
RCB vs MI : ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్‌తో జరిగిన ఉత్కంఠభరిత పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) అద్భుత విజయాన్ని అందుకుంది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుని అభిమానులను ఖుషీ చేసింది. అయితే, ఈ గెలుపు సంబరాల్లో ఉండగానే ఆర్సీబీ హెడ్ కోచ్ ఆండీ ఫ్లవర్‌కు చేదు వార్త ఎదురైంది. అంపైర్ నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేసినందుకు గాను ఆయనకు బీసీసీఐ భారీ జరిమానా విధించింది.
వివాదానికి కారణమైన ఆ ఒక్క ఫోర్
రాయ్‌పూర్‌లోని షహీద్ వీర్ నారాయణ్ సింగ్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో అసలు డ్రామా 18వ ఓవర్లో మొదలైంది. ఆర్సీబీ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో కృనాల్ పాండ్యా కొట్టిన బంతిని ముంబై ఫీల్డర్ నమన్ ధీర్ బౌండరీ లైన్ వద్ద ఆపే ప్రయత్నం చేశాడు. ఆ సమయంలో అతను బౌండరీ లైన్‌ను తాకాడా లేదా అనే విషయంలో సందిగ్ధత నెలకొంది. థర్డ్ అంపైర్ చాలా సేపు రీప్లేలు చూసిన తర్వాత అది సిక్స్ కాదని నిర్ణయించారు. ఈ నిర్ణయం ఆర్సీబీ క్యాంప్‌లో తీవ్ర అసహనాన్ని కలిగించింది.
హెడ్ కోచ్‌కు 15 శాతం జరిమానా
అంపైర్ నిర్ణయంపై అసంతృప్తితో ఉన్న హెడ్ కోచ్ ఆండీ ఫ్లవర్, టీమ్ మెంటర్ దినేష్ కార్తీక్‌తో కలిసి ఫోర్త్ అంపైర్ వద్దకు వెళ్లి వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో ఆండీ ఫ్లవర్ కాస్త శ్రుతిమించి ప్రవర్తించారని ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ భావించింది. ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌లోని ఆర్టికల్ 2.3 ప్రకారం (అనుచిత భాష వాడటం) లెవల్ 1 నిబంధనను ఉల్లంఘించినందుకు గాను ఆయన మ్యాచ్ ఫీజులో 15 శాతం కోత విధించారు. ఆండీ ఫ్లవర్ కూడా తన తప్పును ఒప్పుకోవడంతో మ్యాచ్ రిఫరీ అమిత్ శర్మ ఈ శిక్షను ఖరారు చేశారు.
నరాలు తెగే ఉత్కంఠ.. ఆఖరి బంతికి విజయం
ఒకవైపు డ్రామా నడుస్తున్నా, మైదానంలో ఆట మాత్రం అదిరిపోయింది. చివరి మూడు బంతుల్లో ఆర్సీబీకి 9 పరుగులు కావాల్సిన సమయంలో భువనేశ్వర్ కుమార్ సిక్సర్ కొట్టి మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. ఇక ఆఖరి బంతికి రెండు పరుగులు తీసి జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. ఈ గెలుపుతో ఆర్సీబీ 14 పాయింట్లతో టేబుల్ టాపర్‌గా నిలవగా, ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్ రేసు నుండి అధికారికంగా నిష్క్రమించింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..