Cricket News: టీ 20 మ్యాచ్‌లలో బ్యాటింగ్ మాయాజాలమే ఎక్కువగా ఉంటుందనే వారికి ఈ మ్యాచ్ గురించి చెప్పాలి. ఆ రోజులు పోయాయి. ఇప్పుడు బౌలర్ల రాజ్యం నడుస్తోంది. అది ఏ ఫార్మాట్ అయినా బౌలర్లు తలుచుకుంటే వార్ వన్‌సైడ్ అయిపోతుంది. దానికి ఉదాహరణే ఈ మ్యాచ్ అని చెప్పవచ్చు. 34 ఏళ్ల బౌలర్ కేవలం 19 పరుగులకే 5 ప్రధాన వికెట్లను నేలకూల్చి జట్టుకు సులువుగా విజయాన్నందించాడు. అతడు ఎవరో కాదు రైట్ ఆర్మ్ బౌలర్ సేథ్ రాన్స్. సూపర్ స్మాష్ లీగ్‌లో తన విధ్వంసంతో బౌలింగ్‌తో ప్రత్యర్థి ఆటగాళ్లకు చుక్కలు చూపించాడు.
సెంట్రల్ డిస్ట్రిక్ట్స్, ఒటాగో మధ్య జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సెంట్రల్ డిస్ట్రిక్ట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. సెంట్రల్ డిస్ట్రిక్ట్ తరఫున గ్రెగ్ హే అత్యధికంగా 55 బంతుల్లో 76 పరుగులు చేశాడు. ఇది కాకుండా వికెట్ కీపర్ డేన్ క్లీవర్ 45 పరుగులు చేయగా, కెప్టెన్ టామ్ బ్రూస్ 15 బంతుల్లో 26 పరుగులతో అజేయ ఇన్నింగ్స్ ఆడారు. ఇప్పుడు ఒటాగోకు 181 పరుగుల విజయ లక్ష్యం నిర్దేశించారు. కానీ సెంట్రల్ డిస్ట్రిక్ట్‌ల బౌలర్ సేథ్ రాన్స్, ఆరంభం నుంచి మెరుపు వేగంతో బంతులు విసిరాడు. ఫలితంగా ఒటాగో జట్టు పూర్తి 20 ఓవర్లు ఆడడం కష్టంగా మారింది.
జట్టు మొత్తం కేవలం 16.5 ఓవర్లలోనే 19 బంతులు మిగిలి ఉండగానే 58 పరుగుల తేడాతో ఓడిపోయింది. 127 పరుగులకు ఆలౌట్ అయింది. 3.5 ఓవర్లలో సేథ్ రాన్స్19 పరుగులకు 5 గురు బ్యాట్స్‌మెన్‌లను పెవిలియన్ పంపించాడు. ఈ 5 వికెట్లలో 4 వికెట్లు ఒటాగో టాప్ ఆర్డర్‌కు చెందినవి. సేథ్ రాన్స్ తన టీ20 కెరీర్‌లో తొలిసారి 5 వికెట్లు తీసి అద్భుతాలు చేశాడు. అంతకుముందు 76 టీ20లు ఆడి 90 వికెట్లు సాధించగా ఇందులో రెండు సార్లు 4 వికెట్లు సాధించాడు.