Rohit Sharma : రోహిత్ శర్మ రిటైర్మెంట్ వివాదంపై బీసీసీఐ సీరియస్.. సెలక్టర్లకు బోర్డు గట్టి వార్నింగ్

Rohit Sharma : రోహిత్ శర్మ వన్డే భవిష్యత్తుపై వస్తున్న లీకులపై బీసీసీఐ సీరియస్ అయింది. సెలక్టర్లు మీడియాతో మాట్లాడొద్దంటూ గట్టి హెచ్చరికలు జారీ చేసింది. లార్డ్స్ వన్డే రిటైర్మెంట్ ప్రచారంపై బోర్డు స్పందన ఇప్పుడు భారత క్రికెట్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

Rohit Sharma : రోహిత్ శర్మ రిటైర్మెంట్ వివాదంపై బీసీసీఐ సీరియస్.. సెలక్టర్లకు బోర్డు గట్టి వార్నింగ్
Rohit Sharma

Updated on: Jul 18, 2026 | 12:48 PM

Rohit Sharma : భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ వన్డే భవిష్యత్తుకు సంబంధించి గత కొన్ని రోజులుగా వస్తున్న వార్తలు బోర్డులో తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో బీసీసీఐ సెలెక్షన్ కమిటీపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. రోహిత్‌కు సంబంధించిన అంతర్గత విషయాలు, చర్చలు మీడియాకు లీక్ కావడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన బీసీసీఐ, జాతీయ పురుషుల క్రికెట్ జట్టు సెలక్టర్లకు కీలక ఆదేశాలు జారీ చేసింది. మీడియా ప్రతినిధులతో ఎలాంటి ముఖాముఖి చర్చలు జరపవద్దని, సమాచారాన్ని బయటకు పొక్కనివ్వకూడదని సెలక్టర్లను బోర్డు గట్టిగా హెచ్చరించినట్లు తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి.

లార్డ్స్ వన్డేనే ఆఖరిదంటూ జోరుగా ప్రచారం

కార్డిఫ్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో వన్డేలో భారత్ ఓటమి పాలైన సంగతి తెలిసిందే. అయితే ఈ ఓటమి కంటే కూడా లార్డ్స్ వేదికగా జరగబోయే మూడో వన్డే మ్యాచ్ రోహిత్ శర్మ కెరీర్‌లో చివరి వన్డే కాబోతోందంటూ వచ్చిన నివేదికలే క్రికెట్ ప్రపంచంలో హాట్ టాపిక్‌గా మారాయి. ప్రసిద్ధ క్రీడా వెబ్‌సైట్ క్రిక్‌బజ్ నివేదిక ప్రకారం.. టీమిండియా డ్రెస్సింగ్ రూమ్, సెలెక్షన్ కమిటీ మధ్య జరుగుతున్న విషయాలు నిరంతరం బయటకు రావడంపై బీసీసీఐ పెద్దలు అస్సలు సంతోషంగా లేరు. ప్రస్తుతం పరిస్థితి చాలా సున్నితంగా ఉందని, అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడే వరకు ఇలాంటి ఊహాగానాలను నమ్మవద్దని బోర్డు వర్గాలు చెబుతున్నాయి.

రోహిత్ శర్మ 2027 వరల్డ్ కప్ కల నెరవేరుతుందా?

భారత క్రికెట్‌లో ఎప్పుడూ రకరకాల కథనాలు ప్రచారంలో ఉంటాయి. ప్రస్తుతం అందరి దృష్టి రోహిత్ శర్మ తన కల అయిన 2027 వన్డే ప్రపంచకప్‎లో ఆడతాడా లేదా అనే అంశంపైనే ఉంది. అయితే, రోహిత్ ప్రస్తుత ఫామ్ సెలక్టర్లను పెద్దగా ఆకట్టుకోవడం లేదు. గత 8 వన్డే ఇన్నింగ్స్‌లలో రోహిత్ కేవలం 30.12 సగటుతో, 88.60 స్ట్రైక్ రేట్‌తో 241 పరుగులు మాత్రమే చేశాడు. ఈ పేలవమైన గణాంకాల కారణంగా కొందరు సెలక్టర్లు మాజీ కెప్టెన్‌ను ఇకపై వన్డే ఫార్మాట్‌లో కొనసాగించడం ఇష్టం లేనట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఆఫ్ఘనిస్తాన్ సిరీస్ ముందే క్లారిటీ ఇచ్చిన సెలక్టర్లు

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. గత నెలలో ఆఫ్ఘనిస్తాన్ సిరీస్ ప్రారంభానికి ముందే సెలెక్షన్ కమిటీలోని కొందరు సభ్యులు రోహిత్ శర్మతో మాట్లాడినట్లు తెలుస్తోంది. తమ భవిష్యత్తు ప్రణాళికల్లో రోహిత్‌ను పరిగణనలోకి తీసుకోవడం లేదని వారు స్పష్టం చేసినట్లు టాక్. ఈ చర్చల సమయంలో టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‎ను కూడా సెలక్టర్లు లూప్‌లో ఉంచారు. అయితే ఆ తర్వాత రోహిత్ శర్మ నేరుగా బీసీసీఐలోని టాప్ మేనేజ్‌మెంట్‌ను సంప్రదించడంతో అతడిని ఆఫ్ఘనిస్తాన్ సిరీస్‌తో పాటు ప్రస్తుత ఇంగ్లాండ్ సిరీస్‌కు కూడా ఎంపిక చేశారు.

సెక్రటరీ దేవాజిత్ సైకియా క్లారిటీ

ప్రస్తుతం ఇంగ్లాండ్‌తో జరుగుతున్న సిరీస్‌లో కూడా రోహిత్ శర్మ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. మొదటి రెండు వన్డేల్లో వరుసగా 11, 26 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. దీంతో సెలక్టర్లు తమ పాత నిర్ణయాన్నే రోహిత్‌కు మరోసారి గుర్తుచేసినట్లు సమాచారం. అయితే మరోవైపు ఈ వివాదాలన్నింటికీ తెరదించుతూ బీసీసీఐ సెక్రటరీ దేవాజిత్ సైకియా కీలక వ్యాఖ్యలు చేశారు. రోహిత్ రిటైర్మెంట్ వార్తలను ఆయన పూర్తిగా తోసిపుచ్చారు. జట్టు ప్రణాళికలకు అనుగుణంగా రాణిస్తూ, ఫిట్‌నెస్‌తో ఉన్నంత కాలం రోహిత్ శర్మ జట్టులో కొనసాగుతాడని ఆయన స్పష్టం చేశారు. దీంతో లార్డ్స్ వన్డే తర్వాత ఏం జరగబోతుందనే సస్పెన్స్ మరింత పెరిగింది.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us