Age Fraud: భారత క్రికెట్‌లో సంచలనం.. వయసు మార్చి దొరికిపోయిన యంగ్ ప్లేయర్.. బీసీసీఐ వేటు

Age Fraud: భారత అండర్-19 క్రికెట్‌లో వయసు మోసం కలకలం రేపింది. వయసు ధ్రువీకరణ పత్రాల్లో అవకతవకలు చేసినట్లు తేలడంతో రోహిత్ యాదవ్‌పై బీసీసీఐ వేటు వేసింది. ఆస్ట్రేలియాతో జరగనున్న అండర్-19 వన్డే, మల్టీ-డే సిరీస్‌ల నుంచి అతడిని తొలగించి, అతడి స్థానంలో ఆర్యన్ సవసాని, తన్మయ్ బలోదాలను ఎంపిక చేసింది. బీసీసీఐ కఠిన చర్యలు చేపట్టింది.

Age Fraud: భారత క్రికెట్‌లో సంచలనం.. వయసు మార్చి దొరికిపోయిన యంగ్ ప్లేయర్.. బీసీసీఐ వేటు
Rohit Yadav

Updated on: Sep 08, 2026 | 11:33 AM

Age Fraud:ఆస్ట్రేలియా అండర్-19 జట్టుతో సిరీస్‌కు సిద్ధమవుతున్న భారత యువ జట్టులో తీవ్ర కలకలం రేగింది. వయసు పెంపుదలలో తీవ్ర అవకతవకలకు పాల్పడినట్లు తేలడంతో యంగ్ క్రికెటర్ రోహిత్ యాదవ్‌ను బీసీసీఐ జట్టు నుంచి తక్షణమే తొలగిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ పరిధిలో ఏజ్ గ్రూప్ క్రికెట్ ఆడుతున్న రోహిత్ యాదవ్ వయసు సమాచారంలో తీవ్ర వ్యత్యాసాలు ఉన్నట్లు అంతర్గత విచారణలో తేలింది. అతడి అసలు వయసుకు, సమర్పించిన ధ్రువీకరణ పత్రాలకు మధ్య ఏకంగా 27 నెలల వ్యత్యాసం ఉన్నట్లు క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ (సిఏబి) గుర్తించింది. జనన ధ్రువీకరణ పత్రంలో పుట్టిన సంవత్సరాన్ని ఏకంగా మూడుసార్లు మార్చినట్లు విచారణాధికారులు ఆధారాలు సేకరించారు. ఇటీవల జరిగిన శ్రీలంక పర్యటనలోనూ రోహిత్ యాదవ్ భారత అండర్-19 జట్టుకు ప్రాతినిధ్యం వహించడం గమనార్హం.

అధికారిక ప్రకటన విడుదల చేసిన బీసీసీఐ

ఈ అవకతవకలపై స్పందించిన బీసీసీఐ జూనియర్ సెలక్షన్ కమిటీ రోహిత్ యాదవ్‌పై కఠిన చర్యలు చేపట్టింది. రాజ్‌కోట్, అహ్మదాబాద్ వేదికలుగా ఆస్ట్రేలియా అండర్-19 జట్టుతో జరగబోయే వన్డే, మల్టీ-డే సిరీస్‌లకు సెలక్ట్ చేసిన జట్టు నుంచి అతడిని తప్పించింది. రోహిత్ స్థానంలో వన్డే జట్టులోకి సౌరాష్ట్రకు చెందిన ఆర్యన్ సవసానిని, మల్టీ-డే మ్యాచ్‌ల కోసం హర్యానాకు చెందిన తన్మయ్ బలోదాను భారత సెలెక్టర్లు జట్టులోకి ఎంపిక చేశారు. వయసు మోసాలపై బీసీసీఐ జీరో టాలరెన్స్ విధానాన్ని పాటిస్తుందని మరోసారి స్పష్టం చేసింది.

ఆస్ట్రేలియాతో తలపడనున్న భారత సవరించిన జట్లు

సవరించిన భారత అండర్-19 వన్డే జట్టుకు లక్ష్య రాయ్‌చందాని సారథ్యం వహించనుండగా, యశ్‌బర్ధన్ చౌహాన్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తారు. ఈ జట్టులో ఆర్యవీర్ సెహ్వాగ్, అన్వయ్ ద్రావిడ్, వి.కె.వినీత్, కుషాగ్ర ఓఝా లాంటి ప్రతిభావంతులైన కుర్రాళ్లు ఉన్నారు. మల్టీ-డే మ్యాచ్‌ల జట్టుకు యశ్‌బర్ధన్ చౌహాన్ కెప్టెన్‌గా, లక్ష్య రాయ్‌చందాని డిప్యూటీగా వ్యవహరిస్తారు. ఈ జట్టులో సాగర్ విర్క్, అయాన్ అక్రమ్, మానవ్ కృష్ణ, ప్రణవ్ రాఘవేంద్ర చోటు దక్కించుకున్నారు.

సెప్టెంబర్ 18 నుంచి సిరీస్ రణరంగం

భారత్, ఆస్ట్రేలియా అండర్-19 జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ సెప్టెంబర్ 18న రాజ్‌కోట్‌లోని నిరంజన్ షా స్టేడియంలో ప్రారంభం కానుంది. రెండో వన్డే సెప్టెంబర్ 21న, మూడో వన్డే సెప్టెంబర్ 23న ఇదే మైదానంలో జరుగుతాయి. అనంతరం రెండు మల్టీ-డే (నాలుగు రోజుల) మ్యాచ్‌ల సిరీస్ జరగనుంది. తొలి మల్టీ-డే మ్యాచ్ సెప్టెంబర్ 27 నుంచి రాజ్‌కోట్‌లో, రెండో మ్యాచ్ అక్టోబర్ 5 నుంచి అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతుంది.

 

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us