8 సిక్సర్లు, 5 ఫోర్లు.. ఒకే ఓవర్‌లో 70 పరుగులు.. క్రికెట్ చరిత్రలోనే అత్యంత భయంకరమైన బ్యాటింగ్ ఇదే..!

Lee German 70 Runs in One Over: క్రికెట్ మైదానంలో బ్యాటర్లు విరుచుకుపడితే రికార్డులు తిరగరాయాల్సిందే. కానీ ఒకే ఓవర్‌లో ఏకంగా 70 పరుగులు రాబట్టడం ఎప్పుడైనా విన్నారా? న్యూజిలాండ్ బ్యాటర్ లీ జర్మన్ సృష్టించిన ఈ అద్భుత విధ్వంసం క్రికెట్ చరిత్రలోనే ఒక అరుదైన ఘట్టం. బౌలర్లు బెంబేలెత్తిపోయిన ఆ భీకర ఇన్నింగ్స్ వివరాలు మీకోసం.

8 సిక్సర్లు, 5 ఫోర్లు.. ఒకే ఓవర్‌లో 70 పరుగులు.. క్రికెట్ చరిత్రలోనే అత్యంత భయంకరమైన బ్యాటింగ్ ఇదే..!
Bert Vance Expensive Over

Updated on: May 03, 2026 | 7:30 AM

Bert Vance Expensive Over: క్రికెట్ ప్రపంచంలో ఎన్నో రికార్డులు పుడుతుంటాయి, మరెన్నో మరుగున పడిపోతుంటాయి. కానీ న్యూజిలాండ్‌లో జరిగిన ఒక ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లో నమోదైన ఈ రికార్డు నేటికీ చెక్కుచెదరకుండా ఉంది. కేవలం 6 బంతుల ఓవర్‌లో కాకుండా, నోబాల్స్ ప్రవాహంతో సాగిన ఆ సుదీర్ఘ ఓవర్‌లో లీ జర్మన్ అనే బ్యాటర్ ఏకంగా 70 పరుగులు పిండుకున్నాడు. ప్రపంచ క్రికెట్‌లో ఏ స్థాయిలోనైనా ఒకే ఓవర్‌లో ఒక బ్యాటర్ చేసిన అత్యధిక స్కోరు ఇదే కావడం విశేషం.

అసలేం జరిగింది? ఆ మ్యాజిక్ ఓవర్ వెనుక కథ..

ఈ ఘటన 1990 ఫిబ్రవరి 20న క్రైస్ట్‌చర్చ్‌లో జరిగింది. కాంటర్బరీ వర్సెస్ వెల్లింగ్టన్ జట్ల మధ్య జరిగిన షెల్ ట్రోఫీ మ్యాచ్ చివరి రోజున ఈ అద్భుతం చోటుచేసుకుంది. వెల్లింగ్టన్ జట్టు తన ఇన్నింగ్స్‌ను ప్రకటించి, కాంటర్బరీకి 59 ఓవర్లలో 291 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. లక్ష్య ఛేదనలో కాంటర్బరీ జట్టు తీవ్రంగా తడబడింది. కేవలం 108 పరుగులకే 8 వికెట్లు కోల్పోయి ఓటమి అంచున నిలిచింది. వెల్లింగ్టన్ విజయం ఖాయమని అందరూ భావిస్తున్న తరుణంలో వెల్లింగ్టన్ కెప్టెన్ ఒక వింత ప్రయోగం చేశాడు.

బౌలర్ బర్ట్ వాన్స్ తప్పిదం.. బ్యాటర్ లీ జర్మన్ ప్రతాపం..

మ్యాచ్‌ను ఎలాగైనా గెలుస్తామనే ఉద్దేశంతో వెల్లింగ్టన్ కెప్టెన్, పార్ట్ టైమ్ బౌలర్ బర్ట్ వాన్స్‌కు బంతిని అప్పగించాడు. లీ జర్మన్ సులభమైన బంతులకు భారీ షాట్లు ఆడే క్రమంలో వికెట్ ఇస్తాడని కెప్టెన్ ఆశించాడు. కానీ ఆ వ్యూహం బెడిసికొట్టింది. ఆ ఓవర్‌లో బర్ట్ వాన్స్ వరుసగా నోబాల్స్ వేస్తూ లైన్ అండ్ లెంగ్త్ మర్చిపోయాడు. ఆ ఓవర్‌లో అతను మొత్తం 22 బంతులు వేయాల్సి వచ్చింది. లీ జర్మన్ ఆ అవకాశాన్ని అందిపుచ్చుకుని 8 సిక్సర్లు, 5 ఫోర్లతో విరుచుకుపడ్డాడు.

ఆ ఓవర్ స్కోరు వివరాలివే..

ఆ ఓవర్‌లో బర్ట్ వాన్స్ మొత్తం 77 పరుగులు సమర్పించుకోగా, అందులో లీ జర్మన్ ఒక్కడే 70 పరుగులు చేశాడు. మిగిలిన 7 పరుగులు నోబాల్స్ రూపంలో, సహచర ఆటగాడు రోజర్ ఫోర్డ్ చేసినవి.

ఆ ఓవర్ సాగిందిలా: 0, 4, 4, 4, 6, 6, 4, 6, 1, 4, 1, 0, 6, 6, 6, 6, 6, 0, 0, 4, 0, 1.

చివరి ఓవర్‌లో విజయానికి 18 పరుగులు కావాల్సి ఉండగా, లీ జర్మన్ మొదటి ఐదు బంతుల్లో 17 పరుగులు చేశాడు. కానీ చివరి బంతికి పరుగు తీయలేకపోవడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us