క్రికెట్ హిస్టరీలోనే విషాదకర రికార్డ్.. భారీ ప్రపంచ రికార్డ్ కు ఒక్క పరుగు దూరంలో.. కట్ చేస్తే..
Cricket Records: క్రికెట్‌లో ఒక్క పరుగు విలువ ఏమిటి చాలామంది ప్లేయర్లకు తెలిసి ఉంటుంది. ఎందుకంటే, వీళ్లంతా హాఫ్ సెంచరీ, సెంచరీ, డబుల్ సెంచరీ చేసేముందు ఆ ఒక్క పరుగు చేయకుండా పెవిలియన్ చేరారు. ఈ లిస్ట్ లో ఓ దిగ్గజ క్రికెటర్ కూడా ఉన్నారు. అయితే, ఈయన ఓ అద్భుతానికి ముందు రన్ ఔట్ కావడం గమనార్హం. అదేంటో ఓసారి చూద్దాం..

Cricket Records: క్రికెట్ చరిత్రలో కొన్ని రికార్డులు అద్భుతంగా ఉంటే, మరికొన్ని అత్యంత దురదృష్టకరంగా మిగిలిపోతాయి. అటువంటి ఒక విషాదకరమైన సంఘటనకు నేటికి సరిగ్గా 67 ఏళ్లు పూర్తయ్యాయి. పాకిస్థాన్ లెజెండరీ బ్యాటర్, ‘లిటిల్ మాస్టర్’ అని పిలవబడే హనీఫ్ మహమ్మద్, ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 500 పరుగుల రికార్డును కేవలం ఒక్క పరుగు దూరంలో చేజార్చుకున్న రోజు ఇది.
చారిత్రాత్మక ఇన్నింగ్స్.. జనవరి 11, 1959న కరాచీలో కరాచీ వర్సెస్ బహవల్‌పూర్ జట్ల మధ్య క్వాయిడ్-ఎ-అజామ్ ట్రోఫీ సెమీఫైనల్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో కరాచీ తరపున ఆడుతున్న హనీఫ్ మహమ్మద్ క్రీజులో పాతుకుపోయి ప్రత్యర్థి బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. అప్పట్లో టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక సమయం బ్యాటింగ్ చేసిన రికార్డు కూడా ఆయన పేరిటే ఉండేది. ఈ మ్యాచ్‌లో ఆయన ఆడిన ఇన్నింగ్స్ క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది.
ఆ ఒక్క పరుగు లోటు.. మ్యాచ్ మూడవ రోజు ఆట ముగిసే సమయానికి హనీఫ్ 499 పరుగుల వద్ద నిలిచారు. ఆ రోజుల్లో స్కోర్ బోర్డులు మాన్యువల్‌గా ఉండేవి. హనీఫ్ తను 499 పరుగుల వద్ద ఉన్నానని గమనించలేదు. చివరి ఓవర్ చివరి బంతికి అతను రెండు పరుగులు తీయడానికి ప్రయత్నించాడు. తద్వారా 500 మార్కును దాటవచ్చని భావించాడు. కానీ దురదృష్టవశాత్తు రెండో పరుగు తీసే క్రమంలో రన్ అవుట్ అయ్యాడు. కేవలం ఒక్క పరుగు దూరంలో 500 పరుగుల చారిత్రాత్మక ఘనతను కోల్పోయాడు.
రికార్డుల చరిత్ర.. హనీఫ్ మహమ్మద్ చేసిన ఈ 499 పరుగులు అప్పట్లో ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు. అంతకుముందు 1923లో సర్ డాన్ బ్రాడ్‌మాన్ చేసిన 452 పరుగుల రికార్డును ఆయన అధిగమించారు. హనీఫ్ నెలకొల్పిన ఈ 499 పరుగుల రికార్డు దాదాపు 35 ఏళ్ల పాటు పదిలంగా ఉంది. 1994లో వెస్టిండీస్ దిగ్గజం బ్రియన్ లారా వార్విక్‌షైర్ తరపున ఆడుతూ 501 పరుగులు చేసే వరకు హనీఫ్ స్కోరే ప్రపంచ రికార్డుగా కొనసాగింది.
లిటిల్ మాస్టర్ వారసత్వం.. హనీఫ్ మహమ్మద్ తన కెరీర్‌లో పాకిస్థాన్ తరపున 55 టెస్టులు ఆడి 3,915 పరుగులు చేశారు. అందులో ఒక ట్రిపుల్ సెంచరీ (337 పరుగులు) కూడా ఉంది. క్రికెట్ చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోయే గొప్ప బ్యాటర్లలో ఆయన ఒకరు. కానీ 499 వద్ద రన్ అవుట్ అయిన ఆ క్షణం మాత్రం క్రికెట్ చరిత్రలో అత్యంత దురదృష్టకరమైన క్షణంగా మిగిలిపోయింది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..




