
CJP Protest : ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నీట్ పేపర్ లీక్, విద్యాశాఖ మంత్రి రాజీనామా డిమాండ్‌తో కాక్రోచ్ జనతా పార్టీ(CJP) చేపట్టిన విద్యార్థుల నిరసన ప్రదర్శన తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. పార్లమెంట్ వైపు మార్చ్ అవుతున్న విద్యార్థులపై పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించడంతో పాటు తీవ్రంగా లాఠీఛార్జ్ చేశారు. ఈ ఘటనలో పలువురు విద్యార్థులు గాయపడి ఐసీయూలో చికిత్స పొందుతుండటం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. క్రియాశీల క్రికెటర్లు ఈ అంశంపై నేరుగా స్పందించనప్పటికీ, భారత్‌లోని ప్రముఖ క్రికెటర్ల భార్యలు, మాజీ క్రీడాకారులు సోషల్ మీడియా వేదికగా నిరసనకారులపై జరిగిన హింసను తీవ్రంగా ఖండించారు.
సోషల్ మీడియాలో క్రికెటర్ల భార్యలతో పాటు ఇతరుల స్పందన
రితిక సజ్దే (రోహిత్ శర్మ భార్య): భారత మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ భార్య రితిక సజ్దే, నిరసనలో పాల్గొన్న ఒక 9 ఏళ్ల చిన్నారికి సంబంధించిన వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేశారు. పోలీసుల లాఠీచార్జ్‌కు భయపడనని, భగత్ సింగ్‌ను స్ఫూర్తిగా తీసుకుని ఇక్కడికి వచ్చానని ఆ చిన్నారి స్పష్టం చేసిన దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి.
దేవిషా శెట్టి (సూర్యకుమార్ యాదవ్ భార్య): టీమిండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ భార్య దేవిషా శెట్టి వరుస ఇన్‌స్టాగ్రామ్ పోస్టులతో స్పందించారు. “ప్రభుత్వాన్ని విమర్శించడం, ప్రధానిని ప్రశ్నించడం, విధానాలపై నిరసన తెలపడం ప్రజాస్వామ్యం అని చెప్పిన ఆమె, నిరసన పేరిట హింసకు దిగడం, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం కూడా సరికాదని” అభిప్రాయపడ్డారు.
సంజనా గణేశన్ (జస్ప్రీత్ బుమ్రా భార్య): శాంతియుతంగా నిరసన తెలుపుతున్న పిల్లలపై టియర్ గ్యాస్ ప్రయోగించడాన్ని స్పోర్ట్స్ ప్రజెంటర్, జస్ప్రీత్ బుమ్రా భార్య సంజనా గణేశన్ తప్పుబట్టారు. “ఏ ప్రజాస్వామ్యంలోనూ పిల్లలు టియర్ గ్యాస్ వల్ల ఊపిరాడక ఇబ్బంది పడే పరిస్థితిని సాధారణ విషయంగా చూడకూడదు” అని ఆమె తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రియా సరోజ్ (రింకూ సింగ్ కాబోయే భార్య): మచ్ఛలీషహర్ (యుపి) సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ, క్రికెటర్ రింకూ సింగ్ కాబోయే భార్య ప్రియా సరోజ్ నేరుగా జంతర్ మంతర్ వద్దకు వచ్చి విద్యార్థులకు మద్దతు తెలిపారు. సీనియర్ నాయకురాలు డింపుల్ యాదవ్‌తో కలిసి విద్యార్థులపై జరిగిన లాఠీఛార్జ్‌ను తీవ్రంగా నిరసించారు.
చర్చల ద్వారా సమస్య పరిష్కరించుకోవాలన్న యువరాజ్ సింగ్
రెండు సార్లు ప్రపంచ కప్ విజేతగా నిలిచిన మాజీ దిగ్గజ క్రీడాకారుడు యువరాజ్ సింగ్ కూడా ఈ వివాదంపై స్పందించారు. “ప్రతి విద్యార్థికి, ప్రశాంత వాతావరణంలో చదువుకుని తమ కలలను నెరవేర్చుకునే హక్కు ఉంది. హింస కాకుండా శాంతియుత చర్చల ద్వారా మాత్రమే భారత భవిష్యత్తు కోసం ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని కనుగొనవచ్చు” అని ఆయన సోషల్ మీడియాలో పిలుపునిచ్చారు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి