
Sunrisers Hyderabad IPL 2025 Playoffs Scenario: ఐపీఎల్ 2025లో పాట్ కమ్మిన్స్ నేతృత్వంలోని సన్‌రైజర్స్ హైదరాబాద్ తీవ్రంగా నిరాశపరిచింది. ఎస్‌ఆర్‌హెచ్ జట్టు ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచ్‌ల్లో 7 ఓడిపోయి 3 మాత్రమే గెలిచింది. మే 2వ తేదీ శుక్రవారం రాత్రి గుజరాత్ టైటాన్స్‌పై ఓటమితో సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లే ఆఫ్స్ ఆశలు దాదాపు ముగిసిపోయాయి. అయితే, ఆ జట్టు ఇంకా అధికారికంగా టోర్నమెంట్ నుండి నిష్క్రమించలేదు. ఈ క్రమంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్రస్తుత లెక్కలతో ప్లే ఆఫ్స్‌లో చోటు దక్కించుకోగలదా లేదా అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
2025 ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇప్పటివరకు మొత్తం 10 మ్యాచ్‌లు ఆడింది,. అందులో 3 గెలిచి 7 ఓడిపోయింది. ప్రస్తుతం సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఖాతాలో 6 పాయింట్లు ఉన్నాయి. అలాగే, నెట్ రన్ రేట్ -1.192గా ఉంది. SRH ప్లేఆఫ్స్‌కు టికెట్ పొందాలనుకుంటే, ముందుగా మిగిలిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ గెలవాల్సి ఉంటుంది. హైదరాబాద్ ఇలా చేయగలిగితే అప్పుడు ఖాతాలో మొత్తం 14 పాయింట్లు ఉంటాయి. అయితే, ఆ తర్వాత ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడవలసి ఉంటుంది.
IPL 2025 పాయింట్ల పట్టికలో, ముంబై ఇండియన్స్ , గుజరాత్ టైటాన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు ప్రస్తుతం తలో 14 పాయింట్లతో ఉండగా, పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు కూడా అదే సంఖ్యలో పాయింట్లను చేరుకోగలవు.
లీగ్ దశ ముగిసే వరకు టాప్-4లో నిలిచిన జట్లలో ఒకటి 14 పాయింట్ల వద్ద నిలిచిపోవాలని సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్రార్థించాల్సి ఉంటుంది. అయితే, చివరికి సమస్య నెట్ రన్ రేట్‌పై ఆధారపడి ఉంటుంది. ఇటువంటి పరిస్థితిలో హైదరాబాద్ కూడా తన నెట్ రన్ రేట్‌ను మెరుగుపరచుకోవాల్సి ఉంటుంది.
టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ జట్టులో శుభ్‌మాన్ గిల్ (76), జోస్ బట్లర్ (64) హాఫ్ సెంచరీలు సాధించడంతో జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 224 పరుగులు చేసింది. గిల్, బట్లర్ కాకుండా, సాయి సుదర్శన్ 48 పరుగులు అందించాడు. ఇక ఎస్‌ఆర్‌హెచ్ జయదేవ్ ఉనద్కట్ 3 వికెట్లు పడగొట్టాడు. ఈ స్కోరును ఛేదించే క్రమంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు తరపున అభిషేక్ శర్మ 74 పరుగుల అద్భుతమైన ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. కానీ, మరే ఇతర బ్యాట్స్‌మన్ అతనికి మద్దతు ఇవ్వలేకపోయాడు. దీంతో ఆ జట్టు 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 186 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ మ్యాచ్‌లో గుజరాత్ 38 పరుగుల తేడాతో గెలిచింది. ప్రసిధ్ కృష్ణ, మహ్మద్ సిరాజ్ చెరో 2 వికెట్లు తీశారు.
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..