట్‌ ఆడేందుకు బ్రిటన్‌కు వెళ్లిన జహీర్‌ అక్కడ రీటా లూథ్రాను చూసి ఆమె ప్రేమలో పడిపోయాడు. తన ప్రేమను ఆమె దగ్గర వ్యక్తపరిచాడు. ఆమె కూడా సరేనంది.. ఇద్దరూ ఒక్కటయ్యారు. 1988లో ఈ దంపతులు పాకిస్తాన్‌కు వచ్చారు.

Imran Khan

మాక్స్‌వెల్‌కు ఇక్కడి సంప్రదాయాలపై అంతగా అవగాహన లేనట్టుగా ఉంది. లేకపోతే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న శుభలేఖను చూసి అంత షాకవ్వడు. తమ దేశంలోలాగే పెళ్లి అనేది ఓ ప్రైవేటు ఫంక్షన్‌ అనుకున్నాడు. ఇక్కడ పెళ్లి అనేది ఓ సామూహిక సంబరమని, బంధుమిత్ర సపరివారంగా పెళ్లి వేడుక జరుగుతుందని ఆయనకు తెలియదు కాబోలు. ఏది ఏమైనా కులాంతర, మతాంతర వివాహాల్లాగే దేశాంతర వివాహాలు ఓ రకంగా సమాజానికి మంచివే! రెండు దేశాల మధ్య సత్సంబంధాలకు క్రీడలు ఎలా వారథిగా నిలుస్తున్నట్టుగానే ఇలాంటి పెళ్లిళ్లు కూడా భిన్నమైన సంప్రదాయాలను ఒక్కటి చేస్తున్నాయి. భారత పాకిస్తాన్‌ మధ్య అనాదిగా శత్రుత్వం ఉంది. రెండు దేశాల మధ్య ఇప్పటికే నాలుగు యుద్ధాలు కూడా జరిగాయి. అయినా షోయబ్‌ మాలిక్‌- సానియా మీర్జా పెళ్లికి అవేవి అడ్డురాలేదు. ఇద్దరూ హాయిగా అన్యోన్యంగా కాపురం చేసుకుంటున్నారు. భారత -పాకిస్తాన్‌ అంత కాదు కానీ ఇంగ్లాండ్‌-ఆస్ట్రేలియా మధ్య కూడా ఓ రకమైన వైరి భావన ఉంది. యాషెస్‌ సిరీస్‌ను రెండు దేశాలు ప్రతిష్టాత్మకంగా తీసుకునేది అందుకే! టైఫూన్‌ టైసన్‌గా ఖ్యాతి గడించిన ఇంగ్లాండ్‌ బౌలర్‌ ఫ్రాంక్‌ టైసన్‌- మెల్‌బోర్న్‌కు చెందిన ఉర్సులా మైస్‌ మధ్య ప్రేమ చిగురించడానికి ఈ శత్రు భావన అడ్డు రాలేదు. ఇద్దరు హాయిగా పెళ్లి కూడా చేసుకున్నారు. టైసన్‌ కోసం ఉర్సులా ఇంగ్లాండ్‌కు కూడా వచ్చేసింది. పైన చెప్పుకున్న క్రికెటర్లంతా ఆటలోనే కాదు, ప్రేమలోనూ విజయం సాధించారు. ద్వేషం, కోపం వంటి భావోద్వేగాలపై ప్రేమ, ఆప్యాయతలు గెలుపొందిన ప్రతీ చోట మానవత్వం ఉంటుందని ఈ క్రికెటర్లు చాటి చెప్పారు. పెళ్లిళ్లు స్వర్గంలో జరుగుతాయన్నది ఓ నానుడి. పెళ్లి సంబరమంతా జరిగేది మాత్రం భూమ్మీదే. అన్యోయంతో ప్రేమతో మెలిగే ప్రతీ జంటకు భూలోకమే స్వర్గసీమ! సర్దుకుపోయే మనస్తతం, భాగస్వామిని అర్థం చేసుకోగల మనసు ఉంటే అదే చాలు! విభిన్న దేశాలకు చెందిన వారు దంపతులకు ఇది మరీ మరీ అవసరం! మాక్స్‌వెల్‌-వినీ రామన్‌లకు హృదయపూర్వక వివాహ శుభాకాంక్షలు.

Read Also….  Russia Ukraine War: యూరప్‌లోనే అతిపెద్ద అణు విద్యుత్ ప్లాంట్‌పై రష్యా దాడి.. ఆ తర్వాత పరిస్థితి ఎలా ఉందంటే?