
Mohammed Rizwan: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు ఒక పీడకల లాంటిది. ఈ టోర్నమెంట్‌లో ఆతిథ్య పాకిస్తాన్ ఒక్క మ్యాచ్ కూడా గెలవలేకపోయింది. మొదటి రౌండ్లోనే నిష్క్రమించింది. మహ్మద్ రిజ్వాన్ కెప్టెన్సీలోని జట్టు మొదట న్యూజిలాండ్ చేతిలో ఘోరంగా ఓడిపోయింది. ఆ తర్వాత ఫిబ్రవరి 23న హై-వోల్టేజ్ మ్యాచ్‌లో భారత జట్టు చేతిలో అవమానకరమైన ఓటమిని ఎదుర్కోవలసి వచ్చింది. అదే సమయంలో, బంగ్లాదేశ్‌తో జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు చేశారు. పాకిస్తాన్ జట్టు ఓటమి, తొలగింపు నుంచి తీవ్ర విమర్శలను ఎదుర్కొంటోంది. ఇప్పుడు భారత్ పై ఓటమికి సంబంధించి షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. కెప్టెన్ రిజ్వాన్, జట్టు స్టార్ పేసర్ షాహీన్ అఫ్రిదిపై తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి.
పాకిస్తాన్ మీడియా నివేదికల ప్రకారం, భారత జట్టు పాకిస్థాన్‌ను దారుణంగా ఓడించిన తర్వాత ఆటగాళ్ళు మైదానంలో గుమిగూడారు. అప్పుడు మహ్మద్ రిజ్వాన్ ఆటగాళ్లతో మాట్లాడుతూ మీరు నిరాశ చెందాల్సిన అవసరం లేదంటూ చెప్పాడంట. ఈ ఓటమి వారిని ప్రభావితం చేయదు, కానీ కోచ్, సెలెక్టర్లు తమ ఉద్యోగాలను కోల్పోతారని జట్టులోని ఒక ఆటగాడు స్వయంగా వెల్లడించాడంట. అయితే, అతని పేరు వెల్లడించలేదు. పాకిస్తాన్ కెప్టెన్ గురించి అతను పీసీబీకి ఈ విషయాలు చెప్పాడు.
‘రిజ్వాన్ ఆటగాళ్లతో మాట్లాడుతూ మీరు నిరాశ చెందాల్సిన అవసరం లేదు, గెలుపు, ఓటములు ఆటలో ఒక భాగం. అది ఆటగాళ్లపై ఎలాంటి ప్రభావం చూపదు. కోచ్, సెలెక్టర్లు తమ ఉద్యోగాలను కోల్పోతారు’ అంటూ చెప్పాడంట. పాకిస్తాన్ కెప్టెన్ చేసిన ఈ ప్రకటన మొత్తం పాకిస్తాన్‌లో తీవ్ర కలకలం రేపింది. అతని ప్రకటన పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు నచ్చలేదు. బహుశా ఈ కారణంగానే పీసీబీ అతన్ని న్యూజిలాండ్ పర్యటనలో టీ20 సిరీస్ జట్టు నుంచి తొలగించింది. మరోవైపు, తాత్కాలిక కోచ్ ఆకిబ్ జావేద్, సెలెక్టర్లు ఇప్పటికీ వారి స్థానాల్లోనే ఉన్నారు.
మహ్మద్ రిజ్వాన్ తో పాటు, ఫాస్ట్ బౌలర్ షాహీన్ అఫ్రిదిపై కూడా తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. అతనిపై పీసీబీకి ఫిర్యాదు కూడా చేశారు. ఛాంపియన్స్ ట్రోఫీ సమయంలో షాహీన్ సూచనలను పాటించలేదని పాకిస్తాన్ మీడియా నివేదికలు వెల్లడించాయి. దీని కారణంగా ఆ జట్టు టోర్నమెంట్‌లో ఓడిపోయింది. న్యూజిలాండ్ పర్యటనలో టీ20 సిరీస్‌లో షాహీన్‌ను పీసీబీ చేర్చుకుంది. కానీ, అతను వన్డే జట్టులో కూడా లేడు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..