Ajinkya Rahane : రూల్స్ బ్రేక్ చేసిన రహానే.. బీసీసీఐ రూ. 12 లక్షల ఫైన్.. ఈ సీజన్‌లో జరిమానా ఎదుర్కొన్న నాలుగో కెప్టెన్‌గా రికార్డ్

Ajinkya Rahane : ఐపీఎల్ 2026 లో కేకేఆర్ కెప్టెన్ అజింక్య రహానేకు బీసీసీఐ రూ.12 లక్షల జరిమానా విధించింది. ఈ విధంగా ఈ సీజన్లో జరిమానా పడిన నాలుగో కెప్టెన్ రహానే. ఇప్పటి వరకు వరుసగా 5 మ్యాచ్‌ల్లో ఓటమి పాలై ఐపీఎల్ పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉంది.

Ajinkya Rahane : రూల్స్ బ్రేక్ చేసిన రహానే.. బీసీసీఐ రూ. 12 లక్షల ఫైన్.. ఈ సీజన్‌లో జరిమానా ఎదుర్కొన్న నాలుగో కెప్టెన్‌గా రికార్డ్
Ajinkya Rahane

Updated on: Apr 15, 2026 | 9:08 AM

Ajinkya Rahane : ఐపీఎల్ 2026 సీజన్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) కష్టాలు రెట్టింపయ్యాయి. మైదానంలో వరుస ఓటములతో సతమతమవుతున్న ఆ జట్టుకు ఇప్పుడు బీసీసీఐ (BCCI) రూపంలో మరో షాక్ తగిలింది. మంగళవారం చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ కారణంగా కేకేఆర్ కెప్టెన్ అజింక్య రహానేకు భారీ జరిమానా విధించారు. అసలే గెలవక ఇబ్బంది పడుతుంటే, ఇప్పుడు క్రమశిక్షణ చర్యలు కూడా తోడవ్వడంతో కేకేఆర్ శిబిరంలో ఆందోళన మొదలైంది.

రహానేకు జరిమానా ఎందుకు?

చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరిగిన 22వ మ్యాచ్‌లో నిర్ణీత సమయంలోగా ఓవర్లను పూర్తి చేయడంలో కోల్‌కతా నైట్ రైడర్స్ విఫలమైంది. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.22 ప్రకారం, ఇది కనీస ఓవర్ రేట్ నిబంధన ఉల్లంఘన కిందకు వస్తుంది. ఈ సీజన్‌లో కేకేఆర్‌కు ఇది మొదటి తప్పు కావడంతో కెప్టెన్ అజింక్య రహానేకు రూ. 12 లక్షల జరిమానా విధించారు. ఈ సీజన్‌లో రహానే కంటే ముందు శ్రేయాస్ అయ్యర్ (రెండుసార్లు), శుభ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్ కూడా ఇదే తప్పు చేసి ఫైన్ కట్టారు.

కోల్‌కతా నైట్ రైడర్స్ పతనం

2024లో ఛాంపియన్లుగా నిలిచిన కేకేఆర్, 2026 సీజన్‌లో మాత్రం అత్యంత దారుణమైన ఫామ్‌లో ఉంది. ఐపీఎల్ చరిత్రలో మొదటి 5 మ్యాచ్‌లలో ఒక్క విజయం కూడా సాధించకపోవడం కేకేఆర్‌కు ఇదే తొలిసారి. ముంబై ఇండియన్స్‌తో ఓటమితో మొదలైన ప్రస్థానం.. సన్ రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జెయింట్స్, తాజాగా చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో వరుస పరాజయాల వరకు సాగింది. కేవలం వర్షం వల్ల రద్దయిన పంజాబ్ కింగ్స్ మ్యాచ్ ద్వారా వచ్చిన ఒక్క పాయింట్ మాత్రమే వారిని జీరో నుంచి కాపాడింది.

ఆందోళనలో అభిమానులు

కేకేఆర్ వరుసగా ఆరు మ్యాచ్‌ల్లో (గత సీజన్ చివరి రెండు మ్యాచ్‌లతో కలిపి) ఓడిపోవడం ఇది ఉమ్మడి రెండో అతిపెద్ద ఓటమి పరంపర. 2019లో కూడా వరుసగా ఆరు మ్యాచ్‌లు ఓడిపోయిన కేకేఆర్, 2009లో ఏకంగా వరుసగా తొమ్మిది మ్యాచ్‌ల్లో ఓడిపోయి అత్యంత పేలవమైన రికార్డును నమోదు చేసింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉన్న కోల్‌కతా జట్టు ప్లే-ఆఫ్ రేసులోకి రావాలంటే ఇకపై అద్భుతం జరగాల్సిందే.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us