
Bangladesh New Sports Minister Aminul Haque: టీ20 వరల్డ్ కప్‌నకు ముందు బంగ్లాదేశ్, భారత్ మధ్య పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. షెడ్యూల్ ప్రకారం భారత్‌కు వచ్చి మ్యాచ్‌లు ఆడేందుకు బంగ్లాదేశ్ జట్టు నిరాకరించడంతో పెద్ద వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. దీనికి ప్రధాన కారణం ఐపీఎల్‌లో ముడిపడి ఉంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) నుంచి బంగ్లాదేశ్ స్టార్ బౌలర్ ముస్తఫిజుర్ రెహమాన్‌కు ఆడే అవకాశం ఇవ్వకపోవడమేనని బీసీబీ (బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు) వర్గాలు అభిప్రాయపడ్డాయి.
అమీనుల్ ఇస్లాం బుల్బుల్ నేతృత్వంలోని బీసీబీ, భారత్‌లో భద్రతాపరమైన ప్రమాదం ఉందన్న కారణంతో తమ మ్యాచ్‌లను వేరే దేశానికి మార్చాలని ఐసీసీని కోరింది. అయితే ఐసీసీ ఆ అభ్యర్థనను తిరస్కరించడంతో బంగ్లాదేశ్ టీ20 వరల్డ్ కప్ నుంచి తొలగించబడింది. ఈ వ్యవహారం ఐసీసీ, బీసీసీఐతో బంగ్లాదేశ్ మధ్య తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.
ఈ వివాదాల నడుమ బంగ్లాదేశ్‌లో ఎన్నికలు జరిగాయి. మాజీ జాతీయ ఫుట్‌బాల్ జట్టు కెప్టెన్ అమీనుల్ హక్, బీఎన్‌పీ నేతృత్వంలోని ప్రభుత్వంలో యువజన, క్రీడల శాఖ రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన బాధ్యతలు చేపట్టిన వెంటనే భారత్‌తో సంబంధాలను తిరిగి బలోపేతం చేయాలనే సంకల్పం వ్యక్తం చేయడం గమనార్హం.
“పదవి చేపట్టిన వెంటనే భారత్ డిప్యూటీ హై కమిషనర్‌ను కలుసుకుని స్నేహపూర్వక చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవడం గురించి మాట్లాడాను. పొరుగుదేశాలతో మంచి సంబంధాలు కొనసాగించాలని మా లక్ష్యం. క్రీడా రంగంలో ఏర్పడే సమస్యలను దౌత్య చర్చల ద్వారా పరిష్కరించాలి. క్రికెట్ విషయంలో ఐసీసీ నిబంధనలకు అనుగుణంగా అవసరమైన చర్యలు తీసుకుంటాం” అని అమీనుల్ హక్ ‘డైలీ స్టార్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.
భారత్‌కు రావడానికి నిరాకరించినందుకు బంగ్లాదేశ్‌పై ఐసీసీ ఎలాంటి శిక్షలు విధించలేదు. అధికారిక ఐసీసీ ప్రకటన ప్రకారం, టీ20 వరల్డ్ కప్‌లో పాల్గొనకపోయినందుకు బంగ్లాదేశ్‌కు ఎలాంటి జరిమానా లేదా నిషేధం ఉండదు. అంతేకాకుండా, భవిష్యత్తులో ఐసీసీ టోర్నమెంట్లకు ఆతిథ్య హక్కులు కల్పిస్తామని కూడా హామీ ఇచ్చింది.
ఈ నిర్ణయం “నిష్పక్షపాతత్వం, న్యాయసూత్రాల” ఆధారంగా తీసుకున్నామని, శిక్ష విధించడం కంటే సహకారం అందించడమే లక్ష్యమని ఐసీసీ స్పష్టం చేసింది. బీసీబీకి అవసరమైతే ఐసీసీ డిస్ప్యూట్ రిజల్యూషన్ కమిటీని ఆశ్రయించే హక్కు కూడా ఉందని పేర్కొంది.
హోస్టింగ్ హక్కుల విషయానికి వస్తే, 2031 మెన్స్ క్రికెట్ వరల్డ్ కప్‌ను భారత్‌తో కలిసి బంగ్లాదేశ్ సహ-ఆతిథ్యం ఇవ్వనుంది. అంతేకాకుండా మరో గ్లోబల్ టోర్నమెంట్‌కు కూడా బంగ్లాదేశ్‌కు హోస్టింగ్ అవకాశాలు కల్పిస్తామని ఐసీసీ హామీ ఇచ్చింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..