Team India: నితీశ్ రెడ్డి స్థానంలో ఆ ఆటగాడికి ఛాన్స్.. బీసీసీఐ అధికారిక ప్రకటన

గాయం కారణంగా ఐర్లాండ్, ఇంగ్లండ్ టీ20 సిరీస్‌లకు నితీశ్ కుమార్ రెడ్డి దూరమయ్యాడు. నితీశ్ స్థానంలో సూర్యాంశ్ షెడ్గేను టీమిండియాలోకి బీసీసీఐ ఎంపిక చేసింది. ఇది షెడ్గేకు తొలి అంతర్జాతీయ టీ20 పిలుపు కావడం విశేషం. సూర్యాంశ్ షెడ్గే ఎవరు? తదితర మరిన్ని వివరాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది.

Team India: నితీశ్ రెడ్డి స్థానంలో ఆ ఆటగాడికి ఛాన్స్.. బీసీసీఐ అధికారిక ప్రకటన
Nitish Kuma Reddy

Updated on: Jun 23, 2026 | 3:19 PM

భారత జట్టుకు గాయంతో దూరమైన యువ ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి స్థానంలో బీసీసీఐ ఎవరికి అవకాశం కల్పిస్తుందన్న సస్పెన్స్‌‌‌కు తెరపడింది. నితీశ్ కుమార్ రెడ్డి స్థానంలో సూర్యాంశ్ షెడ్గేను జట్టులోకి ఎంపిక చేసినట్లు బీసీసీఐ ప్రకటించింది. ఐర్లాండ్‌తో జరిగే రెండు టీ20 మ్యాచ్‌లు, ఆ తర్వాత ఇంగ్లండ్‌తో జరిగే ఐదు టీ20ల సిరీస్‌కు షెడ్గే భారత జట్టులో చోటు దక్కించుకున్నాడు. ముంబైకి చెందిన 23 ఏళ్ల ఈ ఆల్‌రౌండర్‌కు ఇది తొలి అంతర్జాతీయ టీ20 డెబ్యూ కావడం విశేషం. నితీశ్ రెడ్డి ఎడమ తొడ కండరానికి గాయం కావడంతో.. వైద్యుల సూచన మేరకు రెహాబిలిటేషన్ తీసుకోనున్నాడు. దీంతో నితీశ్ రెడ్డి ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనలకు దూరమయ్యాడు.

నితీశ్ రెడ్డి స్థానంలో సూర్యాంశ్ షెడ్గే‌ను ఎంపిక చేసినట్లు బీసీసీఐ ప్రకటన

ఎవరీ సూర్యాంశ్ షెడ్గే?

ముంబైకి చెందిన సూర్యాంశ్ షెడ్గే దేశీయ క్రికెట్‌లో మెరుగైన ప్రదర్శనలతో బీసీసీఐ సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. ఇటీవల శ్రీలంకలో జరిగిన ఇండియా-ఏ త్రిసిరీస్‌లో ఐదు ఇన్నింగ్స్‌ల్లో 147 పరుగులతో రాణించాడు. అలాగే అవసరమైనప్పుడు బౌలింగ్ కూడా చేయగల ఆల్‌రౌండర్‌గా పేరు తెచ్చుకున్నాడు.

అటు పంజాబ్ కింగ్స్ తరఫున 2026 ఐపీఎల్ సీజన్‌లోనూ షెడ్గే రాణించాడు. అతని దూకుడైన బ్యాటింగ్, ఫినిషింగ్ సామర్థ్యం సెలెక్టర్లను ఆకట్టుకోవడంతో నేరుగా టీమిండియాలో చోటు దక్కించుకున్నాడు. ఈ మెరుగైన ప్రదర్శనలే అతనికి జాతీయ జట్టులో అవకాశం తెచ్చిపెట్టాయి.

భారత జట్టు సిద్ధం

భారత్ జట్టు జూన్ 26, 28 తేదీల్లో ఐర్లాండ్‌తో రెండు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. అనంతరం జూలైలో ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తలపడనుంది. నితీశ్ రెడ్డి గైర్హాజరీతో వచ్చిన అవకాశాన్ని సూర్యాంశ్ షెడ్గే ఎలా వినియోగించుకుంటాడో ఆసక్తికరంగా మారింది.

Follow Us